వానొస్తే మునకే!

నగరాల రూపురేఖలను మార్చేస్తామంటున్న నేతల మాటలు నీటిమూటలవుతున్నాయి. కొద్దిపాటి వర్షానికే రోడ్లన్నీ వరదతో ముంచెతున్నాయి. వర్షపు నీటిని మళ్లిస్తే తప్ప మళ్లీ సాధారణ పరిస్థితులు ఏర్పడటం లేదు.

Updated : 02 Oct 2022 06:07 IST

వర్షమొస్తే నగరాల్లోని  రహదారుల ముంపు

ఈనాడు, అమరావతి: నగరాల రూపురేఖలను మార్చేస్తామంటున్న నేతల మాటలు నీటిమూటలవుతున్నాయి. కొద్దిపాటి వర్షానికే రోడ్లన్నీ వరదతో ముంచెతున్నాయి. వర్షపు నీటిని మళ్లిస్తే తప్ప మళ్లీ సాధారణ పరిస్థితులు ఏర్పడటం లేదు. విజయవాడలో బుధవారం ఉదయం కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహన చోదకులు, ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. విశాఖపట్నం, గుంటూరు, కాకినాడ, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కడప, కర్నూలు, అనంతపురంలలోనూ కొద్దిపాటి వానలకే రోడ్లన్నీ జలసంద్రాలుగా తయారవుతున్నాయి. ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన వరుస అల్పపీడనాల కారణంగా వర్షాలు కురిసిన ప్రతిసారీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ప్రణాళికల అమలులో లోపమే శాపం

వర్షాకాలానికి ఒకట్రెండు నెలల ముందు నుంచే ప్రధాన రహదారులకు ఇరువైపులా ఉన్న కాలువల్లో పూడిక తొలగించాలి. కాలువలపై ఆక్రమణల తొలగింపును చేపట్టాలి. కొద్దిచోట్ల మినహా అన్ని నగరాల్లోనూ ఇలాంటి ముందస్తు ప్రణాళికలను అమలు చేయడం లేదు. విజయవాడ, విశాఖపట్నం వంటి పెద్ద నగరాల్లోనూ ఈసారి అరకొరగానే పనులు చేపట్టారు. ఫలితంగా కాలువల్లో ప్రవహించాల్సిన వర్షపు నీరు రోడ్లపైనే నిలిచిపోతోంది. చివరికి బురదే కనిపిస్తోంది.

* విజయవాడలోని బందరురోడ్డు, నిర్మలా కాన్వెంట్‌ రోడ్డు, గుణదల, రైల్వే స్టేషన్‌, వన్‌టౌన్‌ తదితర ప్రాంతాల్లో నిలిచిపోతున్న నీటిని మోటార్లుతో తోడించి, ట్యాంకర్లతో కృష్ణా నదిలో వదులుతున్నారు.

* విశాఖలోని జ్ఞానాపురం, గాజువాక, పెందుర్తిలోని కొన్ని ప్రాంతాలతోపాటు జాతీయ రహదారిపై వర్షపు నీరు భారీగా నిలిచిపోతోంది.

* కడపలో ఆర్టీసీ బస్టాండ్‌ రోడ్డు, ఎన్‌జీవో కాలనీ, కృష్ణా థియేటర్‌ కూడలి, వన్‌టౌన్‌ సర్కిల్‌ నుంచి మద్రాస్‌ రోడ్డు ముంపునకు గురవడం సర్వసాధారణమైంది.

* తిరుపతిలోని లీలామహల్‌ ప్రాంతంలోని ఎర్రమిట్ట, సుబ్బారెడ్డినగర్‌, కొర్లగుంట, సత్యనారాయణపురం ముంపునకు గురవుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని