ఏపీ టెట్‌లో 150కి 151 మార్కులు!

ఏదైనా పరీక్ష 150 మార్కులకు రాస్తే ఎన్ని వస్తాయి? గరిష్ఠంగా 150 లేదా అంతకంటే తక్కువ మార్కులు వస్తాయి. అయితే... పాఠశాల విద్యాశాఖ నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌)లో 150కి 151, 150.86, 150.64, 150.26, మార్కులు వచ్చాయి.

Updated : 01 Oct 2022 06:23 IST

ఈనాడు, అమరావతి: ఏదైనా పరీక్ష 150 మార్కులకు రాస్తే ఎన్ని వస్తాయి? గరిష్ఠంగా 150 లేదా అంతకంటే తక్కువ మార్కులు వస్తాయి. అయితే... పాఠశాల విద్యాశాఖ నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌)లో 150కి 151, 150.86, 150.64, 150.26, మార్కులు వచ్చాయి. ఇదేంటి? అని అనుకుంటున్నారా? అధికారులు నిర్వహించిన నార్మలైజేషన్‌ విధానంతో ఈ పరిస్థితి ఏర్పడింది. టెట్‌ ఫలితాలను శుక్రవారం వెబ్‌సైట్‌లో ఉంచారు. గరిష్ఠం కంటే ఎక్కువ మార్కులు రావడంతో వాటిని చూసి అభ్యర్థులు సైతం ఆందోళనకు గురయ్యారు. ఇలా ఒక్కరికో ఇద్దరికో కాదు.. దాదాపు 8 మంది ఎస్జీటీ పరీక్ష రాసిన విద్యార్థులకు ఇదే రీతిలో ఫలితాలు వచ్చాయి. టెట్‌ పరీక్షను ఈ ఏడాది కంప్యూటర్‌ ఆధారిత విధానంలో 16 రోజుల పాటు నిర్వహించిన పరీక్షలకు 4,07,329మంది హాజరయ్యారు. ఇన్ని రోజుల పరీక్షల్లో ఒక రోజు ప్రశ్నపత్రం కఠినంగా.. మరొక రోజు తేలికగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో అభ్యర్థులందరికీ సమ న్యాయం చేసేందుకు నార్మలైజేషన్‌ విధానాన్ని అమలు చేస్తారు. ఏపీఈఏపీసెట్‌, జేఈఈ మెయిన్స్‌, అడ్వాన్సుడ్‌లాంటి వాటిల్లోనూ ఇదే విధానాన్ని పాటిస్తారు. నార్మలైజేషన్‌ చేసే సమయంలో గరిష్ఠ 150 మార్కుల కంటే ఎక్కువ వచ్చినా వాటిని 150కే పరిమితం చేయాలి. పాఠశాల విద్యాశాఖ మాత్రం ఫలితాల విడుదలలో ఎలాంటి పరిశీలన చేసుకోకుండానే 150కి 151 మార్కులను ఇచ్చేసింది. కఠిన ప్రశ్నపత్రంలోనూ ఎక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థులకు 150కంటే ఎక్కువ వచ్చాయని అధికారులు వెల్లడించారు. ప్రశ్నపత్రం తేలికగా ఉన్న వారికి ఎక్కువ మార్కులు వస్తే కఠినంగా వచ్చిన వారికి అదనంగా మార్కులు కలుస్తాయని, ఇలాంటి సమయంలో ఇదే జరుగుతుందని పేర్కొన్నారు. ఈ అభ్యర్థులకు మళ్లీ ప్రత్యేకంగా 150 మార్కులను మాత్రమే ఇస్తామని ప్రకటించారు. ఎస్జీటీకి పేపర్‌-1ఏ, విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక పాఠశాలల్లో 1-5 తరగతుల బోధనకు పేపర్‌-బీ, స్కూల్‌ అసిస్టెంట్లకు పేపర్‌-2ఏ, ప్రత్యేక ఉపాధ్యాయులకు పేపర్‌-2బీ పెట్టారు. ఈ పరీక్షను 150 మార్కులకు నిర్వహించారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts