ప్రపంచ బ్యాంకు ఆదేశాలతో పరీక్షల్లో మార్పులు

ప్రపంచ బ్యాంకుతో రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ చేసుకున్న ఒప్పందంలో భాగంగా ఈ ఏడాది ఫార్మెటివ్‌, సమ్మెటివ్‌ పరీక్షల్లో మార్పులు చేసింది. ఫార్మెటివ్‌-1, 3, సమ్మెటివ్‌-2 పరీక్షలను తరగతి గది ఆధారిత అంచనా(సీబీఏ) విధానంలో నిర్వహిస్తారు.

Published : 04 Oct 2022 05:17 IST

ఓఎమ్మార్‌ విధానంలో ఫార్మెటివ్‌-1, 3,  సమ్మెటివ్‌-2 పరీక్షలు
దిద్దుబాట్లకు ఆస్కారముందంటూ  ఉపాధ్యాయుల ఆందోళన

ఈనాడు, అమరావతి: ప్రపంచ బ్యాంకుతో రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ చేసుకున్న ఒప్పందంలో భాగంగా ఈ ఏడాది ఫార్మెటివ్‌, సమ్మెటివ్‌ పరీక్షల్లో మార్పులు చేసింది. ఫార్మెటివ్‌-1, 3, సమ్మెటివ్‌-2 పరీక్షలను తరగతి గది ఆధారిత అంచనా(సీబీఏ) విధానంలో నిర్వహిస్తారు. ప్రపంచ బ్యాంకు ఒప్పందం నేపథ్యంలో విద్యార్థుల సామర్థ్యాలను విశ్లేషించేందుకు ఎడ్యుకేషన్‌ ఇనిషియేటివ్స్‌ సంస్థతో విద్యాశాఖ మరో అవగాహన చేసుకుంది. ఈ సంస్థ ఆదేశాలతో పరీక్షల్లో మార్పులు చేశారు. ఫార్మెటివ్‌ పరీక్షల్లో 15 మార్కులకు ఓఎమ్మార్‌ విధానంలో, మరో ఐదు మార్కులకు రాతపూర్వకంగా పరీక్ష నిర్వహిస్తారు. 1-8తరగతుల విద్యార్థులకు అన్ని సబ్జెక్టులకు కలిపి ఒకే ఓఎమ్మార్‌ షీటు ఇస్తారు. ఇందులోనే ఒక్కో సబ్జెక్టుకు 15 చొప్పున బహుళైచ్చిక సమాధానాలు ఉంటాయి. మొదటి రోజు ఉదయం ప్రశ్నపత్రంతోపాటు ఓఎమ్మార్‌ షీటు ఇస్తారు. మధ్యాహ్నం పరీక్షకు మళ్లీ అదే ఓఎమ్మార్‌ను ఇస్తారు. ఇలా రెండు రోజులపాటు జరిగే పరీక్షలకు ఓఎమ్మార్‌ ఇచ్చి, తీసుకుంటారు. ప్రైవేటు వారికి ఓఎమ్మార్‌ షీట్లు ఉండవు. వారు ప్రశ్నపత్రంలోనే జవాబులు రాయాల్సి ఉంటుంది. ఉర్దూ, కన్నడ లాంటి మైనర్‌ భాషలకు కూడా అంతే. ఈ షీట్ల ముద్రణ ఆలస్యమవుతున్నందున పరీక్షల షెడ్యూలును మార్చేశారు. నవంబరు 2-5వరకు ఫార్మెటివ్‌-1 పరీక్షలు ఉంటాయి. 9, 10 తరగతులకు పాత విధానంలో పరీక్షలు నిర్వహిస్తారు.

తప్పుల సవరణకు అవకాశం?

విద్యార్థులకు ఉదయం పరీక్షకు సంబంధించిన ఓఎమ్మార్‌ షీటునే మళ్లీ మధ్యాహ్నం ఇస్తే సమాధానాలు మార్చే అవకాశం ఉంటుందని, తద్వారా అందరికీ ఎక్కువ మార్కులు రావొచ్చని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఉదాహరణకు.. ‘1-5 తరగతులకు నవంబరు ఒకటిన మొదటి రోజు ఉదయం తెలుగు ప్రశ్నపత్రంతోపాటు 15మార్కుల బహుళైచ్చిక జవాబులు రాసేందుకు ఓఎమ్మార్‌ షీటు ఇస్తారు. అందులో విద్యార్థులు కొన్నింటికి తప్పుడు సమాధానాలు రాయొచ్చు. పరీక్ష తర్వాత పిల్లలు తాము రాసిన జవాబుల్లో తప్పులను గుర్తిస్తారు. మధ్యాహ్నం జరిగే గణిత పరీక్షకు ఉదయం ఇచ్చిన ఓఎమ్మార్‌ షీట్‌నే మళ్లీ ఇస్తే ఉదయం మార్క్‌ చేసిన సమాధానాల్లోని తప్పులను సరిచేసే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు విద్యార్థుల సామర్థ్యాలను ఎలా అంచనా వేయగలం’ అని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. ప్రపంచ బ్యాంకు ఒప్పందం కారణంగా బేస్‌లైన్‌ పరీక్ష, తరగతి గది ఆధారిత అంచనా పరీక్షలంటూ ముద్రణకే రూ.కోట్లు వెచ్చిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని