నిత్యావసరాల్లో కోత

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో అంటే 2019 జూన్‌లో.. రాష్ట్రంలోని రేషన్‌ కార్డుదారులకు బియ్యంతోపాటు 92 లక్షల కిలోల కందిపప్పు, 64 లక్షల కిలోల పంచదార, 14 లక్షల కిలోల గోధుమపిండి, 2 లక్షల కిలోల ఉప్పు అందించారు.

Published : 02 Oct 2022 03:41 IST

పేదలకు బియ్యంతోనే సరి

సగటున 30% మందికే కందిపప్పు, 70% మందికే పంచదార

పామోలిన్‌, గోధుమపిండి ఊసే లేదు

ఖర్చు తగ్గించుకునే యోచనలో ప్రభుత్వం

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో అంటే 2019 జూన్‌లో.. రాష్ట్రంలోని రేషన్‌ కార్డుదారులకు బియ్యంతోపాటు 92 లక్షల కిలోల కందిపప్పు, 64 లక్షల కిలోల పంచదార, 14 లక్షల కిలోల గోధుమపిండి, 2 లక్షల కిలోల ఉప్పు అందించారు. 2022 సెప్టెంబరులో బియ్యం, 31 లక్షల కిలోల కందిపప్పు, 40 లక్షల కిలోల పంచదార మాత్రమే ఇచ్చారు. చంద్రబాబు హయాంలో రేషన్‌ దుకాణానికి వెళ్తే బియ్యం తప్ప మరేమీ దొరకవని ఎన్నికల ప్రచారంలో చెప్పిన జగన్‌... తాను అధికారం చేపట్టాక, అప్పటివరకూ ఇస్తున్న నిత్యావసరాలకు కోత పెట్టారు, పరిమాణమూ కుదించేస్తున్నారు.

ఈనాడు - అమరావతి

పేదలు ఇక బియ్యంతో సరిపెట్టుకోవాల్సిందే. వీధుల్లోకి వచ్చే రేషన్‌ వాహనంలో అడిగినా.. రేషన్‌ దుకాణానికి వెళ్లినా బియ్యం తప్ప మరేమీ ఉండవు. రెండేళ్ల కిందటే పేదలకిచ్చే కందిపప్పు, పంచదార ధరల్ని పెంచేసిన ప్రభుత్వం.. క్రమంగా వాటి పంపిణీలోనూ కోతలు పెడుతోంది. అక్టోబరు రేషన్‌ శనివారం నుంచి ప్రారంభం కాబోతున్నా... 90% పైగా దుకాణాలకు కందిపప్పు, పంచదార చేరలేదు. టెండర్లు పిలిచామని, సరఫరా చేస్తామని అధికారులు చెబుతుండగా.. ఈలోగా రేషన్‌ పంపిణీ పూర్తయిపోతుందని, పండక్కి పప్పు, పంచదార లేకుండా చేస్తున్నారని కార్డుదారులు వాపోతున్నారు. 

కొంతకాలంగా రాష్ట్రంలోని మొత్తం తెల్లకార్డుదారుల్లో 30% మందికి కూడా కందిపప్పు ఇవ్వట్లేదు. పంచదార కూడా 70% మందికే అందుతోంది. గతంలో పండగల సమయంలో ఇచ్చే పామోలిన్‌, గోధుమపిండి, ఉప్పు తదితర సరకుల్ని పూర్తిగా పక్కన పెట్టేసింది. పేదలకిచ్చే సరకులూ భారమని.. ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేస్తోంది. బకాయిలు పేరుకుపోవడంతో.. పౌరసరఫరాల సంస్థకు కందిపప్పు, పంచదార ఇచ్చేందుకు వాటి సరఫరాదారులు ముందుకు రావట్లేదు. ఇదే కాదు... ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్నయోజన పథకం కింద నాలుగు నెలలపాటు ఇవ్వాల్సిన ఉచిత బియ్యం ఊసూ లేదు. కేంద్రం ఈ పథకాన్ని డిసెంబరు వరకు పొడిగించినా.. పాత బియ్యం సంగతేంటో చెప్పడం లేదు. గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేస్తే వారంలోనే రేషన్‌కార్డు మంజూరు చేస్తామని గతంలో ఘనంగా ప్రకటించిన ప్రభుత్వం అందులోనూ నాలుక మడతేసింది. ఏడాదికి రెండుసార్లకే పరిమితం చేసింది. క్రమంగా కార్డులనూ కుదిస్తోంది. దీంతో పేద కుటుంబాలపై నిత్యావసరాల భారం పెరుగుతోంది.

మూడున్నరేళ్లలో ఎన్ని కోతలో...

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలినాళ్లతో పోలిస్తే.. రేషన్‌ సరకుల్లో భారీ కోత పడింది. 2018 మార్చి నుంచి గత ప్రభుత్వ హయాంలో ఒక్కో కుటుంబానికి 2కిలోల కందిపప్పు కిలో రూ.40 చొప్పున ఇచ్చేవారు. దీనికి కోత పెట్టి కిలో చేసింది. కిలో ధరను రూ.67 చేసింది. పంచదార కిలో ధర రూ.20 ఉంటే.. దాన్ని రూ.26 చేశారు. అరకిలో ఇస్తున్నామంటున్నా.. అరకొర పంపిణీకే పరిమితమవుతోంది. 2018-19లో రాగులు, జొన్నలు, గోధుమపిండి, ఉప్పు ఇచ్చారు. ఇప్పుడు అవీ లేవు. పండగ సమయాల్లో పామోలిన్‌, సంక్రాంతి, క్రిస్మస్‌ కానుకలూ ఉండేవి. వాటినీ తొలగించారు.

పంపిణీకి ఎన్ని మడతలో

కార్డుదారులకు తొలుత సన్నబియ్యం ఇస్తామని చెప్పి.. తర్వాత తినగలిగే నాణ్యమైన బియ్యం ఇస్తామనేదే తమ హామీగా పేర్కొన్నారు. నాణ్యమైన బియ్యాన్ని పాలీ ప్రొపెలిన్‌ సంచుల్లో నింపి వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ అందిస్తామంటూ.. ప్యాకింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు టెండర్లు పిలిచి రూ.12 కోట్లతో యంత్రాలను ఏర్పాటుచేశారు. తర్వాత ఆ ప్రతిపాదన విరమించుకున్నారు.

* వాహనాల ద్వారా ఇంటింటికీ సరఫరా అనే విధానం తెరపైకి తెచ్చారు. 2020లో 9,260 వాహనాలను కొని, వివిధ సంక్షేమ కార్పొరేషన్ల రుణాలకు అనుసంధానించారు. వాహనాల కొనుగోలుకు రూ.538 కోట్లు, నిర్వహణకు రూ.200 కోట్లు ఖర్చుపెడుతున్నారు. అయినా వీధి మలుపుల్లో తప్ప గడప వద్దకు రావు. పలు గిరిజన ప్రాంతాలకు వెళ్లే పరిస్థితి లేదు. వాహనాల్లోనే రేషన్‌ బియ్యం పెద్దఎత్తున దారి మళ్లుతోందనే ఆరోపణలున్నాయి. ఇంతచేసినా ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ యోజన కింద ఇచ్చే ఉచిత బియ్యాన్ని డీలర్ల ద్వారా అందించక తప్పడం లేదు.

పనులు మానుకుని నిరీక్షించాల్సిందే

గ్రామాలు, పట్టణాల్లో కూలీలు పనికి వెళ్లేముందో, వెళ్లొచ్చాకో రేషన్‌ దుకాణానికి వెళ్లి నిత్యావసరాలు తెచ్చుకునేవారు. ఇప్పుడు వాహనాలు ఎప్పుడొస్తాయని పని మానుకుని కాచుక్కూర్చోవాల్సి వస్తోందనే ఆవేదన వ్యక్తమవుతోంది.


తగ్గిపోతున్న రేషన్‌ కార్డులు

గతేడాది సెప్టెంబరుతో పోలిస్తే రాష్ట్రంలో రేషన్‌ కార్డుల సంఖ్య 3.63 లక్షల మేర తగ్గింది. గతేడాది సెప్టెంబరులో 1.49 కోట్ల కార్డులు ఉండగా.. ఈ ఏడాది సెప్టెంబరుకు 1.45 కోట్లకు తగ్గాయి. కార్డుల్లోని మొత్తం సభ్యుల సంఖ్య 8.57 లక్షల మేర తగ్గింది. ఒక్కొక్కరికి 5 కిలోల బియ్యం లెక్కన చూస్తే 4,284 టన్నుల బియ్యం ప్రభుత్వానికి ఆదా అవుతోంది. మొత్తంగా చూస్తే 2019 జనవరి నుంచి రాష్ట్రంలోని కార్డుల్లో కుటుంబసభ్యుల సంఖ్య 3.39 లక్షల మేర పెరిగింది.


Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని