మేం అడిగిన ధరకు ఇవ్వాల్సిందే!

‘రెండున్నర నెలల్లో 30 లక్షల సర్వే రాళ్లు సరఫరా చేసితీరాల్సిందే. వాటికి మేం ఇచ్చే ధరే తీసుకోవాలి. గిట్టుబాటు కాదంటే కుదరదు.

Published : 05 Oct 2022 03:15 IST

30 లక్షల సర్వే రాళ్ల సరఫరాకు ఒత్తిళ్లు

ఒక్కో రాయికి రూ.295 ఇస్తామంటున్న గనులశాఖ

గిట్టుబాటు కాదంటున్న గ్రానైట్‌ కటింగ్‌ యూనిట్ల యజమానులు

ఈనాడు-అమరావతి: ‘రెండున్నర నెలల్లో 30 లక్షల సర్వే రాళ్లు సరఫరా చేసితీరాల్సిందే. వాటికి మేం ఇచ్చే ధరే తీసుకోవాలి. గిట్టుబాటు కాదంటే కుదరదు. భూముల రీ సర్వే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. దీనికి రాళ్లు సిద్ధం చేసి ఇవ్వాల్సిందే...’ అంటూ గనులశాఖ అధికారులు.. వివిధ జిల్లాల్లోని గ్రానైట్‌ కటింగ్‌, పాలిషింగ్‌ యూనిట్లపై ఒత్తిళ్లు చేస్తున్నారు. గత కొద్దిరోజులుగా ప్రతి జిల్లాలో ఆయా యూనిట్ల యజమానులతో సమావేశాలు నిర్వహించి వారికి లక్ష్యాలు నిర్దేశిస్తున్నారు. ఇది గిట్టుబాటు కాదంటూ పలువురు యజమానులు గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వం చేపట్టిన భూముల రీ సర్వే ప్రాజెక్టుకు అవసరమైన రాళ్ల సరఫరా బాధ్యతను ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)కి అప్పగించారు. ప్రయోగాత్మకంగా తొలుత కొన్ని రాళ్లను తయారు చేయించి సరఫరా చేశారు. అనంతరం ప్రకాశం జిల్లా బల్లికురవ, చిత్తూరు, అనంతపురం, శ్రీకాకుళం, అనకాపల్లిలో ఏపీఎండీసీ ద్వారా సొంతంగా యూనిట్లు ఏర్పాట్లు చేసి, సర్వే రాళ్లు తయారు చేయాలని భావించారు. బల్లికురవలో మాత్రమే యూనిట్‌ సిద్ధమైంది. గడువు దగ్గర పడుతుండడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ప్రభుత్వం దృష్టి సారించింది.

కటింగ్‌ యూనిట్లకు లక్ష్యాలు
డిసెంబరు నాటికి 30 లక్షల రాళ్లు కావాలని సర్వే శాఖ కోరడంతో.. తాజాగా గ్రానైట్‌ కటింగ్‌ యూనిట్లపై గనుల శాఖ దృష్టి పెట్టింది. గతనెల 15న పలు జిల్లాలకు చెందిన ఆయా యూనిట్ల యజమానులతో గనులశాఖ మంత్రి సచివాలయంలో సమావేశం నిర్వహించి రాళ్లు సరఫరా చేయాలని కోరారు. ఎంత ధర ఇస్తారని ఆయా యూనిట్ల యజమానులు, అధికారులతో సంప్రదింపులు చేశారు. గ్రానైట్‌ క్వారీల డంప్‌ల్లో ఉండే వృథా రాళ్లను వినియోగించుకొని, కటింగ్‌, పాలిషింగ్‌ చేసి ఇస్తే రూ.295 ఇస్తామని అధికారులు తెలిపారు. ఇది గిట్టుబాటు కాదని యూనిట్ల యాజమాన్యాలు చెబుతున్నాయి. అయినప్పటికీ రాళ్లు సరఫరా చేయాలని ఒత్తిళ్లు చేస్తున్నారు.

తొలుత నిర్దేశించిన ధరను తగ్గించేసి...
మొదట్లో ప్రయోగాత్మకంగా కొన్ని సర్వే రాళ్లను సరఫరా చేసినందుకు.. ఒక్కో రాయికి రూ.1,160 చొప్పున చెల్లించారు. ఆ తర్వాత రాయికి రూ.470, లోడింగ్‌, అన్‌లోడింగ్‌కు రూ.25 చొప్పున మొత్తం రూ.495 ఇస్తామని ఏపీఎండీసీ నిర్ణయించింది. శ్రీకాకుళం, చీమకుర్తి, బల్లికురవ, చిత్తూరు, తాడిపత్రిలోని కొందరికి రాళ్లు సరఫరా చేసేలా ఆదేశించారు. వీరిలో పలువురు వేల సంఖ్యలో రాళ్లు సిద్ధం చేశాక.. ఏపీఎండీసీ తన నిర్ణయాన్ని మార్చుకుంది. రాయికి రూ.495 చొప్పున ఇవ్వలేమంటూ, వాళ్లకు ఇచ్చిన ఆర్డర్‌ను నిలిపేసింది. మళ్లీ ఆగస్టులో టెండర్లను పిలిచింది. ఇందులో కేవలం ముగ్గురు మాత్రమే బిడ్లు దాఖలు చేయగా ఒక్కో రాయికి రూ.600 వరకు ధర కోట్‌ చేశారు. ఆ టెండర్లను ఏపీఎండీసీ రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఒక్కో రాయికి రూ.295 మాత్రమే చెల్లిస్తామని గనుల శాఖ అధికారులు చెబుతున్నారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని