సమస్యలపై విద్యామంత్రి నివాసం ముట్టడిస్తాం

తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఏపీ సమగ్ర శిక్ష, కేజీబీవీ కింద పనిచేస్తున్న కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు శుక్రవారం విజయవాడ పటమటలోని సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

Published : 01 Oct 2022 03:23 IST

విజయవాడలో సమగ్ర శిక్ష కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల ధర్నా

పటమట(విజయవాడ) న్యూస్‌టుడే: తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఏపీ సమగ్ర శిక్ష, కేజీబీవీ కింద పనిచేస్తున్న కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు శుక్రవారం విజయవాడ పటమటలోని సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఎ.పి.సమగ్ర శిక్ష కాంట్రాక్టు అండ్‌ అవుట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో ఉద్యోగులు పాల్గొని ఉదయం 10.30 గంటల నుంచి 2.30 గంటలకు వరకు నిరసన తెలిపారు. తమను రెగ్యులరైజ్‌ చేయాలని, పీఆర్‌సీ అమలు చేయాలని, ఉద్యోగ భద్రత, సమాన పనికి, సమాన వేతనం ఇవ్వాలని నినాదాలు చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే నవంబరులో విద్యాశాఖ మంత్రి నివాసం ముట్టడి కార్యక్రమం చేపడతామని జేఏసీ నాయకులు హెచ్చరించారు. ఈ సందర్భంగా ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.బాలకాశి, ఎమ్మెల్సీ కె.ఎస్‌.లక్ష్మణ్‌రావు, ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ మాట్లాడుతూ... సీఎం జగన్‌ ఎన్నికల సమయంలో కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్‌ చేసి కనీస వేతనం అమలు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అనంతరం పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌కుమార్‌కు ఎమ్మెల్సీలు, జేఏసీ నేతలు వినతిపత్రం అందజేశారు. సార్వత్రిక విద్యాపీఠం డైరెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి ఉద్యోగుల వద్దకు వచ్చి... దసరా సెలవుల అనంతరం పాఠశాల విద్యాశాఖకు సంబంధించి సమస్యలు పరిష్కరించి, మిగతా వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో ఉద్యోగులు ఆందోళన విరమించారు. ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు, ఎ.పి.సమగ్ర శిక్ష కాంట్రాక్టు అండ్‌ అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల కో-ఛైౖర్మన్‌ బి.కాంతారావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని