అన్నగారి భోజనశాల... జనతా వస్త్రాలు

ఎన్టీఆర్‌కు వీరాభిమాని అయిన ఉయ్యూరు శ్రీనివాస్‌... ప్రజాసేవలోనూ ఆయన్నే స్ఫూర్తిగా తీసుకున్నారు. తన అభిమాన నేత పేరుతో రాష్ట్రంలో అన్నగారి భోజనశాలలు నిర్వహిస్తూ పేదల ఆకలి తీరుస్తున్నారు. జనతా వస్త్రాలనూ అందిస్తున్నారు.

Published : 05 Oct 2022 03:15 IST

విదేశీ విద్యకు రూ.40 లక్షల వడ్డీలేని రుణం

ప్రతి నెలా రెండు వైద్య శిబిరాలు

ఎన్టీఆర్‌ స్ఫూర్తిగా ప్రజలకు సేవలు

‘ఈనాడు’తో ప్రవాసాంధ్రుడు ఉయ్యూరు శ్రీనివాస్‌

ఈనాడు, అమరావతి: ఎన్టీఆర్‌కు వీరాభిమాని అయిన ఉయ్యూరు శ్రీనివాస్‌... ప్రజాసేవలోనూ ఆయన్నే స్ఫూర్తిగా తీసుకున్నారు. తన అభిమాన నేత పేరుతో రాష్ట్రంలో అన్నగారి భోజనశాలలు నిర్వహిస్తూ పేదల ఆకలి తీరుస్తున్నారు. జనతా వస్త్రాలనూ అందిస్తున్నారు. విదేశీ విద్యను అందుకోలేని పేద, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు 50 వేల డాలర్ల(రూ.40 లక్షలు) వడ్డీలేని రుణం అందిస్తున్నారు. గుంటూరు జిల్లా వేజెండ్లకు చెందిన శ్రీనివాస్‌ అమెరికాలో వ్యాపార రంగంలో స్థిరపడ్డారు. అక్కడే ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ ఏర్పాటుచేశారు. దానికి తన సొంత ఆదాయం నుంచి కోట్ల రూపాయలను కేటాయించారు. అసోసియేషన్‌ ద్వారా అందిస్తున్న సేవలను మంగళవారం ఆయన ‘ఈనాడు-ఈటీవీ’కి వివరించారు. ‘సమాజమే దేవాలయం... ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో ప్రజలకు కూడు, గూడు, గుడ్డ కల్పించేందుకు ఎన్టీఆర్‌ కృషి చేశారు. రాష్ట్రంలో, దేశంలో నేడు అమలవుతున్న వివిధ పథకాలలో చాలావరకు నాడు ఆయన ప్రవేశపెట్టిన పథకాల కొనసాగింపులే. వాటిలో కొన్ని కనుమరుగవుతున్న నేపథ్యంలో మళ్లీ ప్రజలకు గుర్తు చేయాలని నిర్ణయించాం’ అని పేర్కొన్నారు.

అమెరికాలోని విద్యార్థులకు అండగా వడ్డీలేని రుణం
‘ప్రతిభ కలిగిన ఎంతోమంది విద్యార్థులు విదేశీ చదువులకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా రైతు కుటుంబాలు, గ్రామీణ ప్రాంతాల వారికైతే పొలాల తాకట్టుపైనా రుణాలిచ్చేందుకు బ్యాంకులు నిరాకరిస్తున్నాయి. కొవిడ్‌ సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన వారికి ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. వీటన్నింటినీ చూశాకే... నాలో ఆలోచన మొదలైంది. అమెరికా వచ్చే విద్యార్థులకు ‘ఎన్టీఆర్‌ విద్య’ పేరుతో రూ.40 లక్షల వడ్డీ లేని రుణం ఇస్తున్నాం. ఈ ఏడాది 20 మందికి ఇచ్చాం. వచ్చే ఏడాది మరింత ఎక్కువ మందికి ఇస్తాం’ అని శ్రీనివాస్‌ వివరించారు. ‘బ్యాంకు రుణాలు పొందలేని విద్యార్థులకే ఈ సౌకర్యం కల్పిస్తాం. వారి వర్సిటీలకే నిధులను నేరుగా జమ చేస్తాం. ఉద్యోగంలో చేరాక అసలు మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది’ అని చెప్పారు.

ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టగలిగితే...
‘సేవా కార్యక్రమాలకు స్ఫూర్తి ఎన్టీఆర్‌... ఆయన ఆశయాల్లో మొదటిది పేదలకు కడుపు నిండా ఆహారం అందించడం. ఆయన స్ఫూర్తితో రాష్ట్రంలో ప్రారంభించిన అన్న క్యాంటీన్లు ఇప్పుడు లేవు. అందుకే అన్నగారి భోజనశాలలను ఏర్పాటు చేస్తున్నాం’ అని శ్రీనివాస్‌ వివరించారు. గుంటూరు ఆర్టీసీ బస్టాండ్‌, తర్వాత ప్రత్తిపాడు నియోజకవర్గ పరిధిలోని జేకేసీ కళాశాల వద్ద అందుబాటులోకి తెచ్చాం. హిందూపురంలో అన్నగారి భోజనశాలకు నిధులిస్తున్నాం. ఒక్కోచోట రోజుకు 500 మందికి ఆహారం అందిస్తున్నాం. హిందూపురంలో భోజనశాలను బాలకృష్ణ చేతుల మీదుగా ప్రారంభించాం. దీనికి ఊహించని స్పందన లభించింది. అందుకే కొనసాగించాలని నిర్ణయించాం’ అని వివరించారు.

పేదలకు అన్నగారి జనతావస్త్రాలు
‘అన్నగారి ఆశయాల్లో మరోటి పేదలకు వస్త్రాలు అందించడం.. ఇందులో భాగంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఈ నెల 7న 15 వేల మంది మహిళలకు చీరలను ఉచితంగా పంపిణీ చేయబోతున్నాం. భవిష్యత్తులో అవసరమైన అన్నిచోట్ల వస్త్రాలను అందిస్తాం’ అని ప్రకటించారు.


డిసెంబరులో మొబైల్‌ ఆసుపత్రి

‘ప్రతినెలా రెండు వైద్య శిబిరాలు నిర్వహిస్తాం. డిసెంబరులో మొబైల్‌ ఆసుపత్రి ప్రారంభించబోతున్నాం. ఒక్కో గ్రామానికి ఒక్కో రోజు చొప్పున వాహనం వెళుతుంది. ప్రజలకు వైద్య సేవలు అందిస్తుంది. రెండు అంబులెన్స్‌లను సైతం తెప్పిస్తున్నాం. డిసెంబరు నుంచి సేవలను మరింత మెరుగు పరుస్తాం’ అని ఆయన వెల్లడించారు. ‘ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ సంస్థకు ప్రస్తుతం నేనే సొంతంగా నిధులు సమకూరుస్తున్నా. నాలాంటి ఎంతోమంది ఇలా సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. భవిష్యత్తులో వారితో కలిసి నడుస్తాం’ అని శ్రీనివాస్‌ తెలిపారు. ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాల సందర్భంగా అమెరికాలో ప్రతి శుక్ర, శని, ఆదివారాల్లో ఎన్టీఆర్‌ సినిమాలను ప్రదర్శిస్తున్నామని వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని