కర్షక నినాదం.. గూడెం పరవశం

జైఅమరావతి నినాదాలతో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ప్రతిధ్వనించింది. అమరావతి నుంచి అరసవల్లి వరకు రైతులు చేపట్టిన మహాపాదయాత్ర 23వ రోజు మంగళవారం తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్నగూడెం నుంచి ప్రారంభమైంది.

Updated : 05 Oct 2022 05:18 IST

అమరావతి రైతుల పాదయాత్రతో తాడేపల్లిగూడెంలో భారీగా సందడి

గ్రామాల్లో అడుగడుగునా హారతులు

ఫ్లెక్సీలు, నల్లబెలూన్లతో వైకాపా కవ్వింపు చర్యలు

ఈనాడు డిజిటల్‌-ఏలూరు, న్యూస్‌టుడే-తాడేపల్లిగూడెం అర్బన్‌, పెంటపాడు: జైఅమరావతి నినాదాలతో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ప్రతిధ్వనించింది. అమరావతి నుంచి అరసవల్లి వరకు రైతులు చేపట్టిన మహాపాదయాత్ర 23వ రోజు మంగళవారం తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్నగూడెం నుంచి ప్రారంభమైంది. రామన్నగూడెం, పెదతాడేపల్లి మీదుగా తాడేపల్లిగూడెం పట్టణంలోని కేఎన్‌ రోడ్డు, హౌసింగ్‌బోర్డు నుంచి బస్టాండ్‌, తాలూకా కార్యాలయం, పోలీస్‌ ఐలాండ్‌ మీదుగా పెంటపాడుకు చేరింది. యాత్ర వెంకట్రామన్నగూడెం గ్రామంలోకి చేరుకోవడానికి ముందే పరిసర గ్రామాల ప్రజలు, రైతులు, కూలీలతో రహదారి కిక్కిరిసింది. ఆటోలు, ట్రాక్టర్లలో స్థానికులు తరలివచ్చి రైతులపై పూలవర్షం కురిపించారు. స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. యాత్ర తాడేపల్లిగూడెం వచ్చేసరికి కూడళ్లు జనసంద్రమయ్యాయి. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రామచంద్రాపురం, తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు, పెరవలి, జిల్లాలోని తణుకు తదితర ప్రాంతాలనుంచి రైతులు భారీగా తరలివచ్చారు. వెంకట్రామన్నగూడెంలో బలుసు లక్ష్మి అనే మహిళ తన 21రోజుల పసిబిడ్డతో వచ్చారు. రైతులతో కలిసి నడిచారు. భాజపా కిసాన్‌సంఘ్‌, జిల్లా రైతుసంఘం నాయకులు పాల్గొన్నారు.

వైకాపా కవ్వింపు చర్యలు 

మహాపాదయాత్రలో పాల్గొన్న రైతులను కవ్వించేందుకు వైకాపావారు అన్ని విధాలా ప్రయత్నించారు. పాదయాత్రను విమర్శిస్తూ వెంకట్రామన్నగూడెం నుంచి తాడేపల్లిగూడెం వరకు ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. వాటిపై ‘జగన్‌ది అభివృద్ధి మంత్రం- చంద్రబాబుది రాజకీయ కుతంత్రం, రాష్ట్రం కోసం జగన్‌ ఆరాటం.. 29 గ్రామాల కోసం నకిలీ పోరాటం’ తదితర నినాదాలున్నాయి. యాత్ర తాడేపల్లిగూడెం రాకముందే కొందరు వైకాపా కార్యకర్తలు ఎస్‌వీఆర్‌ కూడలిలో నల్లబెలూన్లు ఎగరవేస్తూ ఫేక్‌ యాత్రికులు గోబ్యాక్‌.. గోబ్యాక్‌ అంటూ నినదించారు. అన్నదాతలు ఎక్కడా సంయమనం కోల్పోలేదు.

కార్డులు చూపి ఖండించారు.. 

రాష్ట్ర భవిష్యత్తు కోసం పాదయాత్ర చేస్తున్న తమను ఫేక్‌ రైతులంటూ ఫ్లెక్సీలు ఏర్పాటుచేయడం అన్యాయమని రాజధాని రైతులు వాపోయారు. వైకాపావారు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీల వద్దకు చేరుకుని ఆధార్‌ కార్డులు, పాదయాత్రకు అనుమతిస్తూ ఇచ్చిన కార్డులను చూపించారు. తమ ఆధార్‌ కార్డుల్లోని వివరాలతో సరిచూసుకుంటే తాము ఫేక్‌ రైతులమో, నిజమైన రైతులమో తెలుస్తుందన్నారు. ‘ఫేక్‌ రైతులమైతే మేమిచ్చిన భూముల్లో ఉన్న సచివాలయంనుంచి ఎలా పాలిస్తారని ప్రశ్నించారు. ఫేక్‌ యాత్ర అయితే.. మీ సీఎం అధికారం కోసం చేసిన యాత్రను ఏమనాలి?’ అంటూ ధ్వజమెత్తారు. రైతుల పాదయాత్ర ఫేక్‌ అని విమర్శించడం కాదని, దమ్ముంటే నిరూపించాలని మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ సవాలు విసిరారు. తెదేపా పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి, జడ్పీ మాజీ ఛైర్మన్‌ ముళ్లపూడి బాపిరాజు, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌, తెదేపా తాడేపల్లిగూడెం ఇన్‌ఛార్జి బాబ్జీ, జనసేన ఇన్‌ఛార్జి బొలిశెట్టి శ్రీనివాస్‌, భాజపా నేతలు ఈతకోట తాతాజీ, సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


23వ రోజు యాత్ర ఇలా..

ప్రారంభం: పశ్చిమగోదావరి జిల్లా వెంకట్రామన్నగూడెం
ముగింపు: పెంటపాడు
నడిచిన దూరం: 15 కి.మీ.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని