ఇనాం.. క్రయవిక్రయాలకు ఆటంకం

రాష్ట్రంలోని లక్షల ఎకరాల ఇనాం భూములు నిషిద్ధ జాబితాలో ఇరుక్కుపోవడంతో బాధితులు అల్లాడుతున్నారు. దీర్ఘకాలికంగా ఉన్న ఈ భూముల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టిపెట్టనందున రిజిస్ట్రేషన్లు జరగక అవస్థలు పడుతున్నారు.

Updated : 02 Oct 2022 05:44 IST

నిషిద్ధ జాబితాలో లక్షల ఎకరాలు

చట్టసవరణకు తెచ్చిన ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ఆమోదం

బిల్లు పెట్టకపోవడంతో మళ్లీ సమస్య మొదటికి

చితికిపోతున్న పేద, మధ్యతరగతి ప్రజలు

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని లక్షల ఎకరాల ఇనాం భూములు నిషిద్ధ జాబితాలో ఇరుక్కుపోవడంతో బాధితులు అల్లాడుతున్నారు. దీర్ఘకాలికంగా ఉన్న ఈ భూముల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టిపెట్టనందున రిజిస్ట్రేషన్లు జరగక అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం ఆయా భూములు పట్టణాలు, నగరాలకు సమీపంలోకి రావడంతో వాటికి విలువ పెరిగింది. అయితే... నిషిద్ధ జాబితాలో ఉండటంతో క్రయవిక్రయాలకు వీలు లేకుండా పోయింది.

స్వాతంత్య్రానికి పూర్వం రాజులు, జమీందారుల కాలంలో వారికి సేవలు చేసే వృత్తిదారుల జీవన భృతి కోసం సాగుభూములను ఇనాం రూపంలో ఇచ్చారు. దేవాలయాల నిర్వహణకు, వాటిలో పూజలు, ఇతర సేవలు చేసే వారికీ ఇలాగే భూములిచ్చారు. స్వాతంత్య్రానంతరం రాజులు, సంస్థానాలు, జమీన్‌లు రద్దయ్యాయి. 1956లో ప్రభుత్వం ఇనాం రద్దు చేయగా 1957లో ఇనాం (ఇనాం రద్దు, రైత్వారీ పట్టాలు మార్చిడి) చట్టం అమలులోకి వచ్చింది. ఇనాం భూములు పొందిన వారికి 1957 ఉంచి 2013 వరకు లక్షల రైత్వారీ పట్టాలు ఇచ్చింది.

ఆర్డినెన్స్‌ తెచ్చినా... చట్టం చేయని వైనం

మార్పిడి ప్రక్రియలో అవకతవకలు జరిగాయని సర్వీస్‌, ఇనాం భూములకు ఫాం-8 కింద రైత్వారీ పట్టాలు ఇచ్చినా... ఆయా భూముల క్రయవిక్రయాలు చెల్లవంటూ ఇనాం భూముల రద్దు చట్టానికి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం 16/2013 సవరణ తెచ్చింది. దీన్ని 1956 నుంచి జరిగిన లావాదేవీలకూ వర్తింపజేసి, అప్పటివరకు జరిగిన రిజిస్ట్రేషన్లు అన్నింటినీ స్తంభింపజేశారు. దాంతో చివర్లో కొన్నవారు బాధితులుగా మారారు. ఈ సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం 2019లో ఆర్డినెన్స్‌ జరిచేసింది. 16/2013లో పెట్టిన షరతు ఆ చట్టం ఆమోదించకముందు జరిగిన లావాదేవీలకు వర్తించదని, 2013లో చట్టం అమల్లోనికి వచ్చాక జరిగిన వాటికి మాత్రమే పరిమితమవుతుందని ఆర్డినెన్స్‌లో ప్రభుత్వం పేర్కొంది. అంటే 2013కి ముందు ఫామ్‌-8 ప్రకారం రైత్వారీ పట్టాలు పొందిన వారికి ఆయా భూములపై పూర్తిస్థాయిలో హక్కులు లభించాలి. ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ఆమోదం లభించింది. అనంతరం ఆరు నెలల్లోగా ఆర్డినెన్స్‌పై శాసనసభలో బిల్లు పెట్టి, చట్టబద్ధత కల్పించకపోవడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది.

* ఎన్టీఆర్‌ జిల్లా నందిగామలో సుమారు 2 వేల ఎకరాలు నిషిద్ధ జాబితాలో ఉన్నాయి.

* పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణ పరిధిలో 165 సర్వేనంబర్లలో 782 ఎకరాలు ఈనాం భూములుగా ఉన్నాయి. యడ్లపాడు, నాదెండ్ల మండలాల్లో 900 ఎకరాల వరకు ఇదే జాబితాలోనికి వెళ్లాయి.

* ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని వివిధ గ్రామాల్లో 3500 ఎకరాలను ప్రభుత్వం తొమ్మిదేళ్ల క్రితం దేవాదాయ భూముల పేరిట రిజిస్ట్రేషన్లు నిలిపేసింది. స్థానికుల విన్నపాలతో రెండేళ్ల కిందట 2,000 ఎకరాలు వ్యవసాయ, పారిశ్రామిక వాడకు చెందిన భూములుగా మినహాయింపు ఇచ్చారు. మండలంలోని సింగరాయకొండ, సోమరాజుపల్లి, కలికవాయ, పాతసింగరాయకొండ గ్రామాల్లోని 1,500 ఎకరాల్లో ఇళ్ల నిర్మాణాలు జరిగాయి. క్రయవిక్రయాలూ కొనసాగాయి.

* విశాఖ నగరంలోని మధురవాడ సర్వే నంబరు 39-4లోని భూములను నిషిద్ధ జాబితాలో చేర్చారు. ఈ సర్వే నంబరులో ఎక్కువగా పేద, మధ్యతరగతి ప్రజలు ఇళ్లు నిర్మించుకున్నారు. కాకానినగర్‌ కాలనీలోనూ ఇదే సమస్య ఉంది. ఈ సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని బాధితులు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని