కృష్ణా నదిపై తొమ్మిది సెన్సర్లు

కృష్ణా నదిపై రెండు తెలుగు రాష్ట్రాల్లోని 9 ప్రాంతాల్లో ప్రవాహాల నమోదుకు అత్యాధునిక సెన్సర్లు ఏర్పాటు చేయాలని కృష్ణా బోర్డు కసరత్తు చేస్తోంది.

Updated : 02 Oct 2022 05:36 IST

పక్కాగా ప్రవాహాల నమోదుకు బోర్డు కసరత్తు

ఈనాడు, హైదరాబాద్‌: కృష్ణా నదిపై రెండు తెలుగు రాష్ట్రాల్లోని 9 ప్రాంతాల్లో ప్రవాహాల నమోదుకు అత్యాధునిక సెన్సర్లు ఏర్పాటు చేయాలని కృష్ణా బోర్డు కసరత్తు చేస్తోంది. జల వినియోగాన్ని పక్కాగా లెక్కించేందుకు ఇప్పటి వరకు టెలీమెట్రీ పరికరాలను వినియోగిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా నూతన సాంకేతికత ఉన్న సైడ్‌ లుకింగ్‌ డాప్లర్‌ కరెంట్‌ ప్రొఫైలర్‌ (ఎస్‌ఎల్‌డీసీపీ) పరికరాలను వినియోగించాలని నిర్ణయించారు. వాటి కొనుగోళ్లకు మార్గదర్శకాలు ఖరారు కాగా బోర్డు తుదిదశ పరిశీలనలో ఉన్నాయి. రెండేళ్ల క్రితమే ముగ్గురు సభ్యుల బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి తొమ్మిది చోట్ల పరికరాలను ఏర్పాటు చేయాలని ఓ నిర్ణయానికి వచ్చింది.

త్వరలోనే టెండర్లు..  
కృష్ణా జలాల వినియోగంలో రెండు తెలుగు రాష్ట్రాలు కేఆర్‌ఎంబీకి తరచూ ఫిర్యాదు చేసుకుంటూనే ఉన్నాయి. వినియోగాన్ని లెక్కించేందుకు మాత్రం బోర్డు వద్ద పూర్తి స్థాయిలో వనరులు లేవు. గతంలో రెండు రాష్ట్రాల్లో కృష్ణా ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేసే 18 చోట్ల టెలీమెట్రీ పరికరాలు ఏర్పాటు చేశారు. అవి నీటి మట్టం అంచనా వేసి ఆ సమాచారాన్ని (డేటా) హైదరాబాద్‌లోని కంట్రోల్‌ రూంకు పంపుతున్నాయి. అయితే టెలీమెట్రీలు ఉన్న పలు ప్రాంతాల్లో సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ సరిగా లేకపోవడంతో రోజూ నిర్దిష్ట సమయంలో రీడింగ్‌ నమోదు కావడం లేదని గుర్తించారు. ఈ నేపథ్యంలో నీటి మట్టం, లోతు, ప్రవాహ వేగం కూడా లెక్కించే అధునాతన ఎస్‌ఎల్‌డీసీపీల ఏర్పాటుకు బోర్డు మొగ్గుచూపుతోంది. దీనికోసం సుమారు రూ.4.30 కోట్లతో టెండర్లు పిలవాలని అధికారులు నిర్ణయించారు. పాత పరికరాలను పూర్తి స్థాయిలో పనిచేసేలా సిద్ధం చేశాక కొత్తవి ఏర్పాటు చేయాలని పలువురు బోర్డు సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేయడంతో టెండర్ల ప్రక్రియ కొంత నెమ్మదించినట్లు తెలిసింది.

ఏర్పాటు చేయనున్న ప్రాంతాలు...
అధునాతన పరికరాలను కేసీ కెనాల్‌, పోతిరెడ్డిపాడు, నాగార్జునసాగర్‌ కుడి కాలువపై అలాగే ఎడమ కాలువ పరిధిలో పాలేరు, తిరువూరు ప్రాంతాల్లో, విజయవాడ ప్రకాశం బ్యారేజీ తూర్పు, పశ్చిమ ప్రధాన కాలువలు, గుంటూరు, పోలవరం కాలువలపై ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.

పాత పరికరాల పరిశీలన
కృష్ణా పరీవాహకంలో రెండు రాష్ట్రాల్లో ఉన్న 18 టెలీమెట్రీ పరికరాల పనితీరుపై కృష్ణా బోర్డు ఇంజినీర్లు పరిశీలన చేపట్టారు. జూరాల నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు విడతల వారీగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సమస్యలు ఉంటే పరిష్కరించనున్నారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts