ఓఎంసీ కేసులో నిందితుల డిశ్ఛార్జి పిటిషన్లపై నిర్ణయం 17న

అనంతపురం జిల్లా డి.హీరేహాళ్‌, ఓబుళాపురం మండలాల్లో ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీ అక్రమ మైనింగ్‌కు పాల్పడిన కేసులోని నిందితులైన ఉమ్మడి రాష్ట్రంలో గనుల శాఖ, ప్రస్తుత తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఏపీ సీనియర్‌ ఐఏఎస్‌ వై.శ్రీలక్ష్మి, మాజీ ఐఏఎస్‌ కృపానందం, గనులశాఖ మాజీ డైరెక్టర్‌ వి.డి.రాజగోపాల్‌, గాలి జనార్దన్‌రెడ్డి వ్యక్తిగత సహాయకుడు మెఫజ్‌ అలీఖాన్‌ దాఖలుచేసిన డిశ్ఛార్జి పిటిషన్లపై హైదరాబాద్‌ సీబీఐ కోర్టులో వాదనలు ముగిశాయి.

Updated : 01 Oct 2022 06:13 IST

ఈనాడు, హైదరాబాద్‌: అనంతపురం జిల్లా డి.హీరేహాళ్‌, ఓబుళాపురం మండలాల్లో ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీ అక్రమ మైనింగ్‌కు పాల్పడిన కేసులోని నిందితులైన ఉమ్మడి రాష్ట్రంలో గనుల శాఖ, ప్రస్తుత తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఏపీ సీనియర్‌ ఐఏఎస్‌ వై.శ్రీలక్ష్మి, మాజీ ఐఏఎస్‌ కృపానందం, గనులశాఖ మాజీ డైరెక్టర్‌ వి.డి.రాజగోపాల్‌, గాలి జనార్దన్‌రెడ్డి వ్యక్తిగత సహాయకుడు మెఫజ్‌ అలీఖాన్‌ దాఖలుచేసిన డిశ్ఛార్జి పిటిషన్లపై హైదరాబాద్‌ సీబీఐ కోర్టులో వాదనలు ముగిశాయి. విచారణ చేపట్టిన సీబీఐ ప్రత్యేకకోర్టు ప్రధాన జడ్జి సీహెచ్‌.రమేశ్‌బాబు నిర్ణయాన్ని అక్టోబరు 17కు వాయిదా వేశారు. ఓఎంసీ కేసులో అన్నీ చట్టప్రకారమే జరిగాయని, సీబీఐవి ఊహాజనిత ఆరోపణలేనని, చట్టప్రకారం లీజులు మంజూరుచేశారని నిందితుల తరఫు న్యాయవాదులు తెలిపారు. ఈ వాదనలతో సీబీఐ న్యాయవాది విభేదిస్తూ గాలి జనార్దన్‌రెడ్డికి నిందితులందరూ సహకారం అందించారన్నారు. లీజుల కోసం ఇతరులు ప్రయత్నిస్తే పరిశ్రమల శాఖ కార్యదర్శిగా ఉన్న శ్రీలక్ష్మి, గనుల శాఖ డైరెక్టర్‌ వి.డి.రాజగోపాల్‌ లంచం డిమాండు చేశారన్నారు. అక్రమ తవ్వకాలు, తరలింపుపై సాక్షులు వాంగ్మూలం ఇచ్చారన్నారు. ఏపీ, కర్ణాటకల సరిహద్దులను చెరిపేసి గాలి జనార్దన్‌రెడ్డి కంపెనీ అక్రమ తవ్వకాలు చేసిందని, ఏపీ లైసెన్సుల ఆధారంగా అక్రమ రవాణా జరిగిందన్నారు. గాలి జనార్దన్‌రెడ్డి వ్యక్తిగత సహాయకుడు ఇతరులను బెదిరించి ఖనిజాన్ని తక్కువ ధరకు బలవంతంగా తీసుకునేవారన్నారు. కేసు ప్రాథమిక దశలోనే ఉన్నందువల్ల డిశ్ఛార్జి పిటిషన్లను కొట్టేయాలని కోరారు. నిందితుల పాత్రకు సంబంధించి రాతపూర్వక వాదనలను సమర్పించినట్లు తెలిపారు. వాదనలను విన్న న్యాయమూర్తి నిందితులు తమ అభ్యంతరాలను రాతపూర్వకంగా సమర్పించవచ్చన్నారు. డిశ్ఛార్జి పిటిషన్లపై ఉత్తర్వులను అక్టోబరు 17న వెల్లడిస్తానని తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన బి.వి.శ్రీనివాసరెడ్డి, గాలి జనార్దన్‌రెడ్డి డిశ్ఛార్జి పిటిషన్లను గతంలో ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు