కాలం నేర్పిన జలపాఠం

కాలంతోపాటే వరి సాగు విధానం మారుతోంది. నీటి లభ్యత తగ్గడం.. గతి తప్పుతున్న రుతుపవనాల కారణంగా సంప్రదాయ వరి నాట్లకు బదులు రైతులు ‘వెద’ పద్ధతికి ప్రాధాన్యం ఇస్తున్నారు.

Published : 03 Oct 2022 03:38 IST

పెట్టుబడి ఖర్చు తక్కువ.. దిగుబడి ఎక్కువ

మన వెద సాగు విధానం దేశంలోనే ఆదర్శం

ఈనాడు-అమరావతి: కాలంతోపాటే వరి సాగు విధానం మారుతోంది. నీటి లభ్యత తగ్గడం.. గతి తప్పుతున్న రుతుపవనాల కారణంగా సంప్రదాయ వరి నాట్లకు బదులు రైతులు ‘వెద’ పద్ధతికి ప్రాధాన్యం ఇస్తున్నారు. సంప్రదాయ విధానంలోలాగా నారు పోసి నాట్లు వేయడం కాకుండా నేరుగా విత్తనాలను చల్లే ఈ విధానంలో కూలీల అవసరం తగ్గుతుంది. సాగునీటి పొదుపు.. తక్కువ పెట్టుబడి వంటి సానుకూల అంశాలు కర్షకులకు కలసి వస్తున్నాయి. వరిలో మడమ లోతు నీరు నిలిపి ఉంచకుండా అవసరం మేరకే నీరు పెట్టడానికి రైతులు అలవాటు పడుతున్నారు. ఇదంతా కాలం నేర్పిన జల‘పాఠం’! ఉమ్మడి గుంటూరు జిల్లాలో వరుసగా 12వ ఏడాదిలోనూ ‘వెద’ పద్ధతి కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల హెక్టార్లలో ఈ విధానంలో వరి సాగవుతుండగా, ఉమ్మడి గుంటూరు జిల్లాల్లోనే లక్ష హెక్టార్లలో సాగవుతోంది. ఇక్కడి విధానాన్ని అధ్యయనం చేసిన తమిళనాడు శాస్త్రవేత్తలు అక్కడా అమలు చేస్తున్నారు. పంజాబ్‌లో గతేడాది వెద విధానంలో 5.62 లక్షల హెక్టార్లు సాగులోకి వచ్చింది. ఈ విధానాన్ని ప్రోత్సహించడానికి అక్కడి ప్రభుత్వం ఎకరాకు రూ. 1,500 ప్రోత్సాహం ప్రకటించింది.

నీటి లభ్యత లేకున్నా..
ఆరుతడి విధానం వల్ల నీటిలభ్యత లేక ఒకటి రెండు రోజులు సాగునీరు ఆలస్యమైనా పెద్దగా ఇబ్బంది ఉండదని రైతులు చెబుతున్నారు. వెద విధానంలో పెట్టుబడి, కూలీలు తగ్గడంతోపాటు పంట పది రోజుల ముందుగానే కోతకు వస్తుందని మార్టేరు ప్రాంతీయ పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త దక్షిణామూర్తి తెలిపారు. డ్రమ్‌సీడర్‌ ద్వారా విత్తడం వల్ల సాగులో యాంత్రీకరణకు వెసులుబాటు కలుగుతుంది. వెద సాగులో మీథేన్‌ గ్యాస్‌ విడుదల 38 శాతం వరకు తగ్గుతుందని అంతర్జాతీయ వరి పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు అంచనా వేశారు. దీనిపై మార్టేరు ప్రాంతీయ పరిశోధన కేంద్రంలోనూ పరిశోధనలు ప్రారంభించామని దక్షిణామూర్తి తెలిపారు.  

కూలీల అవసరం తక్కువే..
* వరి సాగులో వెద పద్ధతిలో కూలీల అవసరం బాగా తగ్గుతుంది.
* హెక్టారుకు 37 కిలోల వరకు విత్తనం ఆదా అవుతుంది.

* పెట్టుబడి వ్యయం హెక్టారుకు రూ. 18,625 తగ్గుతుంది.

* సంప్రదాయ సాగుతో పోల్చితే 18 నుంచి 22 శాతం నీరు ఆదా చేయవచ్చు.
* ఎకరానికి దిగుబడి 5 బస్తాలకు పైగా దిగుబడి పెరుగుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని