ఆహ్లాదంగా 60 ఏళ్ల మార్గదర్శి పండగ

ఎన్నో లక్షల మంది జీవితాల్లో వెలుగులు నింపిన మార్గదర్శి చిట్‌ఫండ్‌ 60 వసంతాల వేడుకలు రామోజీ ఫిల్మ్‌ సిటీలో శనివారం ఆహ్లాదంగా జరిగాయి. ఈ వేడుకల్లో రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు, మార్గదర్శి మేనేజింగ్‌ డైరెక్టర్‌ శైలజా కిరణ్‌, ఈనాడు ఎండీ సీహెచ్‌ కిరణ్‌, రామోజీ ఫిల్మ్‌ సిటీ ఎండీ విజయేశ్వరి, రామోజీరావు కుటుంబ సభ్యులు, మార్గదర్శి సిబ్బంది పాల్గొన్నారు.

Updated : 02 Oct 2022 08:52 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఎన్నో లక్షల మంది జీవితాల్లో వెలుగులు నింపిన మార్గదర్శి చిట్‌ఫండ్‌ 60 వసంతాల వేడుకలు రామోజీ ఫిల్మ్‌ సిటీలో శనివారం ఆహ్లాదంగా జరిగాయి. ఈ వేడుకల్లో రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు, మార్గదర్శి మేనేజింగ్‌ డైరెక్టర్‌ శైలజా కిరణ్‌, ఈనాడు ఎండీ సీహెచ్‌ కిరణ్‌, రామోజీ ఫిల్మ్‌ సిటీ ఎండీ విజయేశ్వరి, రామోజీరావు కుటుంబ సభ్యులు, మార్గదర్శి చిట్‌ఫండ్‌ ఉపాధ్యక్షులు రాజాజీ, వెంకటస్వామి, బలరామకృష్ణ, సాంబమూర్తి, మల్లికార్జున రావు, రామోజీ గ్రూపు సంస్థల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ వేడుకలకు విచ్చేసిన వారికి శైలజా కిరణ్‌ స్వాగతం పలికారు. మార్గదర్శి ప్రయాణంలో ప్రతి అడుగులో, ప్రతి మలుపులో రామోజీరావు వెన్నంటి నిలిచి ప్రోత్సహిస్తున్నారని కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం రామోజీరావు సమక్షంలో శైలజా కిరణ్‌ కేక్‌ కట్‌ చేశారు. మార్గదర్శి విజయాల్లో భాగస్వాములైన సిబ్బందికి, వినియోగదార్లకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

మాకు ఎంతో భరోసా: చందాదార్లు
మార్గదర్శి చిట్‌ఫండ్‌ 60 ఏళ్ల ప్రస్థానాన్ని, చందాదార్ల అభిప్రాయాలను ఈ కార్యక్రమంలో దృశ్య రూపకంగా ప్రదర్శించారు. మార్గదర్శి అంటేనే ‘భరోసా, నమ్మకం, భద్రత’ అని పలువురు చందాదార్లు తెలిపారు. తమ వ్యాపార, ఉద్యోగ విజయాల్లో మార్గదర్శి తోడ్పాటు మరువలేనిదని, తమకు మార్గదర్శితో విడదీయరాని అనుబంధం ఉందని తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన పలువురు చందాదార్లు వివరించారు. సముద్రంలో ప్రయాణించే నౌకలకు దారి చూపే లైట్‌హౌస్‌ మాదిరిగా, మార్గదర్శి చిట్‌ఫండ్‌ ఎన్నో కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తోందని వారు పేర్కొన్నారు. మార్గదర్శి చిట్‌ఫండ్‌ 1962లో ప్రారంభమైంది. ప్రజల్లో పొదుపు అలవాటును ప్రోత్సహించడంలో, వారి ఆర్థిక అవసరాలు తీర్చడంలో ఈ సంస్థ అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో సేవలు అందిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని