సభనుంచి వెళ్లిపోతున్న ఆ నలుగురి పేర్లు రాసుకోండి

కృష్ణాజిల్లా పెడనలో నిర్వహించిన వైఎస్సార్‌ చేయూత కృతజ్ఞత సభలో రాష్ట్ర మంత్రి జోగి రమేష్‌ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. పెడనలోని బస్టాండు సెంటరులో శుక్రవారం నిర్వహించిన ఈ సభకు చేయూతలో లబ్ధిపొందిన 1906 మంది మహిళలను తరలించారు.

Updated : 02 Oct 2022 06:15 IST

చర్చనీయాంశమైన మంత్రి జోగి రమేష్‌ వ్యాఖ్యలు

పెడన, న్యూస్‌టుడే: కృష్ణాజిల్లా పెడనలో నిర్వహించిన వైఎస్సార్‌ చేయూత కృతజ్ఞత సభలో రాష్ట్ర మంత్రి జోగి రమేష్‌ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. పెడనలోని బస్టాండు సెంటరులో శుక్రవారం నిర్వహించిన ఈ సభకు చేయూతలో లబ్ధిపొందిన 1906 మంది మహిళలను తరలించారు. మంత్రి ప్రసంగిస్తున్న సమయంలో ముందు వరుసలో ఉన్న నలుగురు మహిళలు అక్కడి నుంచి వెళ్లేందుకు ప్రయత్నించగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకోసం నేను వస్తే కూర్చోవడానికి ఇబ్బంది పడుతున్నారా అంటూ వ్యాఖ్యానించారు. ఆ నలుగురి పేర్లు రాసుకోవాలని సభా ప్రాంగణంలో ఉన్న సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. అయినప్పటికీ కొద్దిసేపటి తర్వాత ఆ నలుగురు వెళ్లిపోయారు. శుక్రవారం సాయంత్రం పెడనలో వర్షం పడటంతో లబ్ధిదారులు రావడం ఆలస్యమైంది. జోగి రమేష్‌ రాకకు ముందు కుర్చీలు ఖాళీగా కన్పించడంతో కంగారుపడిన నిర్వాహకులు అటువైపుగా వెళ్తున్న మహిళలను బలవంతంగా కూర్చోబెట్టారు. ఆ తర్వాత వర్షం తగ్గి లబ్ధిదారులు రావటంతో కుర్చీలు నిండాయి. ఇలా బలవంతంగా కూర్చోబెట్టిన మహిళల్లో నలుగురు.. మంత్రి ప్రసంగిస్తుండగా వెళ్లటానికి ప్రయత్నించగా ఆయన పై విధంగా ఆగ్రహం వెలిబుచ్చారు. సచివాలయ ఉద్యోగులు ఈ నలుగురి వివరాలు సేకరించేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. వారిది పెడన కాదని నిర్ధారించి మున్సిపల్‌ కమిషనర్‌కు సమాచారం అందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని