అంగన్‌వాడీ పోస్టుల రద్దుపై చర్చించి నిర్ణయం

అభ్యర్థుల్లో అపోహలు ఉన్నందున అంగన్‌వాడీ సూపర్‌వైజర్ల నియామక నోటిఫికేషన్‌ రద్దు చేయాలా.. కొనసాగించాలా? అనేదానిపై ముఖ్యమంత్రి జగన్‌ తమనే నిర్ణయం తీసుకోమన్నారని.. దీనిపై న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి అనురాధ వెల్లడించారు.

Published : 01 Oct 2022 05:17 IST

మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి అనురాధ

ఈనాడు-అమరావతి: అభ్యర్థుల్లో అపోహలు ఉన్నందున అంగన్‌వాడీ సూపర్‌వైజర్ల నియామక నోటిఫికేషన్‌ రద్దు చేయాలా.. కొనసాగించాలా? అనేదానిపై ముఖ్యమంత్రి జగన్‌ తమనే నిర్ణయం తీసుకోమన్నారని.. దీనిపై న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి అనురాధ వెల్లడించారు. హైకోర్టు ఈ పోస్టుల భర్తీ ప్రక్రియను నిలిపేయాలని ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్‌ మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో చర్చించారు. అనంతరం ముఖ్య కార్యదర్శి అనురాధ శుక్రవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ‘560 పోస్టుల భర్తీకి 45 మార్కులకు రాత పరీక్ష, 5 మార్కులకు స్పోకెన్‌ ఇంగ్లిష్‌లో పరీక్షలను నిర్వహించాం. 21,000 మంది అంగన్‌వాడీలు హాజరయ్యారు. 1:2 నిష్పత్తిలో 1,194 మందిని స్పోకెన్‌ ఇంగ్లిష్‌ టెస్టుకు ఎంపికచేశాం. వీరికి లింక్‌ ఇచ్చి, వీడియో ద్వారా ఆంగ్లంలో కనీస ప్రావీణ్య పరీక్షను 3 నుంచి 5 నిమిషాల నిడివితో రికార్డు చేయించాం. కలెక్టర్ల ఆధ్వర్యంలోని అధికారులు వాటిని పరిశీలించి, మార్కులు ఇచ్చారు. మెరిట్‌ లిస్టు ప్రతిపాదికనే అభ్యర్థులకు ఆంగ్లంలో సామర్థ్యాన్ని గుర్తిస్తామని నోటిఫికేషన్‌లో పొందుపరిచాం. రెండు పరీక్షల్లో రాత పరీక్ష ముందుగా పూర్తయినందున ‘కీ’ ప్రకటించాల్సిన అవసరంలేదు. స్పోకెన్‌ ఇంగ్లిష్‌లో పరీక్ష నిర్వహించాల్సి ఉన్నందున అందులో వచ్చిన మార్కులు బహిర్గతం చేయకూడదు. ప్రస్తుతం వెబ్‌సైట్‌లో మార్కులను అభ్యర్థులకు అందుబాటులో ఉంచాం. ఒకవేళ నోటిఫికేషన్‌ రద్దు చేస్తే ప్రశ్నపత్రంలో ఏమైనా మార్పులు తీసుకురావాలా? ఆంగ్లంలో ప్రావీణ్యాన్ని ఎలా గుర్తించాలి వంటి అంశాలపైనా చర్చిస్తున్నాం. 2013లో జరిగిన పోస్టుల భర్తీకి సంబంధించి ఆరు కేసులు ఇంకా విచారణలో ఉన్నాయి’ అని అనురాధ వివరించారు. విలేకర్ల సమావేశంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ సిరి పాల్గొన్నారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని