‘స్వచ్ఛ’ ర్యాంకుల్లో విశాఖ పెరిగింది... విజయవాడ తగ్గింది

కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ  ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌ ర్యాంకుల్లో గత ఏడాదితో పోలిస్తే విశాఖపట్నం ర్యాంకు ఈసారి 9 నుంచి 4కి పెరగ్గా... విజయవాడ 3 నుంచి 5కి తగ్గింది. అలాగే 1 నుంచి 10 లక్షల జనాభా ఉన్న కేటగిరీని  ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకుంది.

Published : 02 Oct 2022 05:18 IST

1-10 లక్షల జనాభా నగరాల్లో తిరుపతికి తొలి స్థానం

ఈనాడు, దిల్లీ: కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ  ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌ ర్యాంకుల్లో గత ఏడాదితో పోలిస్తే విశాఖపట్నం ర్యాంకు ఈసారి 9 నుంచి 4కి పెరగ్గా... విజయవాడ 3 నుంచి 5కి తగ్గింది. అలాగే 1 నుంచి 10 లక్షల జనాభా ఉన్న కేటగిరీని  ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకుంది. అందులో టాప్‌ 100 ర్యాంకుల్లో ఏపీలో మొత్తం 5 నగరాలు చోటు దక్కించుకున్నాయి. గతంతో పోలిస్తే వాటి ర్యాంకుల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. తిరుపతి 3 నుంచి 1వ స్థానానికి చేరుకుంది. రాజమహేంద్రవరం 41 నుంచి 91కి, కడప 51 నుంచి 93కి తగ్గింది. అదే కర్నూలు ర్యాంకు 70 నుంచి 55కి పెరిగింది. నెల్లూరు 60వ స్థానంలో నిలిచింది.

మొత్తం 7,500 మార్కులకు సర్వే

సేవల స్థాయిలో పురోగతికి (సర్వీస్‌ లెవెల్‌ ప్రోగ్రెస్‌) 3 వేల మార్కులు, ప్రజాభిప్రాయానికి (సిటిజన్‌ వాయిస్‌) 2,250 మార్కులు, ఓడీఫ్‌, ఓడీఎఫ్‌+, ఓడీఎఫ్‌++, వాటర్‌ ప్లస్‌, చెత్త రహిత నగరాలకు ఉన్న స్టార్‌ రేటింగ్‌ ధ్రువీకరణకు (సర్టిఫికేషన్‌) 2,250 మార్కులు కలిపి మొత్తం 7,500 మార్కులకు సర్వే నిర్వహించింది. మొత్తంగా 73,95,680 మంది ప్రజల నుంచి ఆన్‌లైన్‌లో ఫీడ్‌ బ్యాక్‌ స్వీకరించింది. 2701 మంది మదింపు దారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి 17,030 వాణిజ్య, 24,744 నివాస ప్రాంతాలను, 16,501 చెత్తశుద్ధీకరణ కేంద్రాలను, 1,496 రెమిడియేషన్‌ సైట్లను సందర్శించడంతో పాటు, క్షేత్ర స్థాయిలో తీసిన 22,26,805 ఫొటోలను విశ్లేషించిన అనంతరం ఈ ర్యాంకులను ప్రకటించినట్లు కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ వెల్లడించింది. 2016లో స్వచ్ఛ సర్వేక్షణ్‌ 73 పట్టణ స్థానిక సంస్థలతో మొదలవగా.. 2022 నాటికి ఆ సంఖ్య 4,354కి చేరినట్లు చెప్పింది.

* దక్షిణ జోన్‌ పరిధిలో 50 వేల నుంచి లక్షలోపు జనాభా గల పట్టణాల కేటగిరీలో పుంగనూరుకు సిటిజన్‌ ఫీడ్‌బ్యాక్‌ అవార్డు వచ్చింది. పులివెందుల (50 వేల నుంచి లక్షలోపు జనాభా), 25వేలు- 50వేల మధ్య జనాభా గల పట్టణాల కేటగిరీలో సాలూరుకు ఇన్నోవేషన్‌ అండ్‌ బెస్ట్‌ ప్రాక్టీసెస్‌ పురస్కారాలు లభించాయి.

పట్టణీకరణ ఒక ప్రాంతానికి పరిమితం చేయకూడదు..

రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌

పట్టణీకరణను ఒక ప్రాంతానికి పరిమితం చేయకూడదని రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డులను స్వీకరించిన అనంతరం దిల్లీ ఏపీ భవన్‌లో శనివారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ క్లీన్‌ ఏపీ కింద గత మూడేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో అవార్డులు దక్కాయి. ఇందుకు వాలంటీర్‌ వ్యవస్థ ఎంతో ఉపయోగపడింది. పట్టణాల నుంచి వెలువడుతున్న చెత్తను ప్రత్యామ్నాయ వనరుల సృష్టికి వినియోగిస్తున్నాం. బహిరంగ విసర్జనను అరికట్టేందుకు, మురుగునీటి శుద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. క్లీన్‌ ఏపీపై కార్యక్రమంపై నిఘా పెడుతున్నాం. రియల్‌టైమ్‌ మానిటరింగ్‌ చేస్తున్నాం...’ అని ఆయన వివరించారు. అన్ని జిల్లా కేంద్రాలను ఆకర్షణీయ నగరాలుగా తయారు చేసేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్‌ వెల్లడించారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts