గాంధేయ పథం

దక్షిణాఫ్రికాలో సమూల మార్పులు తీసుకురావడంలో గాంధీదే కీలకపాత్ర. గాంధేయ బోధనలతో జాతివివక్షను అధిగమించాం.

Updated : 02 Oct 2022 09:33 IST

దక్షిణాఫ్రికాలో సమూల మార్పులు తీసుకురావడంలో గాంధీదే కీలకపాత్ర. గాంధేయ బోధనలతో జాతివివక్షను అధిగమించాం. నైతికత, నిరాడంబరత, పేదల పట్ల ప్రేమ విషయంలో గాంధీ నిర్దేశించిన ప్రమాణాలను నేను అందుకోలేకపోయాను. గాంధీజీ ఎలాంటి బలహీనతలూ లేని మహోన్నతుడు కాగా.. నేను ఎన్నో బలహీనతలున్న మనిషిని.

- నెల్సన్‌ మండేలా


మహాత్మాగాంధీ సత్యాగ్రహ సిద్ధాంతాన్ని సత్యానికి ఉన్న నిజమైన శక్తిగా చెప్పుకోవచ్చు. ఆ శక్తే మనకు యుద్ధంలోనిజాయతీగా పోరాడటానికి, ప్రజల భాగస్వామ్యంతో బలోపేతమవడానికి ఉపయోగపడుతుంది.

- అల్‌ గోర్‌


మహాత్మాగాంధీ అంటే నాకు అపారమైన ఆరాధనాభావం. ఆయన.. మానవ స్వభావాన్ని లోతుగా అర్థం చేసుకున్న గొప్ప మానవతావాది. బాల్యం నుంచీ ఆయన జీవితం నాకు స్ఫూర్తిదాయకం. మానవుడి సామర్థ్యాలలోని సానుకూలాంశాలను పెంచి పోషించేందుకు ఆయన అనేక ప్రయత్నాలు చేశారు. ప్రపంచానికి ఆయన అందించిన ఆలోచనాయుధం... అహింస!

- దలై లామా


ఆయన వచ్చి.. దేశంలోని అసంఖ్యాక నిరాశ్రయుల గుమ్మం వద్ద నిలబడ్డారు. వాళ్లలో ఒకరిగా కలిసిపోయారు. వారి భాషలోనే మాట్లాడారు. వారందరినీ తనకు అత్యంత ఆప్తులుగా, ఎలాంటి సంకోచాలూ లేకుండా అంతలా అంగీకరించినవారు ఇంకెవరున్నారు?

- రవీంద్రనాథ్‌ ఠాగూర్‌


ఈ శతాబ్దపు అత్యుత్తమ వ్యక్తిగా... నేను ఎంచుకునే వ్యక్తి మోహన్‌దాస్‌ గాంధీ. ఎందుకంటే.. మానవ స్వభావంలోని విధ్వంసాత్మక కోణాన్ని ఎలా అధిగమించాలో ఆయన మనకు నేర్పించారు. మనం భౌతిక పోరాటం కాదు... నైతికమైన పోరాటంతోనే మార్పును, న్యాయాన్ని సాధించుకోవచ్చని ఆయన నిరూపించి చూపించారు.

- స్టీవ్‌ జాబ్స్‌


మన కాలపు రాజకీయ నాయకులందరిలో వివేకవంతమైన ఆలోచనలను ప్రతిపాదించినది గాంధీయే అన్నది నా నమ్మకం. ఆయన స్ఫూర్తిని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే.. లక్ష్యాల కోసం పోరాటంలో హింసాత్మక విధానాలను ఉపయోగించకపోవడమే కాదు... మనం చెడ్డదని నమ్మే దేంట్లోనూ పాలు పంచుకోకపోవడం కూడా.           

- ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌


చెడుపై గాంధీజీ అత్యంత శక్తిమంతంగా, బలంగా పోరాటం చేశారు. కానీ ఆయన పోరాడింది ద్వేషంతో కాదు... ప్రేమతో! నిజమైన శాంతికాముకత అంటే దుష్టశక్తులకు లొంగిపోవడం కాదు. అది.. ప్రేమకు ఉన్న సకల శక్తులను వినియోగించుకుని.. చెడును మరింత ధైర్యంగా ఎదుర్కోవడం.

- మార్టిన్‌ లూథర్‌కింగ్‌ జూనియర్‌


మేమందరం విప్లవవాదులమే కావచ్చు. కానీ, మేమంతా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మహాత్మాగాంధీ నుంచి స్ఫూర్తి పొందిన ఆయన శిష్యులమే. అంతకంటే ఎక్కువా కాదు.. తక్కువా కాదు.

- హో షి మిన్‌


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని