బ్లాక్‌మార్కెట్‌ వాళ్లతో కుమ్మక్కవుతున్నారా?

పోలీసుల తీరు చూస్తే.. రేషన్‌ బియ్యాన్ని బ్లాక్‌మార్కెట్‌కు తరలించేవారితో కుమ్మక్కు అవుతున్నట్లు ఉందని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. తగిన అధికారాలు లేని పోలీసులు

Updated : 01 Oct 2022 07:24 IST

రాష్ట్రంలో పోలీసుల తీరు ఇలాగే ఉంది

అధికారం లేని పోలీసులు ఎలా తనిఖీ చేస్తారు?

రేషన్‌ బియ్యం ఎక్కడి నుంచి వెళ్తోందో మీకు తెలిసే ఉంటుంది

కిందిస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేయండి

డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డికి హైకోర్టు స్పష్టీకరణ

ఈనాడు, అమరావతి: పోలీసుల తీరు చూస్తే.. రేషన్‌ బియ్యాన్ని బ్లాక్‌మార్కెట్‌కు తరలించేవారితో కుమ్మక్కు అవుతున్నట్లు ఉందని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. తగిన అధికారాలు లేని పోలీసులు బియ్యం అక్రమ రవాణా చేసే వాహనాల తనిఖీ, స్వాధీనం చేసుకోవడం చూస్తుంటే కుమ్మక్కు అవుతున్నట్లే ఉందని పేర్కొంది. పంచనామా సమయంలో స్వతంత్ర సాక్షులు లేకుండా... వీఆర్‌వోలు, మహిళా పోలీసుల సమక్షంలోనే ఆ ప్రక్రియ పూర్తిచేయడాన్ని కోర్టు తప్పుబట్టింది. ఇలా చేస్తే... ఆ కేసులు న్యాయస్థానం ముందు ఎలా నిలబడతాయని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిని నిగ్గదీసింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి శుక్రవారం స్వయంగా హైకోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కనీసం ఎస్సై హోదా ఉన్న అధికారి మాత్రమే వాహనాలను తనిఖీచేసి, కేసులు పెట్టాలని గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ప్రస్తావించింది. దానిపై డీజీపీ సర్క్యులర్‌ జారీచేసిన విషయాన్నీ గుర్తుచేసింది. వీటిని రాష్ట్రంలోని కిందిస్థాయి పోలీసులు పాటించకపోవడంపై అసహనం వ్యక్తంచేసింది. రేషన్‌ బియ్యం అక్రమ రవాణా కట్టడి, బ్లాక్‌మార్కెట్‌ను నియంత్రించే విషయంలో కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా వ్యవహరించేలా సిబ్బందిని అప్రమత్తం చేయాలని తేల్చిచెప్పింది. తగిన చర్యలు తీసుకుంటామని కోర్టుకు డీజీపీ తెలపడంతో విచారణను వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు.

* నంద్యాల జిల్లా పాములపాడు ఏఎస్సై తన లారీని సీజ్‌ చేసి, ఈ ఏడాది ఆగస్టు 11న కేసు పెట్టారని షేక్‌ మహ్మద్‌ రఫీ హైకోర్టులో వ్యాజ్యం వేశారు. బియ్యం మిల్లుపై దాడులు చేసి సరకు తీసుకెళ్లిపోయారని మరో వ్యాజ్యం దాఖలైంది. ఇటీవల జరిగిన విచారణలో పిటిషనర్‌ తరఫున న్యాయవాదులు కె.శ్రీనివాస్‌, పదిరి రవితేజ వాదనలు వినిపించారు. కనీసం ఎస్సై హోదా లేని వ్యక్తి తనిఖీ చేయడానికి వీల్లేదని గతంలో హైకోర్టు తీర్పు ఇచ్చినా పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. దాంతో.. డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు.

న్యాయస్థానానికి రావడం శిక్షగా భావించొద్దు: శుక్రవారం విచారణకు డీజీపీ హైకోర్టుకు హాజరయ్యారు. డీజీపీ తరఫున ఏజీ ఎస్‌.శ్రీరామ్‌ వాదనలు వినిపించారు. కోర్టు ఉత్తర్వులను తప్పక పాటించాలని పోలీసులను ఆదేశిస్తూ డీజీపీ సర్క్యులర్‌ జారీచేశారన్నారు. పాములపాడు ఎస్సై, ఏఎస్సైని సస్పెండ్‌ చేశామన్నారు. డీజీపీ ఉత్తర్వులను కొంతమంది కిందిస్థాయి సిబ్బంది పట్టించుకోకపోవడం వాస్తవమేనన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. సర్క్యులర్‌ ఇచ్చి వదిలేస్తే ఎలా అన్నారు. కోర్టుకు రావడాన్ని శిక్షగా భావించొద్దని డీజీపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అధికారం లేని పోలీసు కేసు నమోదుచేస్తే న్యాయసమీక్షకు నిలుస్తుందా? అని డీజీపీని ప్రశ్నించారు. నిలవదని బదులిచ్చిన డీజీపీ.. రేషన్‌ బియ్యం అక్రమ రవాణా తనిఖీల విషయంలో కోర్టు ఆదేశాలకు కట్టుబడని పోలీసులకు పెద్దశిక్ష విధిస్తామన్నారు. బాధ్యుల్ని డిస్మిస్‌ చేస్తామన్నారు.

ఆ సర్క్యులర్‌పై అవగాహన ఉందా?: న్యాయమూర్తి స్పందిస్తూ.. రాష్ట్రం నుంచి బియ్యం పెద్దమొత్తంలో తరలిపోతోందన్నారు. ఏ పోర్టు నుంచి రవాణా చేస్తున్నారో పోలీసు బాస్‌గా మీకు తెలిసే ఉంటుందని వ్యాఖ్యానించారు. కోర్టు ఉత్తర్వుల మేరకు వ్యవహరించాలని దిగువ స్థాయి పోలీసులకు సర్క్యులర్‌ జారీచేశామంటున్నారు.. దానిపై అవగాహన ఉందా? సాధారణ ఫైలులాగే సంతకం చేశారా అని ప్రశ్నించారు. ప్రస్తుత కేసులో సస్పెండ్‌ చేశామంటున్నారు, మిగిలిన కేసుల్లో పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఆ కేసులను సమీక్షిస్తానని డీజీపీ చెప్పారు. అక్రమ రవాణా కేసుల్ని జిల్లా ఎస్పీలే నేరుగా పర్యవేక్షించాలని ఆదేశాలిస్తామన్నారు. సర్క్యులర్‌పై అవగాహన ఉందన్నారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. ప్రస్తుత వ్యాజ్యాలతో తగిన ఉత్తర్వులు జారీచేస్తానంటూ విచారణను వాయిదా వేశారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని