గ్రానైట్‌ లీజు గడువు కుదించడం సరికాదు

గ్రానైట్‌ లీజు గరిష్ఠ కాలపరిమితిని 20 ఏళ్లకు పరిమితం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ మైనర్‌ మినరల్‌ కన్సెషన్‌ నిబంధనను హైకోర్టు తప్పుపట్టింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన గ్రానైట్‌ రూల్స్‌ను పాటించాలని పేర్కొంటూ న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.రఘునందన్‌రావు తీర్పు ఇచ్చారు.

Published : 02 Oct 2022 04:35 IST

రాష్ట్ర ప్రభుత్వ విధానాన్ని  ఆక్షేపించిన హైకోర్టు

ఈనాడు, అమరావతి: గ్రానైట్‌ లీజు గరిష్ఠ కాలపరిమితిని 20 ఏళ్లకు పరిమితం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ మైనర్‌ మినరల్‌ కన్సెషన్‌ నిబంధనను హైకోర్టు తప్పుపట్టింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన గ్రానైట్‌ రూల్స్‌ను పాటించాలని పేర్కొంటూ న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.రఘునందన్‌రావు తీర్పు ఇచ్చారు. లీజులను వేలం ద్వారా కేటాయించేందుకు వీలు కల్పిస్తున్న ఏపీ మైనర్‌ మినరల్‌ వేలం నిబంధనలు (ఏపీఎంఎంఏఆర్‌)-2022ని సవాలు చేస్తూ ఫెడరేషన్‌ ఆఫ్‌ మైనర్‌ మినరల్స్‌ ఇండస్ట్రీ(ఫెమ్మీ) కార్యదర్శి, మరొకరు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. గ్రానైట్‌ క్వారీల వేలం ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు చెల్లుబాటు కావని పేర్కొన్నారు. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ఇంద్రజిత్‌ సిన్హా వాదించగా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. అనంతరం కోర్టు స్పందిస్తూ పలు వ్యాఖ్యలు చేసింది. ‘కేంద్ర ప్రభుత్వ గ్రానైట్‌ రూల్స్‌ ప్రకారం కాంపిటెంట్‌ అథార్టీకి లీజు కాలపరిమితిని 20 నుంచి 30 ఏళ్లకు నిర్ణయించే వీలుంది. ఆ అథార్టీకి ఉన్న విచక్షణాధికారాన్ని లాగేసుకునేలా ఏపీ మైనర్‌ మినరల్‌ రూల్స్‌ రూపొందించారు. కేంద్రం తెచ్చిన గ్రానైట్‌ రూల్‌ 6కు అనుగుణంగానే లీజు గడువు ఉండాలి తప్ప, ఏపీ మైనర్‌ మినరల్‌ రూల్‌ 12(5)(హెచ్‌) ప్రకారం కాదు. లీజు రెన్యువల్‌ 20 ఏళ్లని రూల్‌-6 స్పష్టం చేస్తోంది. దాన్ని కుదించడానికి వీల్లేదు’ అని హైకోర్టు పేర్కొంది. గ్రానైట్‌ మైనింగ్‌ లీజుకు ఏ విధానాన్ని అనుసరించాలో కేంద్రం తెచ్చిన గ్రానైట్‌ రూల్స్‌లో పేర్కొనలేదని తెలిపిన హైకోర్టు.. ఏపీ మైనర్‌ మినరల్‌ కన్సెషన్‌ రూల్స్‌ ప్రకారం ‘ఫస్ట్‌ కమ్‌ ఫస్ట్‌ సర్వ్‌’ ప్రాతిపదికన లీజు మంజూరు చేస్తున్నారని గుర్తుచేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని