కుయ్‌.. కుయ్‌ వాహనాల మొర్రో!

శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరానికి కేటాయించిన ఈ 108 వాహనం 6 లక్షల కి.మీ.కు పైగా తిరిగింది. ఇటీవల ఉన్నట్టుండి ఆగిపోవడంతో మరమ్మతు కోసం రాప్తాడు సమీపంలోని ఓ షెడ్డుకు తరలించారు.

Updated : 05 Oct 2022 05:07 IST

కాలం చెల్లిన అంబులెన్సులతో సేవలపై ప్రభావం

కొత్తవి రాక 108 సిబ్బందికీ కష్టాలు

భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు!


శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరానికి కేటాయించిన ఈ 108 వాహనం 6 లక్షల కి.మీ.కు పైగా తిరిగింది. ఇటీవల ఉన్నట్టుండి ఆగిపోవడంతో మరమ్మతు కోసం రాప్తాడు సమీపంలోని ఓ షెడ్డుకు తరలించారు. ధర్మవరానికి తాత్కాలికంగా పంపిన మరో 108 వాహనం 3 లక్షల కి.మీకు పైగా తిరిగింది కావడం గమనార్హం. 


ఈనాడు, అమరావతి: ఆపత్కాలంలో సంజీవని వాహనంగా ఆదుకోవాల్సిన 108 వాహనాలు తరచూ మొరాయిస్తున్నాయి. పాతబడటం, నిర్వహణాలోపం, మరమ్మతుల్లో జాప్యం సమస్యలుగా పరిణమించాయి. రాష్ట్రంలో నియోనాటల్‌ కింద కేటాయించిన 26తో కలిపి మొత్తం 748 అంబులెన్సులున్నాయి. వీటిలో 4 వాహనాలు 5 లక్షల కి.మీకు పైగా ప్రయాణించగా, 4 లక్షల కి.మీకు పైగా తిరిగినవి 36, మూడు లక్షల కి.మీ తిరిగినవి 134 ఉన్నాయి. మరో 227 వాహనాలు 2-3 లక్షల కి.మీల మధ్య ప్రయాణించాయి. సాధారణంగా 2.5 లక్షల కి.మీ ప్రయాణం లేదా 15 ఏళ్లు దాటిన అంబులెన్సులను పక్కనపెట్టాల్సి ఉండగా, ఇప్పటికీ వినియోగిస్తున్నారు. జిల్లాకు ఒకట్రెండు మాత్రమే బ్యాక్‌అప్‌ కింద అందుబాటులో ఉన్నాయి. ఒకేసారి మూణ్నాలుగు వాహనాలు మొరాయిస్తే, అక్కడికి ప్రత్యామ్నాయంగా పంపడం ఇబ్బందిగా మారింది.


డోన్‌ మండలానికి చెందిన ఈ అంబులెన్సు ఐదేళ్లుగా 5.16లక్షల కి.మీ ప్రయాణించింది. నెల రోజుల కిందట దెబ్బతింది. ఇది మొరాయిస్తే, ప్రత్యామ్నాయంగా మరో అంబులెన్సు రావాలంటే సమయం పడుతోంది.


అసలే గతుకుల దారులు
70వేల కి.మీ తిరిగిన అంబులెన్సుల టైర్లు మార్చాలన్నది నిబంధన. రాష్ట్రంలో రోడ్లు బాగా దెబ్బతిన్నందున 40-50 వేల కి.మీలకే టైర్లు మార్చాల్సి వస్తోంది. కొన్ని బేసిక్‌ లైఫ్‌ సపోర్టు వాహనాల సామర్థ్యం సరిగ్గా లేదు. నిర్వహణ ఖర్చుల కింద ప్రభుత్వం కొత్త వాహనాలకు నెలకు రూ.1.75 లక్షలు, పాత వాటికి రూ.2.21 లక్షలు చెల్లిస్తుండగా, ఈ మొత్తం సరిపోవడం లేదని నిర్వాహకులు చెబుతున్నారు. మరమ్మతులకు కావాల్సిన విడిభాగాలు దొరక్కపోవడం, మెకానిక్‌ల కొరత కూడా సమస్యగా మారింది. 108 అంబులెన్స్‌లకు రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ.15 కోట్లు వెచ్చిస్తోంది. నిబంధనల ప్రకారం పట్టణాలు, నగరాలు, మండల ప్రాంతాల్లోని అంబులెన్సులు రోజుకి 3.9 కేసుల చొప్పున నెలకు 120 కేసులకు తిరగాలి. నగరాలు, పట్టణాల్లో ఈ లక్ష్యాన్ని చేరుకుంటున్నా, మండలాలు, గిరిజన ప్రాంతాల్లో అన్ని కేసులకు వెళ్లలేకపోతున్నారు. హాజరుకాని కేసుల సంఖ్యకు తగ్గట్లు ప్రభుత్వం జరిమానా వేస్తుండటంతో నిర్దేశించిన మండల కేంద్రాల్లో కాకుండా ఇతర ప్రాంతాల్లో పర్యవేక్షకుల ఆదేశాలు అనుసరించి తిప్పుతున్నామని పలువురు డ్రైవర్లు చెబుతున్నారు. ఒకేసారి, ఒకే మార్గంలో గర్భిణులు, క్షతగాత్రులను తరలిస్తే.. వేర్వేరు కేసులుగా చూపిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. 164 వాహనాలకు ట్రాకింగ్‌ లేకపోవడాన్ని అధికారులు గుర్తించారు. లోతుగా పరిశీలిస్తే లోపాలు తెలుస్తాయని పేర్కొంటున్నారు. రోగులను రెఫరల్‌ ఆస్పత్రులకు తీసుకెళ్లడం, దూరంగా ఉన్న మండల కేంద్రాలకు తరలించడం వల్ల ఎక్కువ సమయం పడుతోందని, అదే సమయంలో అత్యవసర కేసులు వస్తే అందుబాటులో ఉండలేకపోతున్నట్లు సిబ్బంది చెబుతున్నారు. పాత అంబులెన్సుల స్థానంలో కొత్తవి సమకూర్చడం, నెలకు 120 కేసుల తప్పనిసరి హాజరు నిబంధనను సడలించడంపై ప్రభుత్వానికి విన్నవించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts