సంక్షిప్త వార్తలు

హిందీ భాష, సాహిత్యాన్ని ప్రోత్సహించడంలో చేసిన కృషికి గుర్తింపుగా ఆంధ్ర విశ్వవిద్యాలయం హిందీ విభాగ గౌరవ ఆచార్యులుగా ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ నియమితులయ్యారు. విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య పి.వి.జి.డి.ప్రసాదరెడ్డి సోమవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

Updated : 04 Oct 2022 05:53 IST

ఏయూ హిందీ విభాగ గౌరవ ఆచార్యునిగా యార్లగడ్డ

ఏయూ ప్రాంగణం (విశాఖపట్నం) న్యూస్‌టుడే : హిందీ భాష, సాహిత్యాన్ని ప్రోత్సహించడంలో చేసిన కృషికి గుర్తింపుగా ఆంధ్ర విశ్వవిద్యాలయం హిందీ విభాగ గౌరవ ఆచార్యులుగా ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ నియమితులయ్యారు. విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య పి.వి.జి.డి.ప్రసాదరెడ్డి సోమవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.


62 ఏళ్ల వరకు వారిని కొనసాగించాలి
ఏఎన్‌యూ బోధనేతర సిబ్బంది విషయంలో హైకోర్టు

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో పనిచేస్తున్న డిప్యూటీ రిజిస్ట్రార్‌, సహాయ రిజిస్ట్రార్‌, సీనియర్‌ అసిస్టెంట్‌, గ్రంథాలయ సహాయకులు, క్లీనరు తదితర బోధనేతర సిబ్బందికి హైకోర్టులో ఉపశమనం లభించింది. వారందర్నీ 62 ఏళ్ల వయసు వరకు సర్వీసులో కొనసాగించాలని తేల్చిచెప్పింది. నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ పదవీ విరమణ వయసును 60కే పరిమితం చేస్తూ ఏఎన్‌యూ రిజిస్ట్రార్‌, తదనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వమిచ్చిన ఉత్తర్వుల అమలును నిలిపేస్తూ ఇటీవల మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. విచారణను ఈ ఏడాది డిసెంబరు 17కు వాయిదా వేసింది. పదవీ విరమణ వయసును 60 ఏళ్లకే పరిమితం చేయడాన్ని సవాలు చేస్తూ ఏఎన్‌యూలో వివిధ కేడర్లలో పనిచేస్తున్న పలువురు హైకోర్టులో వ్యాజ్యాలు వేశారు. వారి తరఫు న్యాయవాది ఎస్‌.లక్ష్మీనారాయణరెడ్డి వాదనలు వినిపించారు.


సర్వదర్శనానికి 12 గంటల సమయం  

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా సర్వదర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. సోమవారం సాయంత్రానికి ధర్మదర్శనానికి క్యూలైన్‌లలో వచ్చిన వారితో వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. వీరికి 12 గంటల్లో శ్రీవారి దర్శనం లభించనుందని తితిదే తెలిపింది. ఆదివారం స్వామివారిని 82,463 మంది దర్శించుకున్నారు. రూ.2.31 కోట్ల హుండీ కానుకలు లభించాయి. 35,385 మంది తలనీలాలు సమర్పించారు. భక్తులు 4,46,519 లడ్డూలు కొనుగోలు చేశారు.


ట్యూషన్‌ ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ పెంపు

ఈనాడు, అమరావతి: కొత్త పీఆర్సీ ప్రకారం నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగులు, చివరి గ్రేడ్‌ సర్వీసు ఉద్యోగుల పిల్లలకు ప్రభుత్వం రీఎంబర్స్‌మెంట్‌ చేసే ట్యూషన్‌ ఫీజును రూ.వెయ్యి నుంచి రూ.2,500కు పెంచింది. ఎల్‌కేజీ నుంచి ఇంటర్మీడియట్‌ వరకు చదివే ఒక విద్యార్థికి రూ.2,500 చొప్పున ప్రభుత్వం చెల్లించనుంది. ఒక్కో ఉద్యోగికి చెందిన ఇద్దరు పిల్లలకు ఇది వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది.


కంటైనర్‌ సబ్‌స్టేషన్‌ వైపు.. ఈపీడీసీఎల్‌ చూపు

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం: విద్యుత్తు ఉపకేంద్రాల నిర్మాణంలో స్థల సమస్యను అధిగమించేందుకు కంటైనర్‌ సబ్‌స్టేషన్లు ఏర్పాటు చేసుకోవాలని అధికారులు యోచిస్తున్నారు. తొలిసారి విశాఖలో ప్రయోగాత్మకంగా 5 మెగావోల్ట్స్‌ యాంప్స్‌ సామర్థ్యంతో కూడిన 33/11 కేవీ హైబ్రిడ్‌ జీఐఎస్‌ కంటైనర్‌ సబ్‌స్టేషన్‌ నిర్మించనున్నారు. ఇందుకోసం తూర్పు ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్‌) అధికారులు రూ.4.95 కోట్ల అంచనా విలువను ప్రతిపాదించారు. పట్టణీకరణతో కొత్తగా విద్యుత్తు ఉపకేంద్రాలను నిర్మించాలంటే స్థలాలు దొరకడం లేదు. ఒకవేళ ఉన్నా స్థలానికే రూ.కోట్లలో వెచ్చించాల్సి వస్తోంది. సుమారు 200 గజాల్లో ఏర్పాటుచేసే కంటైనర్‌ సబ్‌స్టేషన్‌లోని పరికరాలను అవసరమైతే విడదీయవచ్చు. గాలి ఒత్తిడిని కూడా ఇది అధిగమిస్తుంది.


విభజన సమస్యలు పరిష్కరించాలి
రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వక్తలు

విజయవాడ (అలంకార్‌ కూడలి), న్యూస్‌టుడే: రాష్ట్ర విభజన సమస్యలను తక్షణం పరిష్కరించాలని పలువురు వక్తలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సోమవారం విజయవాడ బాలోత్సవ్‌ భవన్‌లో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ  విశాఖ రైల్వే జోన్‌ కుదరదని రైల్వే అధికారులు తెగేసి చెబుతున్నారని, ఇదంతా కేంద్రానికి తెలియకుండా జరుగుతుందా అని ప్రశ్నించారు.  సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వై.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన హక్కులపై పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు. సీపీఐఎంఎల్‌ లిబరేషన్‌ రాష్ట్ర కమిటీ సభ్యుడు డి.హరినాథ్‌ తన ప్రసంగంలో విభజన హామీలు అమలు చేయకపోయినా రాష్ట్రపతి ఎన్నికల్లో భాజపా, వైకాపా, తెదేపాలు కేంద్రానికి మద్దతు పలికాయని విమర్శించారు.


ఉపాధ్యాయుల పదోన్నతులకు షెడ్యూల్‌ విడుదల

ఈనాడు, అమరావతి: ప్రభుత్వ బడుల్లోని స్కూల్‌ అసిస్టెంట్లు, ప్రధానోపాధ్యాయులు గ్రేడ్‌-2 పదోన్నతులకు పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్‌ విడుదల చేసింది. ఈ నెల ఏడో తేదీలోపు సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌(ఎస్జీటీ), స్కూల్‌ అసిస్టెంట్ల ప్రాథమిక సీనియారిటీ జాబితాను వెబ్‌సైట్‌లో పెట్టాలని జిల్లా విద్యాధికారులు(డీఈవో), ప్రాంతీయ సంయుక్త సంచాలకులను ఆదేశించింది. ప్రాథమిక సీనియారిటీ జాబితాపై 7, 8 తేదీల్లో అభ్యంతరాలు స్వీకరిస్తారు. అభ్యంతరాల పరిశీలన, పరిష్కారం 9న, తుది సీనియారిటీ జాబితా 10న ఉంటుంది. స్కూల్‌ అసిస్టెంట్లకు ప్రధానోపాధ్యాయులు గ్రేడ్‌-2గా తాత్కాలిక పదోన్నతులు 11న, ఎస్జీటీలకు స్కూల్‌ అసిస్టెంట్లుగా తాత్కాలిక పదోన్నతులు 12, 13 తేదీల్లో ఇస్తారు.


సమగ్ర శిక్షా అభియాన్‌ ఎస్పీడీ వెట్రిసెల్వీ బదిలీ

మగ్ర శిక్షా అభియాన్‌ రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్‌ వెట్రిసెల్వీని ఆంగ్ల మాధ్యమం ప్రాజెక్టు ప్రత్యేక అధికారిగా బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాల విద్య సంయుక్త కార్యదర్శిగానూ ఆమెకు బాధ్యతలు అప్పగించారు. పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ను సమగ్ర శిక్షా అభియాన్‌ రాష్ట్ర ప్రాజెక్టు ఇన్‌ఛార్జి డైరెక్టర్‌గా నియమించారు.


రికార్డు అసిస్టెంట్‌ పోస్టు పదోన్నతికి మార్గదర్శకాలు

జిల్లా గ్రంథాలయ సంస్థల్లోని రికార్డు అసిస్టెంట్‌ పోస్టుకు పదోన్నతి, బదిలీకి స్పష్టతనిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పదో తరగతి ఉత్తీర్ణులై, చివరి గ్రేడ్‌లో కనీసం రెండేళ్లు పని చేసిన వారికి రికార్డు అసిస్టెంట్‌గా పదోన్నతి కల్పించాలని పేర్కొంది.  


12లోగా ఈ-కేవైసీ చేయించుకోవాలి
రైతులకు వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్‌ హరికిరణ్‌ సూచన

ఈనాడు, అమరావతి: పంటల బీమాకు అర్హత సాధించాలంటే అక్టోబరు 12వ తేదీ లోగా ఆర్‌బీకేల్లో ఈ-కేవైసీ చేయించుకోవాలని వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్‌ సి.హరికిరణ్‌ రైతులకు సూచించారు. ఖరీఫ్‌లో ఇప్పటి వరకు 1.09 కోట్ల ఎకరాల్లో పంటలను సాగు చేశారని, 90% ఈ-క్రాప్‌ ద్వారా ధ్రువీకరించామని వివరించారు. ఈ-కేవైసీ పూర్తయిన రైతుల జాబితాను అక్టోబరు 16వ తేదీ నుంచి సామాజిక తనిఖీ కోసం ఆర్‌బీకేల్లో ఉంచుతామని తెలిపారు.


వాహనాల ద్వారా అంగన్‌వాడీ, జగనన్న గోరుముద్ద సరకులు

ఈనాడు, అమరావతి: అంగన్‌వాడీ కేంద్రాలు, జగనన్న గోరుముద్ద పథకాలకు సంబంధించిన బియ్యం, ఇతర సరకులను అక్టోబరు నుంచి మొబైల్‌ వాహనాల ద్వారా సరఫరా చేయాలని పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ అరుణ్‌కుమార్‌ ఆదేశించారు. రేషన్‌ డీలర్ల నుంచి అంగన్‌వాడీ, మధ్యాహ్న భోజన పథకాల సరకులు తీసుకుని అంగన్‌వాడీ వర్కర్లు, పాఠశాల బాధ్యులకు అందించాలని పేర్కొన్నారు. ఈ మేరకు మ్యాపింగ్‌ ప్రక్రియ పూర్తి చేయాలని సూచిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.


నీట్‌ పీజీ కన్వీనర్‌ కోటా ప్రవేశాల జాబితా వెల్లడి

ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో అందుబాటులో ఉన్న పీజీ ఎండీ/ఎంఎస్‌ సీట్లకు సంబంధించి కన్వీనర్‌ కోటా ప్రవేశాల జాబితాను సోమవారం విజయవాడలోని డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం వెల్లడించింది. ఈ విద్యా సంవత్సరానికి.. మొత్తం 2,513 సీట్లకుగాను జాతీయ కోటా పోను మిగిలిన వాటిలో సర్వీస్‌ కేటగిరీలో 266 మందికి, నాన్‌-సర్వీస్‌ కోటాలో 822 మందికి సీట్ల కేటాయించినట్లు రిజిస్ట్రార్‌ డాక్టర్‌ సీహెచ్‌ శ్రీనివాసరావు తెలిపారు. అభ్యర్థులు ఈ నెల 8వ తేదీ సాయంత్రం 4 గంటల్లోగా ఆయా కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది. మరోవైపు జాతీయ స్థాయిలో ఆల్‌ ఇండియా కోటాలో సీట్లు పొందిన వారు కళాశాలల్లో చేరే గడువును ఈ నెల 7వ తేదీ వరకు పొడిగించారు.


జాతీయ కోటా వైద్య ప్రవేశాల కౌన్సెలింగ్‌ 11 నుంచి

ఈనాడు, హైదరాబాద్‌: ఎంబీబీఎస్‌, బీడీఎస్‌లో అఖిల భారత స్థాయి సీట్లలో ప్రవేశాలకు ఈ నెల 11 నుంచి, తెలంగాణలో సీట్లకు 17 నుంచి కౌన్సెలింగ్‌ ప్రక్రియలు ప్రారంభం కానున్నాయి. ఈమేరకు జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) సోమవారం షెడ్యూల్‌ విడుదల చేసింది. నవంబరు 15 నుంచి తొలి ఏడాది వైద్యవిద్య తరగతులు ప్రారంభం కావాలని సూచించింది.


చర్చించకుండానే పరీక్ష విధానంలో మార్పులా?

ఈనాడు, అమరావతి: ఉపాధ్యాయ సంఘాలతో చర్చించకుండానే ప్రభుత్వం పాఠశాల పరీక్షల్లో మార్పులు తీసుకొచ్చిందని ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య (యూటీఎఫ్‌), ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య పేర్కొన్నాయి. ఇప్పుడు ఉన్న పరీక్ష విధానంలో ఏం లోపం ఉందో.. కొత్త విధానంతో విద్యార్థులకు ఏం లాభం కలుగుతుందో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశాయి. ప్రతి ఏడాది పరీక్షల్లో రకరకాల మార్పులు చేయడం వల్ల విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని