స్వచ్ఛ నగరం విశాఖ

కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌-2022లో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జాతీయ స్థాయిలో నాలుగో ర్యాంకు సాధించి టాప్‌-5లో నిలిచింది. 10-40 లక్షల మధ్య జనాభా గల నగరాల కేటగిరీలో క్లీన్‌ బిగ్‌ సిటీగా నిలిచింది.

Published : 02 Oct 2022 03:41 IST

జాతీయస్థాయిలో నాలుగో ర్యాంకు

విజయవాడకు 5, తిరుపతికి 7

ఈనాడు, దిల్లీ: కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌-2022లో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జాతీయ స్థాయిలో నాలుగో ర్యాంకు సాధించి టాప్‌-5లో నిలిచింది. 10-40 లక్షల మధ్య జనాభా గల నగరాల కేటగిరీలో క్లీన్‌ బిగ్‌ సిటీగా నిలిచింది. ఆధ్యాత్మిక నగరి తిరుపతికి సఫాయి మిత్ర సురక్షిత్‌ సెహర్‌ అవార్డు దక్కింది. జాతీయ స్థాయిలో తొలి మూడు ర్యాంకులను ఇండోర్‌ (మధ్యప్రదేశ్‌), సూరత్‌ (గుజరాత్‌), నవీ ముంబాయి (మహారాష్ట్ర)లు చేజిక్కించుకున్నాయి. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ దేశవ్యాప్తంగా 4,354 పట్టణ ప్రాంతాల్లోని పారిశుద్ధ్య పరిస్థితులపై సర్వే నిర్వహించి వీటిని ప్రకటించింది. దేశవ్యాప్తంగా లక్షకుపైబడి జనాభా గల నగరాలకు ప్రకటించిన 100 ర్యాంకుల్లో విజయవాడ (5), తిరుపతి (7), కర్నూలు (75), నెల్లూరు (81)లు చోటు దక్కించుకున్నాయి. లక్షలోపు జనాభా పట్టణాల్లో ఏపీకి ఒక్క ర్యాంకు కూడా రాలేదు.


తిరుపతికి ఉత్తమ సఫాయి మిత్ర సురక్ష సెహర్‌ అవార్డు

సెప్టిక్‌ ట్యాంకులు, మురుగునీటి కాలువలను శుభ్రం చేసే ప్రమాదకర పనుల నుంచి సఫాయి కార్మికులను తప్పించి ఆ స్థానంలో యంత్రాలను ఉపయోగించి కార్మికుల ప్రాణాలను కాపాడినందుకు తిరుపతికి ఉత్తమ సఫాయి మిత్ర సురక్ష సెహర్‌ అవార్డు ఇచ్చారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా శనివారం ఈ అవార్డును ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్‌, స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, మున్సిపల్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి,   తిరుపతి మేయర్‌ శిరీష, కమిషనర్‌ అనుపమాంజలి అందుకున్నారు.


క్లీన్‌ స్టేట్‌ కేపిటల్‌గా విజయవాడ

శుభ్రమైన రాష్ట్ర/కేంద్ర పాలిత ప్రాంతాల రాజధానుల్లో విజయవాడకు ‘క్లీన్‌ స్టేట్‌ కేపిటల్‌’ అవార్డు దక్కింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని