సంక్షిప్త వార్తలు

ఏడు అడుగుల బంధాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ 72 జంటలు ఒకే వేదికపై శనివారం షష్టిపూర్తి వేడుకల్లో పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం తిమ్మరాజుపేటలో జగ్గారావు మిత్రమండలి సభ్యులు ఈ వేడుకను నిర్వహించారు.

Updated : 02 Oct 2022 05:37 IST

72 జంటల.. 60 ఏళ్ల వేడుక

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: ఏడు అడుగుల బంధాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ 72 జంటలు ఒకే వేదికపై శనివారం షష్టిపూర్తి వేడుకల్లో పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం తిమ్మరాజుపేటలో జగ్గారావు మిత్రమండలి సభ్యులు ఈ వేడుకను నిర్వహించారు. విజయవాడ నుంచి వచ్చిన ఆరుగురు వేద పండితులు మంత్రోచ్ఛరణలతో ఈ వేడుకను కమనీయంగా జరిపించారు. హాజరైన 4 వేల మందికి విందు ఏర్పాటు చేశారు. వారి జీవితంలోని మధుర స్మృతులను గుర్తు చేసుకుంటూ ఆ జంటలు మురిసిపోయాయి.


జరిమానాలు విధించేది అధికారులు కాదు కోర్టులే: హైకోర్టు

ఈనాడు, అమరావతి: నిబంధనలను ఉల్లంఘిస్తూ... గనుల అక్రమ తవ్వకాలు, పరిధికి మించిన తవ్వకాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలతో ఆయా వ్యక్తులు, కంపెనీలపై గనుల శాఖ సహాయ సంచాలకులు/ప్రభుత్వ అధికారులు జరిమానాలు విధించలేరని హైకోర్టు తేల్చిచెప్పింది. ఆయా ప్రాంతాల పరిధిలోని న్యాయస్థానాలు మాత్రమే జరిమానా విధించగలవని స్పష్టంచేసింది. పిటిషనర్లకు జరిమానా విధిస్తూ గనుల శాఖ అధికారులు జారీచేసిన ఉత్తర్వులను రద్దు చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.రఘునందన్‌రావు ఇటీవల ఈమేరకు తీర్పు ఇచ్చారు.


సౌత్‌ ఇండియా షాపింగ్‌ మాల్‌లో ఆఫర్ల పండగ

ఈనాడు, హైదరాబాద్‌: దసరా, దీపావళి పండగల నేపథ్యంలో ‘సౌత్‌ ఇండియా షాపింగ్‌ మాల్‌’లో అక్టోబరు 25వరకు ఆకర్షణీయమైన డిస్కౌంట్లు  అందిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్‌ పి.వి.యస్‌.అభినయ్‌ ఓ ప్రకటనలో తెలిపారు. వీటితో పాటు రూ.6కోట్లు విలువచేసే బహుమతులతో ‘లక్కీ బంపర్‌ డ్రా’ను నిర్వహిస్తున్నామని, వీటి ఫలితాలు ఈ నెల 5, 25వ తేదీల్లో  వెల్లడిస్తామని పేర్కొన్నారు. విజేతలకు 50 కార్లు, 130 ఎలక్ట్రిక్‌ బైకులు, 100 వెండి పళ్లాలు, 1,140 ఇండక్షన్‌ స్టౌలతో పాటు ఇంకా ఎన్నో బహుమతులు అందజేస్తామని వివరించారు. 


ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌లో బహుమతుల సంబరాలు

ఈనాడు, హైదరాబాద్‌: దసరా, దీపావళి సందర్భంగా ‘ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌’లో వస్త్రాలు, నగలు కొనుగోలు చేసే కస్టమర్లు అద్భుతమైన బహుమతులు గెలుచుకోవచ్చని సంస్థ డైరెక్టర్‌ టి.కేశవ్‌ గుప్తా ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ నెల 5, 26వ తేదీల్లో గోల్డెన్‌ బంపర్‌ డ్రా ఫలితాలను ప్రకటించనున్నట్లు తెలిపారు. కొనుగోలుదారులు 2.5 కేజీల బంగారం, 80 కేజీల వెండి, 150 టీవీలు, 600 గ్రైండర్లు, 1,375 ఎలక్ట్రిక్‌ కుక్కర్లు తదితర బహుమతులు గెలుచుకొనే అవకాశం ఉందన్నారు. బంగారు, వెండి వస్తువులపైనా ఆఫర్లు అందిస్తున్నట్లు వివరించారు.


ముగ్గురు ఐఏఎస్‌ల బదిలీ

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ముగ్గురు ఐఏఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు. సెర్ప్‌ సీఈఓగా పనిచేస్తున్న ఎ.ఎండి.ఇంతియాజ్‌ భూపరిపాలనశాఖ అదనపు చీఫ్‌ కమిషనర్‌గా బదిలీ అయ్యారు. ప్రస్తుతం ఆ పోస్టులో ఉన్న బాబు.ఎ ను ఆంధ్రప్రదేశ్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ కోఆపరేటివ్‌ ఫెడరేషన్‌ ఎండీగా ప్రభుత్వం బదిలీ చేసింది. తిరుపతిలో ఎలక్ట్రానిక్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌ సీఈఓగా ఉన్న ఎం.గౌతమిని సెర్ప్‌ సీఈఓగా ప్రభుత్వం నియమించింది.


సాదా బైనామా భూముల క్రమబద్ధీకరణపై గెజిట్‌ విడుదల

ఈనాడు, అమరావతి: సాదా బైనామా భూముల దరఖాస్తుల పరిష్కారం (తెల్ల కాగితాలపై 01.11.2021కి ముందు జరిగిన లావాదేవీలు) కోసం రాష్ట్ర ప్రభుత్వం శనివారం గెజిట్‌ విడుదల చేసింది. గతంలో స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజు కలిపి రూ.5వేలలోపు ఉంటే ఉచితంగా క్రమబద్ధీకరించారు. ఈ సారి పరిమితులు విధించలేదు. చిన్న, మధ్య తరహా రైతులై ఉండి..ఐదు ఎకరాల వరకు బీడు (డ్రై ల్యాండ్‌) భూమి లేదా తడి (వెట్‌ ల్యాండ్‌) భూమి 2.5 ఎకరాల వరకు ఉంటే స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజు లేకుండా క్రమబద్ధీకరణ చేస్తామని గెజిట్‌లో ప్రభుత్వం పేర్కొంది. తగిన ఆధారాలతో 2023 డిసెంబరు 31 వరకు గ్రామ/వార్డు సచివాలయాలు, మీసేవ కేంద్రాల ద్వారా తహసీల్దారుకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. తాజా నిర్ణయం ప్రకారం 2021 ముందు వరకు జరిగిన లావాదేవీలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. వచ్చిన 30రోజుల్లోగా తహసీల్దారు దరఖాస్తులను పరిష్కరించాలి. గతంలో కంటే ఈ సారి దరఖాస్తుల పరిష్కారానికి పలు ప్రత్యామ్నాయాల ద్వారా వెసులుబాటు కల్పించారు.


కారుణ్య నియామకాలకు సీఎం అనుమతి
ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం వెల్లడి

ఈనాడు, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల కింద ఉపాధి కల్పించాలని సీఎం జగన్‌ నిర్ణయించారని ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి, అధ్యక్షుడు అంజన్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రొబేషన్‌ ఖరారు చేయక ముందే చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాలకు అవకాశం లేకపోయినా...సీఎం మానవతా దృక్పథంతో ఆలోచించి వెసులుబాటు కల్పించారని వారు పేర్కొన్నారు.


‘ఉపాధ్యాయులపై కేసులుఉపసంహరించాలి’

ఈనాడు, అమరావతి: నిర్బంధాలతో ఉద్యమాలను ఆపలేరని, ఉపాధ్యాయులపై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించాలని ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య (యూటీఎఫ్‌) మధ్యంతర కౌన్సిల్‌ డిమాండ్‌ చేసింది. విజయవాడలో రెండు రోజులపాటు జరగనున్న యూటీఎఫ్‌ రాష్ట్ర మధ్యంతర కౌన్సిల్‌ సమావేశాలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ‘నయా ఉదారవాద విధానాలు-ఉద్యోగులపై ప్రభావం’ అంశంపై ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. ‘సమాజ అంతరాలను విద్యతో తగ్గించాలి. దీనికి భిన్నంగా మార్కెట్‌ శక్తులకు అనుగుణంగా విద్యను మార్చుతున్నారు’ అని విమర్శించారు.


ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు నోటిఫికేషన్‌లో తప్పు

కావలి, న్యూస్‌టుడే: చిత్తూరు కేంద్రంగా తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గానికి వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికకు ఓటర్ల నమోదు నోటిఫికేషన్‌ శనివారం చిత్తూరు జిల్లా రెవెన్యూ అధికారి రాజశేఖర్‌ పేరిట విడుదల కాగా, అందులోని అచ్చు తప్పు చర్చనీయాంశమైంది. ప్రకటన తేదీని 1.10.22కి బదులు 1.11.2022గా ముద్రించారు. దీన్ని గమనించలేదని, సరిదిద్దుకుంటామని డీఆర్వో రాజశేఖర్‌ తెలిపారు.


1న కొందరు ఉద్యోగులకు అందని జీతాలు

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులకు అక్టోబర్‌ ఒకటో తేదీన జీతాలు అందలేదు. రెండున గాంధీ జయంతి, ఆదివారం కావడంతో మూడో తేదీ వరకు వేచి చూడాల్సిందే. ఈనెల 5న దసరా పండుగ ఉన్నందున ముందుగానే జీతాలు వస్తే వస్తు కొనుగోళ్లకు వీలుండేదని ఉద్యోగులు చెబుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఒకటో తేదీనే జీతాలివ్వకపోవడం కొన్నాళ్లుగా పరిపాటిగా మారిందని పేర్కొన్నారు.


హ్యాకింగ్‌కు గురైన తెదేపా ట్విటర్‌ ఖాతా

ఈనాడు డిజిటల్‌, అమరావతి: తెదేపా ట్విటర్‌ ఖాతా హ్యాక్‌ అయినట్లు ఆ పార్టీ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. వైకాపా మద్దతుదారులే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని ఆరోపించింది.


బీపీ మండల్‌ విగ్రహం ఏర్పాటుకు సహకరించాలని మంత్రికి వినతి

ఈనాడు, అమరావతి: బీసీల రిజర్వేషన్ల కోసం అలుపెరుగని పోరాటం చేసిన బీపీ మండల్‌ విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటుకు సహకరించాలని మంత్రి జోగి రమేశ్‌కు ఏపీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.మారేశ్‌, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వేముల బేబీరాణి శనివారం వినతిపత్రం అందజేశారు. బీసీలు రిజర్వేషన్‌ ఫలాలు అందుకోవడానికి ప్రధాన కారణమైన బీపీ మండల్‌ విగ్రహం ఏర్పాటు ద్వారా ఆయన జీవిత చరిత్ర ప్రజలకు తెలుస్తుందన్నారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించి... విగ్రహం ఏర్పాటుకు ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.


నార్మలైజేషన్‌లో గరిష్ఠం కంటే ఎక్కువ మార్కులు : జేడీ

ఈనాడు, అమరావతి: ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)లో నార్మలైజేషన్‌ చేసినందున నిర్దిష్ట మార్కులు 150కంటే ఎక్కువ వస్తాయని టెట్‌ సంయుక్త సంచాలకురాలు చంద్రిక తెలిపారు. బహుళ సెషన్స్‌లో పరీక్షలు నిర్వహించే రైల్వే నియామక మండలి, స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌, జేఈఈ మెయిన్స్‌ల్లోనూ ఈ విధానం అవలంబిస్తున్నారని, నార్మలైజేషన్‌లో అభ్యర్థులకు గరిష్ఠ మార్కులకంటే ఎక్కువ వచ్చే అవకాశముందని వెల్లడించారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని