బస్సు ఛార్జీలు 2, 3 రెట్లెక్కువ

విజయవాడకు చెందిన చిరు వ్యాపారి నలుగురు కుటుంబసభ్యులతో కలిసి మొక్కు తీర్చుకునేందుకు తిరుపతికి ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్‌ బస్సులో వెళ్లివచ్చారు. ఇందుకు బస్సు టికెట్లకే రూ.4,752 ఖర్చయింది.

Updated : 05 Oct 2022 06:58 IST

రైళ్లతో పోల్చితే గతం కంటే భారీగా పెరిగిన వ్యత్యాసం

వరుసగా పెంచుతున్న బస్సు ఛార్జీలతో ప్రయాణికులపై భారం

విజయవాడకు చెందిన చిరు వ్యాపారి నలుగురు కుటుంబసభ్యులతో కలిసి మొక్కు తీర్చుకునేందుకు తిరుపతికి ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్‌ బస్సులో వెళ్లివచ్చారు. ఇందుకు బస్సు టికెట్లకే రూ.4,752 ఖర్చయింది. దీనికి బదులు ఎక్స్‌ప్రెస్‌ రైలులోని అన్‌రిజర్వ్డ్‌ జనరల్‌ కోచ్‌లో వెళ్తే రూ.1,080 మాత్రమే అయ్యేదని ఆ తర్వాత బోధపడింది. అంటే రైలు కంటే ఎక్స్‌ప్రెస్‌ బస్సు టికెట్‌ ధర మూడు రెట్లు అధికంగా ఉంది.

ఈనాడు, అమరావతి: తరచూ ఆర్టీసీ ఛార్జీలు పెంచుతూ పోవడం వల్ల బస్సు ఛార్జీలు తడిసిమోపెడవుతున్నాయి. ఇవి సామాన్య, మధ్యతరగతికి ఆర్థిక భారంగా మారుతున్నాయి. తొలిసారి ఏప్రిల్‌లో ఛార్జీలు పెంచినప్పుడు పల్లెవెలుగు, సిటీ బస్సు ప్రయాణికులపై భారంపడింది. ఆ తర్వాత 3 నెలలకు దూర ప్రాంత సర్వీసులన్నింటికీ ఛార్జీలు పెంచారు. సూపర్‌ లగ్జరీల్లో గరిష్ఠంగా రూ.140 వరకు భారం మోపారు. ఏసీ సర్వీసుల్లోనూ దూరం పెరిగే కొద్దీ ఛార్జీలు పెరిగాయి. వీటితో పోలిస్తే రైలు ఛార్జీలు రెండు, మూడు రెట్లు తక్కువగా ఉంటున్నాయి. రైలు ఛార్జీలు చాలా కాలంగా స్థిరంగా, తక్కువగా ఉండటమే ఇందుకు కారణం. ముఖ్యంగా దూర ప్రాంతాలకు వెళ్లాలనుకునే వారు ముందుగా ప్రణాళిక ప్రకారం రైలు స్లీపర్‌ క్లాస్‌లో రిజర్వేషన్‌ చేసుకుంటే రవాణా ఖర్చులు తగ్గించుకోవచ్చు. ఇదీ.. భారంగా భావించే వాళ్లు జనరల్‌ బోగీల్లో వెళ్తే ఖర్చు చాలా వరకు తగ్గుతాయని ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు.

దూరం బహుభారం!
దూర ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ సూపర్‌ లగ్జరీ, ఏసీ సర్వీసుల్లో ఛార్జీలు భారీగా పెరిగాయి. విజయవాడ నుంచి శ్రీకాకుళానికి ఆర్టీసీ సూపర్‌లగ్జరీలో ప్రయాణిస్తే రూ.891 అవుతోంది. అదే విజయవాడ నుంచి శ్రీకాకుళం రోడ్‌ రైల్వే స్టేషన్‌ వరకు వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో స్లీపర్‌ క్లాస్‌ టిక్కెట్‌ ధర రూ.315 మాత్రమే. ఈ లెక్కన రైలు కంటే బస్సు ఛార్జీ దాదాపు రెండొంతులు అదనంగా ఉంది.

* ఆర్టీసీ సూపర్‌ లగ్జరీ ఛార్జీలు పెట్టలేని వారు కనీసం ఎక్స్‌ప్రెస్‌ బస్సులో వెళ్లాలనుకున్నా.. మోత తప్పడం లేదు. జనరల్‌ కోచ్‌ల్లో ఛార్జీలతో పోలిస్తే ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్‌ సర్వీసుల్లోనూ భారీ వ్యత్యాసం ఉంటోంది. ఎక్స్‌ప్రెస్‌ బస్సులో నెల్లూరు నుంచి విజయవాడకు రూ.407 టికెటు ధర ఉంటే, రైలులోని మెయిల్‌, ఎక్స్‌ప్రెస్‌ సర్వీసుల్లోని జనరల్‌ కోచ్‌లో ఛార్జీ కేవలం రూ.95 మాత్రమే. విజయవాడ నుంచి రాజమహేంద్రవరానికి రైలులో జనరల్‌ బోగీలో ప్రయాణించేందుకు రూ.65 అయితే.. ఎక్స్‌ప్రెస్‌ బస్సులో రూ.250 అవుతోంది.


అనంతపురానికి చెందిన ఓ చిరుద్యోగి విజయవాడలోని ప్రైవేటు సంస్థలో పని చేస్తూ, అక్కడే ఉంటున్నారు. నలుగురు సభ్యులతో ఆర్టీసీ సూపర్‌ లగ్జరీ సర్వీసులో ఒకసారి అనంతపురం వెళ్లి, రావాలంటే టికెట్ల ఖర్చు రూ.7,032 అవుతోంది. అదే రైలులో స్లీపర్‌క్లాస్‌లో రిజర్వేషన్‌ చేసుకుంటే రూ.2,520తో వెళ్లి, వచ్చేందుకు వీలుంది.

- రాష్ట్రంలో వరుసగా పెంచిన ఆర్టీసీ ఛార్జీలు ప్రయాణికుల జేబులను ఎలా ఖాళీ చేస్తున్నాయో చెప్పే నిదర్శనాలివి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని