గృహ నిర్మాణశాఖలో వసూల్‌ రాజా!

‘ఈ నెల మీ దగ్గర నుంచి ఖర్చుల నిమిత్తం రాలేదు.. వెంటనే పంపండి. మంత్రిగారు అడుగుతున్నారు. ఆలస్యం చేయొద్దు’

Published : 02 Oct 2022 04:35 IST

‘ఈ నెల మీ దగ్గర నుంచి ఖర్చుల నిమిత్తం రాలేదు.. వెంటనే పంపండి. మంత్రిగారు అడుగుతున్నారు. ఆలస్యం చేయొద్దు’

- ప్రత్యేక విధులు నిర్వహించే అధికారి తీరు


‘ఒక్క ఇంటికి ఇచ్చే రుణం రూ.1.80లక్షలు. ఇది సరిపోక లబ్ధిదారులు నానా తిప్పలు పడుతున్నారు. లబ్ధిదారులు మాకు ఏమన్నా ఇస్తారా..? మేము ఎక్కడి నుంచి తెచ్చివ్వాలి..? ఎలా ఖర్చు పెట్టాలి..?’

- గృహ నిర్మాణ సంస్థ అధికారి ఆవేదన


ఈనాడు, అమరావతి: పేదలందరికీ ఇళ్ల పథకం అమలుచేస్తున్న గృహనిర్మాణశాఖలో ఓ వసూల్‌రాజా తీరుతో అధికారులు హడలెత్తుతున్నారు. కనీసం రూ.లక్ష, గరిష్ఠంగా రూ.5లక్షల చొప్పున నిర్ణయించి వసూలుచేస్తున్నారు. ఇవ్వలేని అధికారులకు వేధింపులు తప్పట్లేదు. అ ప్రత్యేక విధుల అధికారి వ్యవహారం చర్చనీయాంశమైంది. అధికారులకు నేరుగా ఫోన్లు చేసి ఖర్చులకు మామూళ్లు కావాలని డిమాండు చేస్తున్నారు. ఒక జిల్లా అధికారి ఈ వసూళ్ల వేధింపులు తాళలేక వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేశారు. దాన్ని గృహనిర్మాణసంస్థ ఎండీ తిరస్కరించడంతో.. ఆ అధికారి మెడికల్‌ లీవుపై వెళ్లారు. అది అమాత్యుని సొంత జిల్లా కావడం విశేషం. అధికారిక సమీక్షలు, అనధికార కార్యక్రమాలు ఏవైనా.. ఖర్చులు ఆ శాఖ పైనే పడుతున్నాయి. అమాత్యుని ప్రత్యేక అధికారి విధులు నిర్వహిస్తున్న వ్యక్తి.. ఈ వసూళ్లకు పాల్పడుతున్నారు. నెలకు కనీసం రూ.లక్ష చొప్పున 26 జిల్లాల అధికారులు సర్దుబాటు చేయాలంటేనే కష్టం. గరిష్ఠం ఇంకా ఎక్కువగానే ఉంటుంది.
గృహ నిర్మాణశాఖకు ఓటీఎస్‌ (వన్‌టైం సెటిల్‌మెంట్‌ స్కీమ్
) నిధులు తప్ప ఇతర గ్రాంట్లు లేవు. జగనన్న కాలనీల్లో లబ్ధిదారులకు మంజూరుచేసే రూ.1.80లక్షలు నేరుగా వారి ఖాతాలోకి వెళ్తాయి. ఇక మౌలిక వసతులను మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలు చేపడుతున్నాయి. ఓటీఎస్‌, నాన్‌ఓటీఎస్‌ కింద చదును చేయడం, రహదారులు, వంతెనలు, డ్రెయిన్ల లాంటి పనులే ఉన్నాయి. వీటిలో కమీషన్‌ తక్కువ. ఇక ఖర్చులకు ఎక్కడ నుంచి తేవాలని అధికారులు వాపోతున్నారు. ఎన్టీఆర్‌ జిల్లా గృహనిర్మాణ సంస్థ కార్యాలయం ప్రైవేటు భవనంలో ఉంది. నెలకు అద్దె రూ.32వేలు. ఒక నెలకే మంజూరైంది. దీంతో డీఈఈలు తమ జేబు నుంచే అద్దెలు కడుతున్నట్లు తెలిసింది. విద్యుత్తు బిల్లులదీ అదే పరిస్థితి. ఎన్టీఆర్‌ జిల్లాలో అధికారిక సమీక్ష, అనధికార పర్యటనలు ఉన్నా.. ఆ శాఖపైనే ప్రొటోకాల్‌ ఖర్చుల భారం పడుతోంది. అసలే ఇళ్ల నిర్మాణంలో పురోగతి లేక తలలు పట్టుకుంటుంటే.. ఖర్చులకు సొమ్ములంటూ ప్రత్యేక విధుల అధికారి పీక్కుతింటున్నారని అధికారులు వాపోతున్నారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని