ఎన్నికల్లో పోటీ చేయడం చట్టబద్ధమైన హక్కే

ఎన్నికల్లో నామినేషన్‌ తిరస్కరణపై హైకోర్టులో వేసిన వ్యాజ్యానికి విచారణ అర్హత లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల్లో పోటీ చేయడం చట్టబద్ధ హక్కు మాత్రమేనని, ప్రాథమిక హక్కు కిందికి రాదని పేర్కొంది.

Updated : 05 Oct 2022 05:08 IST

ప్రాథమిక హక్కు కిందకు రాదు

స్పష్టం చేసిన హైకోర్టు

ఈనాడు, అమరావతి: ఎన్నికల్లో నామినేషన్‌ తిరస్కరణపై హైకోర్టులో వేసిన వ్యాజ్యానికి విచారణ అర్హత లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల్లో పోటీ చేయడం చట్టబద్ధ హక్కు మాత్రమేనని, ప్రాథమిక హక్కు కిందికి రాదని పేర్కొంది. ప్రస్తుత వ్యవహారంలో ఏపీ సొసైటీల రిజిస్ట్రేషన్‌ చట్ట నిబంధనలను అనుసరించి జిల్లా కోర్టులో వ్యాజ్యం దాఖలు చేసుకోవాలని పిటిషనర్‌కు సూచించింది. ఈ వ్యాజ్యాన్ని గరిష్ఠంగా 6నెలల్లో పరిష్కరించాలని జిల్లా కోర్టును ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సీహెచ్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌ ఇటీవల ఈ మేరకు తీర్పునిచ్చారు. ఏపీ సచివాలయ సెక్షన్‌ అధికారుల సంఘం ఎన్నికల విషయంలో తన నామినేషన్‌ను తిరస్కరించడాన్ని సవాలుచేస్తూ రెవెన్యూ శాఖలో సెక్షన్‌ అధికారిగా పనిచేస్తున్న వాసుదేవరావు హైకోర్టులో వ్యాజ్యం వేశారు. నామినేషన్‌ తిరస్కరించడం ద్వారా పిటిషనర్‌ ప్రాథమిక హక్కును హరించారని, వ్యాజ్యానికి విచారణ అర్హత ఉందని ఆయన తరఫు న్యాయవాది సింగయ్యగౌడ్‌ పేర్కొన్నారు. నామినేషన్‌ తిరస్కరణపై అభ్యంతరం ఉంటే జిల్లా కోర్టులో ఎన్నికల పిటిషన్‌ వేసుకోవాలని ప్రభుత్వ న్యాయవాది మహేశ్వరరెడ్డి వాదించారు. వివరాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. పై విధంగా తీర్పునిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని