గరుడ గమనం.. మలయప్ప వైభవం

శ్రీవారి గరుడ వాహనసేవ వైభవంగా సాగింది.  శనివారం అర్ధరాత్రి వరకు తిరుమల వీధుల్లో జనం పోటెత్తారు.. మాడ వీధుల్లో విహరించే స్వామిని దర్శించుకునేందుకు 2.5-3 లక్షల మంది భక్తులు తిరుమలకు తరలివచ్చారు. గ్యాలరీలు నిండిపోవడంతో పలువురు భక్తులు క్యూలైన్లలోనే నిలిచిపోయారు.

Updated : 02 Oct 2022 07:08 IST

నూతన విధానం ద్వారా ఎక్కువమందికి వాహన దర్శనం

తరించిన భక్తజనం

ఈనాడు, తిరుపతి: శ్రీవారి గరుడ వాహనసేవ వైభవంగా సాగింది.  శనివారం అర్ధరాత్రి వరకు తిరుమల వీధుల్లో జనం పోటెత్తారు.. మాడ వీధుల్లో విహరించే స్వామిని దర్శించుకునేందుకు 2.5-3 లక్షల మంది భక్తులు తిరుమలకు తరలివచ్చారు. గ్యాలరీలు నిండిపోవడంతో పలువురు భక్తులు క్యూలైన్లలోనే నిలిచిపోయారు. రహదారిపై ఉన్న భక్తులను  క్యూలైన్లలోకి అనుమతించకపోవడంతో కొంతసేపు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. స్వామిని తిలకించేందుకు భక్తులు బారికేడ్లను సైతం లెక్క చేయలేదు. దీంతో పలుప్రాంతాల్లో తోపులాట చోటుచేసుకుంది. ధర్మదర్శనానికి క్యూలైన్లలో వచ్చిన భక్తులు శనివారం సాయంత్రానికి వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయి ఔటర్‌రింగ్‌ రోడ్డు వరకు వేచి ఉన్నారు. వీరికి ధర్మదర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతోందని తితిదే ప్రకటించింది.

మాడవీధుల్లో హారతి ఇచ్చే ప్రాంతం నుంచి భక్తులను వాహనాన్ని దర్శించుకునే అవకాశాన్ని కల్పించారు. ఇందుకోసం ముందుగా ఉదయం మోహినీ అవతారంలో విహరిస్తున్న స్వామివాహనం ఉత్తర-తూర్పు మాడవీధికి వచ్చినప్పుడు ట్రయల్‌రన్‌ నిర్వహించారు. తొలుత ఉత్తర-తూర్పు మాడవీధి (శ్రీభూవరాహస్వామి ఆలయం దాటిన తర్వాత)కి స్వామివారి వాహనం చేరుకున్న తర్వాత అటు కొత్తగా నిర్మించిన పరకామణి వైపునుంచి క్యూలైన్ల ద్వారా వారిని తరలించారు.

తోపులాటలు.. పడిపోయిన భక్తులు

గరుడవాహనంపై విహరించే స్వామిని తిలకించేందుకు భక్తులు బారికేడ్లను సైతం లెక్క చేయలేదు. గ్యాలరీల్లోకి చేరుకునే క్యూలైన్ల కంచెను వంచి వెళ్లారు. భక్తులు పరుగులు తీసే సమయంలోనే లేపాక్షి, మ్యూజియం ప్రాంతాల్లో తోపులాట చోటుచేసుకుంది. కొందరు పడిపోయారు. సప్తగిరి వద్ద పోలీసులు, ప్రెస్‌, తితిదే పాసులు కలిగిన కుటుంబసభ్యులను అనుమతించే మార్గంలో స్థానిక పోలీసులకు, బయటనుంచి వచ్చిన పోలీసులకు వాగ్వాదం చోటుచేసుకుని తోపులాటకు దారితీసింది. దీంతో పోలీసు అధికారులు జోక్యం చేసుకుని సర్దిచెప్పారు.


శ్రీవారి సేవలో సీజేఐ

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉదయ్‌ ఉమేష్‌ లలిత్‌ సతీసమేతంగా శనివారం సాయంత్రం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ మహద్వారం వద్దకు చేరుకున్న సీజేఐకి తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి స్వాగతం పలికారు. స్వామి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం అందించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని