ప్రైవేటు డిగ్రీ కళాశాలల అనుమతుల పునరుద్ధరణలో ఇష్టారాజ్యం

ప్రైవేటు డిగ్రీ కళాశాలల అనుమతుల పునరుద్ధరణ వ్యవహారం గందరగోళంగా మారింది. కళాశాలల రెన్యువల్‌ను నిలిపివేసిన అధికారే హడావుడిగా అర్ధరాత్రి మళ్లీ కొన్నింటి అనుమతులను పునరుద్ధరించాలని వర్సిటీలపై ఒత్తిడి తీసుకురావడం చర్చనీయాంశమైంది.

Published : 01 Oct 2022 03:23 IST

ఈనాడు, అమరావతి: ప్రైవేటు డిగ్రీ కళాశాలల అనుమతుల పునరుద్ధరణ వ్యవహారం గందరగోళంగా మారింది. కళాశాలల రెన్యువల్‌ను నిలిపివేసిన అధికారే హడావుడిగా అర్ధరాత్రి మళ్లీ కొన్నింటి అనుమతులను పునరుద్ధరించాలని వర్సిటీలపై ఒత్తిడి తీసుకురావడం చర్చనీయాంశమైంది. ఉన్నత విద్యాశాఖకు చెందిన ఓ కీలక అధికారి, ఆయన వద్ద నుండే పొరుగుసేవల ఉద్యోగి తీసుకుంటున్న ఈ నిర్ణయాలు ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. తరచూ మారుతున్న అధికారుల నిర్ణయాలకు తోడు ఆన్‌లైన్‌ సాంకేతిక లోపాల కారణంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాంతో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి డిగ్రీ ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ రెండు నెలలైనా ఇంకా కొనసాగుతూనే ఉంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,033 ప్రైవేటు డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. విశ్వవిద్యాలయాలే అనుమతులను పునరుద్ధరించి, కోర్సులు, సీట్ల వివరాలను ఈ-లేఖలో అందించాలని నిర్ణయించారు. దీనికి అనుగుణంగా జులైలోనే వర్సిటీలు చర్యలు చేపట్టాయి. ప్రైవేటు కళాశాలల్లోని సదుపాయాలు, అధ్యాపకుల అర్హతలను ఆన్‌లైన్‌లో ఉంచారు. ఆగస్టు నెల చివరిలో కళాశాలల్లోని సదుపాయాలను ఆన్‌లైన్‌లో పరిశీలించిన ఉన్నత విద్యాశాఖ అధికారి సదుపాయాలు లేని వాటిల్లో మరోమారు తనిఖీ చేయాలని ఆదేశించారు. ఆ విధంగా 200 కళాశాలల జాబితాలను సంబంధిత వర్సిటీలకు పంపించారు. వీటిని పరిశీలించిన అనంతరం 150 కళాశాలలకు సంబంధించిన అనుమతుల పునరుద్ధరణ నిలిపివేయాలని ఉన్నతాధికారి ఆదేశించారు. వర్సిటీలు పాలకవర్గ సమావేశాల్లో ఈ జాబితాలను పెట్టి ఆమోదం తీసుకున్నాయి. ఇక్కడి వరకు బాగానే సాగింది. ఇప్పుడు ఆ ఉన్నతాధికారే అర్ధరాత్రి కొన్ని కళాశాలలకు అనుమతులు ఇవ్వాలంటూ ఒత్తిడి తీసుకొస్తున్నారు. కృష్ణా విశ్వవిద్యాలయం పరిధిలోని ఒక కళాశాల ప్రైవేటు భవనంలో నుంచి మరో ప్రైవేటు భవనంలోకి ఎలాంటి అనుమతులు లేకుండా మారిపోయింది. ఈ కళాశాలలో అనేక లోపాలున్నట్లు గుర్తించి ఆపేశారు. ఆ ఉన్నతాధికారి హడావుడిగా ఈ కళాశాలను పేరును ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయించారు. గత రెండు రోజుల్లోనే  9 కళాశాలలను ఆన్‌లైన్‌లో పెట్టాలని ఆయన ఆదేశించడం గమనార్హం. ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలోని విజయనగరంలో రెండు కళాశాలలను ఆన్‌లైన్‌ జాబితాలో పెట్టాలని ఒత్తిడి చేస్తున్నారు. మరో పక్క కృష్ణా జిల్లాలోనే సొంత భవనంలో ఉన్న ఓ కళాశాలకు రెండెకరాలు స్థలం లేదని ఆపివేయడంపైనా విమర్శలు వస్తున్నాయి. ఇలా... మొత్తం 150 కళాశాలల్లో తొమ్మిందింటికి అనుమతులు ఇవ్వడంతో మిగిలిన 141 కళాశాలలకు ఆపేయడంతో ఈ ఏడాది దాదాపు 45 వేల డిగ్రీ సీట్లు తగ్గనున్నాయి.

కనిపించని కోర్సులు: వెబ్‌సైట్‌లో కొన్ని కళాశాలల్లో కోర్సులు కనిపించకపోవడం లాంటి ఘటనలతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. వర్సిటీల వద్ద అనుమతుల పునరుద్ధరణ సాఫ్ట్‌వేర్‌ వర్క్‌ను సీఎఫ్‌ఎస్‌ఎస్‌ చేస్తుండగా.. వెబ్‌ ఐచ్ఛికాలను ఏపీ ఆన్‌లైన్‌ చేస్తోంది. ఈ రెండింటి మధ్య సమన్వయం లేకపోవడంతో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts