‘విస్తరణ’ టెండర్లపై నేతల కన్ను

సీఎం జగన్‌ సొంత నియోజకవర్గం పులివెందుల మీదుగా వెళ్లే జాతీయ రహదారి విస్తరణ పనుల టెండర్లను తెరిచే ప్రక్రియను అధికారులు పదేపదే వాయిదా వేస్తున్నారు. సాంకేతిక బిడ్లను వెల్లడించడానికి సోమవారం గడువు ముగియగా, చివరి నిమిషంలో ఈనెల 17కి వాయిదా వేశారు.

Published : 04 Oct 2022 05:17 IST

తెరుచుకోని పులివెందుల హైవే విస్తరణ బిడ్‌
ఒత్తిళ్లు పనిచేస్తున్నాయేమోనని గుత్తేదారువర్గాల్లో చర్చ

ఈనాడు, అమరావతి: సీఎం జగన్‌ సొంత నియోజకవర్గం పులివెందుల మీదుగా వెళ్లే జాతీయ రహదారి విస్తరణ పనుల టెండర్లను తెరిచే ప్రక్రియను అధికారులు పదేపదే వాయిదా వేస్తున్నారు. సాంకేతిక బిడ్లను వెల్లడించడానికి సోమవారం గడువు ముగియగా, చివరి నిమిషంలో ఈనెల 17కి వాయిదా వేశారు. దీనికి తెరవెనుక నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని, ఇద్దరు బలమైన నేతలు పనులపై ఆసక్తి చూపడమే ఇందుకు కారణమని గుత్తేదారులు చర్చించుకుంటున్నారు. ఇవీ వివరాలు... వైయస్‌ఆర్‌ జిల్లా ముద్దనూరు నుంచి పులివెందుల మీదుగా బి.కొత్తపల్లి వరకు 56 కి.మీ. మేర జాతీయ రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించేందుకు రూ.891.44 కోట్ల అంచనాతో టెండర్లు పిలిచారు. సెప్టెంబరు 2తో ముగియాల్సిన టెండర్ల దాఖలు గడువును... మూడుసార్లు పెంచి, చివరకు అదేనెల 23న ముగించారు. బిడ్లను సెప్టెంబరు 26న తెరిచి, టెండర్లు వేసిన వారి వివరాలు ప్రకటిస్తామని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ (మోర్త్‌) అధికారులు ప్రకటించారు. అయితే... బిడ్లు తెరిచే తేదీని ఈ నెల 3(సోమవారం)కు వాయిదా వేశారు. షరామామూలుగా బిడ్లు తెరిచే తేదీని మరోసారి ఈనెల 17కు మార్చినట్లు గుత్తేదారులకు మెయిల్‌లో సాయంత్రం సమాచారం పంపారు.

ఎందుకీ వాయిదాలు?

టెండర్లను తెరిచే తేదీని పదేపదే వాయిదా వేస్తుండటంతో గుత్తేదారులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. పనులు చేసేందుకు కొన్ని ఉత్తరాది సంస్థలు బిడ్లు వేసినట్లు తెలుస్తోంది. అదేసమయంలో ముఖ్యమంత్రికి సన్నిహితుడైన, పులివెందులకే చెందిన ఓ ప్రజాప్రతినిధి, రాష్ట్ర ప్రభుత్వంలో నంబరు-2గా వ్యవహరిస్తున్న మంత్రి కుమారుడైన మరో ప్రజాప్రతినిధి ఇద్దరూ కలిసి... ఈ టెండరును సొంతం చేసుకునేందుకు మొదటి నుంచి ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారంలో ఉంది. మరోవైపు సీఎం సొంత నియోజకవర్గంలో జరిగే పనికావడంతో.. తమపై ఒత్తిళ్లు తెచ్చి టెండర్లు దాఖలు చెయ్యనివ్వలేదంటూ కొన్ని గుత్తేదారు సంస్థలు, దిల్లీలోని మోర్త్‌ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినట్లు సమాచారం.

తెలంగాణలో వెంటనే తెరుస్తున్న టెండర్లు

తెలంగాణలో మోర్త్‌ పిలిచే టెండర్లను వెన్వంటనే తెరుస్తున్నారు. కల్వకుర్తి నుంచి కొల్లాపూర్‌ వరకు 79.3 కి.మీ. మేర జాతీయ రహదారి నిర్మాణానికి రూ.630 కోట్ల అంచనాతో మోర్త్‌ టెండర్లు పిలిచింది. దీనికి బిడ్ల దాఖలు గడువు సెప్టెంబరు 26న ముగిసింది. మరుసటి రోజే (27న) వాటిని తెరిచి 14 మంది టెండర్లు వేసినట్లు ప్రకటించారు. ఏపీలో రాష్ట్రంలో మాత్రం బిడ్లను సకాలంలో తెరవడం లేదని మోర్త్‌ అధికారులపై విమర్శలు వస్తున్నాయి. దీనిపై మోర్త్‌ ఏపీ ప్రాంతీయ అధికారి (ఆర్వో) ఎస్కే సింగ్‌ను వివరణ కోరేందుకు ఫోనులో సంప్రదించగా.. ఆయన స్పందించలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని