కర్షక యోధులతో కలిసి నడిచిన జనం

రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని అరసవల్లి వరకు రైతులు చేపట్టిన మహాపాదయాత్రకు ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల, తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలాల్లో అపూర్వ స్పందన లభించింది.

Published : 03 Oct 2022 06:47 IST

రైతుల మహాపాదయాత్రకు అపూర్వ స్పందన

తూర్పుగోదావరి జిల్లాలో జన నీరాజనం

ఈనాడు డిజిటల్‌, ఏలూరు, న్యూస్‌టుడే- గోపాలపురం, నల్లజర్ల, ద్వారకా తిరుమల: రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని అరసవల్లి వరకు రైతులు చేపట్టిన మహాపాదయాత్రకు ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల, తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలాల్లో అపూర్వ స్పందన లభించింది. గాంధీజీ, లాల్‌బహదూర్‌శాస్త్రి జయంతి సందర్భంగా 21వ రోజు పాదయాత్ర ప్రారంభానికి ముందు ఆదివారం వారి చిత్రపటాలకు ఐకాస నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ద్వారకా తిరుమల నుంచి రాళ్లకుంట మీదుగా నల్లజర్ల మండలం అయ్యవరానికి యాత్ర చేరుకుంది. అక్కడ భోజన విరామ అనంతరం కొత్తగూడెం, గాంధీ కాలనీ మీదుగా దూబచర్లకు రైతులు చేరుకున్నారు. యాత్ర ద్వారకా తిరుమల కూడలికి వచ్చేసరికి చుట్టుపక్కల గ్రామాలవారు భారీగా చేరుకున్నారు. అక్కడ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ఐకాస నేతలు నివాళులర్పించారు. ఆపై యాత్ర రాళ్లకుంట చేరేసరికి రహదారులన్నీ సందడిగా మారాయి. అక్కడ ఎన్టీఆర్‌, అంబేడ్కర్‌ విగ్రహాల వద్ద నివాళులర్పించారు. రైతులకు ప్రతి గ్రామంలో మహిళలు ఘనస్వాగతం పలికారు. జంగారెడ్డిగూడెం శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సంఘంవారు గాంధీ కాలనీలో మహిళా రైతులకు గాజులు, పూలు ఇచ్చి స్వాగతం పలికారు. దూబచర్ల జాతీయ రహదారిలో ఫ్లైఓవర్‌ పైనుంచి రైతులపై పూలవర్షం కురిపించారు.
్య తూర్పుగోదావరి జిల్లా అయ్యవరంలోకి యాత్ర చేరినప్పుడు రైతులు ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేశారు. రాళ్లకుంట నుంచి దారులు అధ్వానంగా ఉన్నాయి. భారీ గోతులు పడటం, శనివారంనాటి వర్షాలకు గుంతల్లో నీరు చేరటంతో బురద మార్గంలోనే నడిచారు. విజయవాడ కనకదుర్గ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి తీసుకొచ్చిన గాజులు, పసుపు కుంకుమను గ్రామాల్లో మహిళలకు అందించారు.

పోలీసు ఆంక్షలు
ద్వారకా తిరుమల కూడలికి యాత్ర చేరుకోవటంతో గ్రామం లోపలినుంచి తిరిగి వచ్చేందుకు ఐకాస నాయకులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. గ్రామంలో నుంచి తిరిగి వచ్చేందుకు అనుమతి లేదని, ప్రధాన రహదారి మీదుగా వెళ్లాలని నియంత్రించారు. దీనిపై జేఏసీ నేత తిరుపతిరావు, తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి ముప్పిడి వెంకటేశ్వరరావు పోలీసులను ప్రశ్నించారు. వారి మధ్య స్వల్ప వాగ్వాదమేర్పడింది. పోలీసులు వారిస్తున్నా రైతులు గ్రామంలోనుంచే యాత్ర కొనసాగించారు. అనుమతి లేని మార్గంలో యాత్ర చేసినందుకు నిర్వాహకులపై కేసు పెడతామని ఎస్సై సుధీర్‌ హెచ్చరించారు.

సంఘీభావాల వెల్లువ
హైకోర్టు నుంచి 20 మందితో కూడిన న్యాయవాదుల బృందం వచ్చి ద్వారకాతిరుమల నుంచి యాత్రలో పాల్గొంది. జంగారెడ్డిగూడెం బార్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు మద్దతు ప్రకటించారు. చింతలపూడి నియోజకవర్గం నుంచి రైతులు, కూలీలు వచ్చి యాత్రలో పాల్గొన్నారు. అయ్యవరంలో కాంగ్రెస్‌ జిల్లా శ్రేణులు పాదయాత్రలో పాల్గొన్నాయి. జంగారెడ్డిగూడెం మండలం కేతవరానికి చెందిన భారతీయ కిసాన్‌ సంఘ్‌ నాయకులు వచ్చారు. మాజీ మంత్రి జవహర్‌, ఏలూరు జిల్లా తెదేపా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, మాజీ ఎంపీ మాగంటి బాబు, జడ్పీ మాజీ ఛైర్మన్‌ ముళ్లపూడి బాపిరాజు, మాజీ ఎమ్మెల్యేలు ముప్పిడి వెంకటేశ్వరరావు, మొడియం శ్రీనివాస్‌, ఘంటా మురళి, బూరుగుపల్లి శేషారావు తదితరులు యాత్రలో పాల్గొన్నారు.


21వ రోజు యాత్ర ఇలా..

* ప్రారంభం: ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల
* ముగింపు: తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం దూబచర్ల
* నడిచిన దూరం: 14 కి.మీ.


Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts