రహదారుల నిర్వహణకు నిధులేవీ?

అత్యంత అధ్వానంగా మారిన గ్రామీణ రహదారులతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అయినా వాటి మరమ్మతులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించడం లేదు. మార్కెటింగ్‌ శాఖ నిధులతో లింకు రోడ్ల అభివృద్ధి పనులు కార్యరూపమే దాల్చలేదు.

Published : 02 Oct 2022 04:59 IST

ఈనాడు, అమరావతి: అత్యంత అధ్వానంగా మారిన గ్రామీణ రహదారులతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అయినా వాటి మరమ్మతులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించడం లేదు. మార్కెటింగ్‌ శాఖ నిధులతో లింకు రోడ్ల అభివృద్ధి పనులు కార్యరూపమే దాల్చలేదు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేసిన రహదారుల నిర్వహణకూ రాష్ట్రం సక్రమంగా నిధులివ్వడం లేదు. రెండేళ్లకు సంబంధించి దాదాపు రూ.20 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ పరిణామాలపై కేంద్రం సైతం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజనలో చేపట్టిన రహదారుల నిర్మాణానికి సంబంధించి ఐదేళ్ల వరకు వాటి నిర్వహణ బాధ్యత రాష్ట్రానిదే. ఇక్కడ దాదాపు 3,500 కి.మీ.రహదారుల నిర్వహణకు సంబంధించి 2021-22, 2022-23లో సుమారు రూ.20 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. రోడ్ల పనులు పూర్తి చేసిన గుత్తేదారులు ఒప్పందం ప్రకారం ఐదేళ్ల వరకు వాటి నిర్వహణ చూడాలి. ఈ పనులను ఇంజినీర్లు పరిశీలించాక ఆరు నెలలకోసారి బిల్లులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. రెండేళ్లకు సంబంధించిన బిల్లులు సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థలో పెండింగ్‌లో ఉన్నాయి. ఈ ప్రభావం రహదారుల నిర్వహణపై కనిపిస్తోంది. పీఎంజీఎస్‌వైలో చేస్తున్న రహదారుల పనుల్లో కేంద్రం వాటా 60% ఉంటుంది. పనులు పూర్తయ్యాక ఐదేళ్ల వరకు నిర్వహణ బాధ్యతనూ తీసుకుంటామన్న రాష్ట్రాలకే కేంద్రం పీఎంజీఎస్‌వై నిధులనిస్తుంది. ఇందుకు ఏపీ ప్రభుత్వం అంగీకరించినప్పటికీ పూర్తయిన రహదారుల నిర్వహణకు సంబంధించిన బిల్లులు సరిగా చెల్లించడం లేదు. నిర్వహణ లోపిస్తే రహదారులు దెబ్బతినే ప్రమాదముందని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘రహదారుల నిర్వహణకు సంబంధించిన బిల్లులు పెండింగ్‌లో ఉన్నది వాస్తవమే. విడుదల చేసేలా ఆర్థిక శాఖను సంప్రదిస్తున్నాం. త్వరలోనే చెల్లింపులు పూర్తవుతాయి’ అని పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని