గాంధీ.. ఆ మాటే శాంతికి నాంది

పరిపాలన సాగించే మంత్రులు, ఎమ్మెల్యేలు వంటి ప్రజాప్రతినిధులందరికీ గాంధీ సిద్ధాంతాలతో ‘ప్రవర్తనా నియమావళి’ (కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌) ఉండాలి. దాన్ని వారు తు.చ.తప్పకుండా పాటించాలి.

Updated : 02 Oct 2022 06:01 IST

పరమత సహనం, సహకార జీవనంతోనే మహాత్ముని ఆదర్శాల అమలు

గ్రామస్వరాజ్యం ఉంటేనే ప్రజాస్వామ్యం బలోపేతం

ప్రజాప్రతినిధులకు ప్రవర్తనా నియమావళి ఉండాలి

బాపూజీ ఆశయాలను నెరవేర్చుతూ భారత్‌ ప్రపంచానికి దారిచూపాలి

‘ఈనాడు’తో జర్మనీకి చెందిన గాంధేయవాది క్రిస్టియన్‌ బార్టోల్ఫ్‌

ఈనాడు - హైదరాబాద్‌

పరిపాలన సాగించే మంత్రులు, ఎమ్మెల్యేలు వంటి ప్రజాప్రతినిధులందరికీ గాంధీ సిద్ధాంతాలతో ‘ప్రవర్తనా నియమావళి’ (కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌) ఉండాలి. దాన్ని వారు తు.చ.తప్పకుండా పాటించాలి. వైద్యవృత్తిలోకి వచ్చేవారంతా నైతిక నిష్ఠ పాటిస్తామని ప్రమాణం చేస్తున్నట్టే ప్రజాప్రతినిధులూ గాంధీ ఆశయాలను పాటిస్తామని ప్రమాణం చేయాలి. వాటిని పాటించి చూపాలి. గ్రామస్థాయి నుంచి కేంద్ర ప్రభుత్వం వరకు అందరూ శాంతియుత గాంధీ మార్గాన్ని అనుసరిస్తే ప్రాంతాలు, ప్రజల మధ్య వివాదాలు రావు.

- క్రిస్టియన్‌ బార్టోల్ఫ్‌

జర్మనీలో పుట్టి పెరిగిన బార్టోల్ఫ్‌ బెర్లిన్‌లోని గాంధీ సమాచార కేంద్రం అనే విద్యాసొసైటీకి అధ్యక్షుడిగా, 1993 నుంచి అక్కడి ఫ్రీ విశ్వవిద్యాలయంలో రాజకీయ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. మహాత్మాగాంధీ రచనలు, ఆయన గురించి వచ్చిన పుస్తకాలపై బార్టోల్ఫ్‌ అనేక ఏళ్లపాటు లోతైన పరిశోధనలు చేశారు. గాంధీ సమకాలికులతో మాట్లాడి.. వారు తెలిపిన వివరాలతో పలు రచనలు చేశారు. దక్షిణాఫ్రికాలో గాంధీ మిత్రుడైన హెర్మన్‌ కెలన్‌బాక్‌తో మాట్లాడి పుస్తకం రాశారు. పలు దేశాల్లో పర్యటిస్తూ మహాత్ముడి ఆశయాలపై ప్రదర్శనలు, ప్రసంగాలతో విరివిగా ప్రచారం చేస్తున్నారు.

ప్రస్తుతం భారతదేశంలోని 45 పట్టణాల్లో గాంధీ గురించి ప్రసంగించేందుకు అరుణాచల్‌ప్రదేశ్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ వరకూ పలు రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. గాంధీ జయంతి సందర్భంగా ఆయన హైదరాబాద్‌లో ‘ఈనాడు’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

జర్మనీలో పుట్టిన మీకు గాంధీపై ఆసక్తి ఎలా కలిగింది

జర్మనీలో హిట్లర్‌ పాలనలో జైలుపాలైన విలేకరి ఓన్‌ ఓసెట్జీకీ.. హైదరాబాద్‌లో పుట్టిన ఆంగ్లో ఇండియన్‌ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ఈ కుటుంబ వారసులు నాకు దూరపు బంధువులు. జర్మనీలో నా చిన్నప్పుడు వారితో కలసి తిరిగిన సందర్భాల్లో గాంధీ ఆశయాల గురించి గొప్పగా చెప్పేవారు. ఆ తరువాత గాంధీ రచనలు, ప్రసంగాలు, ఆయన పలువురికి రాసిన ఉత్తరాలు చదువుతూ ఎంతో స్ఫూర్తి పొందాను. బాపూ బాటలోనే నడవాలని నిర్ణయించుకున్నాను.

ఆధునిక పోటీ ప్రపంచంలో గాంధీ సిద్ధాంతాల అమలుకు ఎంతమేర అవకాశం ఉంది

చాలావరకు ఉంది. ప్రజలంతా సహకార స్ఫూర్తితో జీవిస్తేనే అభివృద్ధి సాధ్యమని గాంధీ చెప్పారు. ఇప్పుడు ఏ దేశంలో అయినా అభివృద్ధి సాధించాలంటే ప్రజల పరస్పర సహకార జీవనమే ప్రధానం. ఒకదేశంలో ప్రజల మధ్యనే కాదు, దేశాల మధ్య కూడా సహకార స్ఫూర్తి ఉన్నప్పుడే పరస్పరం అభివృద్ధి చెందుతాయి.

గాంధీ ఆశయాలు, ఆయన చెప్పిన సిద్ధాంతాల ప్రకారం భారతదేశం అభివృద్ధి చెందుతోందా

గాంధీ భారతదేశానికి గొప్ప వనరు. ప్రపంచ దేశాలకు ఏ సందర్భంలోనైనా, ఎక్కడైనా నాయకత్వం వహించే అవకాశం భారతదేశానికి వస్తే తప్పనిసరిగా గాంధీ ఆశయాలు, అహింసా సిద్ధాంతాలే ప్రాతిపదికగా మార్గదర్శనం చేయాలి. అనేక దేశాల్లో గాంధీని ఇప్పటికీ ఎంతోమంది అనుసరిస్తున్నారంటే అది భారతదేశం ఇచ్చిన గొప్ప మార్గమే కదా. గ్రామస్వరాజ్యం పరిఢవిల్లితే గాంధీ ఆశయాల ప్రకారం భారతదేశం అభివృద్ధి చెందుతుంది.

దేశాల మధ్య వివాదాలు యుద్ధాలకు దారితీస్తున్నాయి. ఈ నేపథ్యంలో అహింసా సిద్ధాంతం చెబితే వింటారా

దేశాల మధ్య యుద్ధాలు, అణ్వాయుధాలను గాంధీ వ్యతిరేకించారు. అణ్వాయుధాల వల్ల మానవాళికి ముప్పు అని, నిరాయుధీకరణే శరణ్యమన్నారు. ఏ రూపంలోనూ వాటిని తయారు చేయకూడదన్నారు. గాంధీజీ చెప్పిన అహింసా సిద్ధాంతంతోనే ప్రపంచశాంతి సాధ్యమని ఐక్యరాజ్యసమితి కూడా గతంలో చెప్పింది. ఇతర దేశాల ఆక్రమణను ఆయన ఆమోదించలేదు. యుద్ధం జరిగినప్పుడు తటస్థంగా ఉండాల్సిన అవసరం లేదని, అది ముగిసేందుకు శాంతియుత మార్గంలో కృషి చేయాలని గాంధీ చెప్పారు.

శాంతి మార్గంలో యుద్ధాన్ని ముగించడమంటే ఎలా

గాంధీ అనుసరించిన ఒక మార్గాన్ని చెబుతాను. దక్షిణాఫ్రికాలో ఆయన న్యాయవాదిగా పనిచేసేవారు. కోర్టుల్లో కేసు ఓడిపోయినవారు బాధపడుతూ ఆత్యహత్యలకు పాల్పడకూడదన్న ఉద్దేశంతో.. గాంధీ మధ్యవర్తిత్వం వహించి పరిష్కారాలు చూపడానికి కృషి చేసేవారు. ఇరువర్గాల మధ్య వివాదాలు, యుద్ధాలు, గొడవలు వచ్చినప్పుడు మధ్యవర్తిత్వం, చర్చలతో పరిష్కారమార్గాలు చూపడం సులభం. ఇలా చర్చలు జరిపి శాంతియుత మార్గంలో వివాదాలను పరిష్కరించడంలో మధ్యవర్తిగా గాంధీకి గొప్ప పేరు ఉంది. దానినే అహింసా సిద్ధాంతమని మరోపేరుగా చెప్పవచ్చు. హింస ఎంత సాగించినా ఉపయోగం ఉండదు. చివరికి శాంతియుత చర్చలు, మధ్యవర్తిత్వంతోనే మెరుగైన పరిష్కారం లభిస్తుంది. అంతర్జాతీయ చట్టాలు కూడా ఇదే చెబుతున్నాయి కదా!

జర్మనీ, అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో గాంధీయిజం ఏ మేరకు ఉంది

అనేక దేశాల్లో గాంధీ విధానాలను పలుమార్గాల్లో అనుసరిస్తున్నారు. ఆయన సిద్ధాంతాలపై అమెరికా, జర్మనీ వంటి అనేక దేశాల విశ్వవిద్యాలయాల్లో ప్రత్యేక కోర్సులు సైతం నిర్వహిస్తున్నారు. వాటిలో ఎంతోమంది ఆసక్తిగా చేరి అధ్యయనం చేస్తున్నారు. గాంధీ సమాచార కేంద్రం ద్వారా అహింసా సిద్ధాంతం గురించి పలు దేశాల్లో నేను ప్రసంగిస్తూ ప్రజల్లో చైతన్యం తెస్తున్నాను. నేను పర్యటించినప్పుడు అనేక దేశాల్లో మేధావులు, సామాన్యులు కూడా ఆయన సిద్ధాంతాల గురించి గొప్పగా మాట్లాడుతున్నారు.

భారతదేశంలో పర్యటిస్తూ మీరు గమనించిన అంశాలు, జర్మనీతో పోలిస్తే తేడా ఏమిటి

నేను గాంధీ సిద్ధాంతాల గురించి చెబుతున్నప్పుడు ప్రపంచమంతటా ప్రజల్లో దాదాపు ఒకే రకమైన స్పందన కనిపిస్తోంది. ఎక్కడైనా ప్రజలు శాంతి, అహింసలనే కోరుకుంటున్నారు. సమాఖ్య స్ఫూర్తితో పాలకులే దాన్ని అందించాలి. కాలుష్యం వదిలే అభివృద్ధి కాకుండా పర్యావరణాన్ని కాపాడే హరిత ఇంధన ఉత్పత్తి వంటి అంశాలతో భారత్‌ మరింత అభివృద్ధి చెందాలి. పేదల సంక్షేమ కార్యక్రమాలు విరివిగా చేపట్టి అందరూ సమానంగా అభివృద్ధి చెందేలా చూడాలి.

ప్రస్తుత యువతరానికి గాంధీ గురించి సులభంగా ఎలా చెప్పాలి? 

ఆయన రచనలు ఎవరికైనా సులభంగా మనసుకు హత్తుకునేలా ఉంటాయి. అనేక అంశాలపై ఆయన సూటిగా, సరళంగా తన అభిప్రాయాలు చెప్పారు. ప్రతి ఒక్కరూ బాపూజీ రచనలను లోతుగా చదివేలా చేస్తే చాలు.. అవే వారిలో మార్పు తెస్తాయి. గాంధీ రచనలు చదివాకే నాలో ఎంతో మార్పు వచ్చింది.

బాపూజీ ఆశయాలను ఎలా ముందుకు తీసుకెళ్లాలి? 

పరమత సహనం, నిరుపేదల సంక్షేమం, అందరి సమాన అభివృద్ధి కోసం మనం పాటుపడితే గాంధీ ఆశయాలను అమలు చేసినట్టే. ప్రతి మతం వారు ఇతర మతాలను గౌరవించడమే కాకుండా ప్రశంసించాలి.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts