కొత్త పీఆర్సీ జీతాల్లో భత్యాలకు కత్తెర

ప్రజా రవాణాశాఖ (ఆర్టీసీ) ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో నేడో, రేపో వేతన సవరణ (పీఆర్సీ)తో కూడిన కొత్త జీతాలు జమవుతాయి. ఉద్యోగులంతా తమ జీతాలు ఎంత పెరిగాయోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Updated : 03 Oct 2022 06:52 IST

ఆర్టీసీ ఉద్యోగులకు షాక్‌

వచ్చే నెల జీతంతో కలిపి ఇస్తామంటున్న అధికారులు

ఈనాడు, అమరావతి: ప్రజా రవాణాశాఖ (ఆర్టీసీ) ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో నేడో, రేపో వేతన సవరణ (పీఆర్సీ)తో కూడిన కొత్త జీతాలు జమవుతాయి. ఉద్యోగులంతా తమ జీతాలు ఎంత పెరిగాయోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే కొత్త జీతాల్లో భత్యాలను జత చేయకుండా నిలిపేశారు. దీంతో ఓవర్‌టైమ్‌ (ఓటీ)తోపాటు, వివిధ భత్యాల రూపంలో ఉద్యోగులకు దక్కాల్సిన సొమ్ము ఈ నెల జీతాలతో కలిపి రాదని తెలిసింది. మూలవేతనాన్ని చివరి నిమిషంలో ఖరారు చేయడమే దీనికి కారణమని తెలుస్తోంది. ఆర్టీసీలో 51,488 మంది ఉద్యోగులుండగా.. వీరందరికీ జూన్‌ నుంచి కొత్త పీఆర్సీ అమలవుతుందని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అయితే పలు కారణాలతో జూన్‌, జులై, ఆగస్టు జీతాల్లో పీఆర్సీ అమలు చేయలేదు. పదోన్నతులు పొందిన 2,096 మంది మినహా మిగిలిన వారికి.. అక్టోబరులో వచ్చే జీతంలో కొత్త పీఆర్సీ అమలు చేశారు. ఇందులో మూలవేతనం, డీఏ, హెచ్‌ఆర్‌ఏ, సీసీఏ తదితరాలే చూపారు. 45వేల మందికిపైగా ఉద్యోగులకు లభించే ఓటీ, డే ఔట్‌, నైట్‌ ఔట్‌, నైట్‌ షిఫ్ట్‌ భత్యాలు కలపలేదు. దీంతో ఉద్యోగులకు రూ.5-10 వేలు తగ్గనుంది.

మూల వేతనం ఖరారులో జాప్యం
ఆర్టీసీ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ప్రకారం మూలవేతనం ఎంతనేది ఖజానా శాఖ ఖరారుచేసి గత నెల చివర్లో ప్రకటించింది. దీంతో మూలవేతనం ఆధారంగా లెక్కించాల్సిన ఓటీ వివరాలను ఆర్టీసీ అధికారులు ఇవ్వలేకపోయారు. దీనివల్ల ఓటీ, ఇతర భత్యాలను కలపలేదని చెబుతున్నారు. ఈ భత్యాలన్నింటినీ వచ్చే నెల ఇచ్చే జీతంలో కలిపి ఇస్తామని అంటున్నారు. ఆర్టీసీలో 45వేల మందికి రావాల్సిన భత్యాలన్నీ కలిపి రూ.4 కోట్ల వరకు ఉంటాయని సమాచారం.

* కొత్త జీతాల పే స్లిప్స్‌ బయటకు వచ్చాయి. వాటిని గత నెల జీతాలతో పోలిస్తే.. ఎక్కువ మందికి పీఆర్సీ వల్ల పెద్దగా జీతం పెరగలేదని, డీఏ పెంపుతోనే జీతాలు పెరిగాయని చెబుతున్నారు. డీఏ 11.6 శాతం నుంచి 20.02 శాతానికి పెంచారు. దీనివల్ల జీతాల్లో పెరుగుదల కనిపిస్తోందని ఉద్యోగులు అంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని