ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతి మూడో శుక్రవారం స.హ. దినం

నెలలో ప్రతి మూడో శుక్రవారం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచార హక్కు దినం (ఆర్టీఐ డే)గా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని ఆర్టీఐ రాష్ట్ర చీఫ్‌ కమిషనర్‌ ఆర్‌.శ్రీనివాసరావు తెలిపారు.

Published : 07 Oct 2022 02:45 IST

ఆర్టీఐ చీఫ్‌ కమిషనర్‌ శ్రీనివాసరావు

ఈనాడు, అమరావతి: నెలలో ప్రతి మూడో శుక్రవారం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచార హక్కు దినం (ఆర్టీఐ డే)గా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని ఆర్టీఐ రాష్ట్ర చీఫ్‌ కమిషనర్‌ ఆర్‌.శ్రీనివాసరావు తెలిపారు. నెలలో వచ్చిన ఆర్టీఐ దరఖాస్తులు, ఫిర్యాదులను ఆ రోజున పరిష్కరించేలా క్షేత్రస్థాయిలో అధికారులు చర్యలు తీసుకోనున్నారని ఆయన చెప్పారు. ఈనెల 5న ప్రారంభమైన ఆర్టీఐ వారోత్సవాల్లో భాగంగా గురువారం కమిషనర్లు కె.చెన్నారెడ్డి, కె.జనార్దనరావుతో కలిసి చీఫ్‌ కమిషనర్‌ శ్రీనివాసరావు విలేకరులతో మాట్లాడారు. ‘ఆర్టీఐ ఫిర్యాదుల పరిష్కారం కోసం కమిషనర్లు తమకు కేటాయించిన జిల్లాలకు వెళ్లేలా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశాం. కొన్ని ఫిర్యాదులపై విచారణ కోసం జిల్లా అధికారులు చీఫ్‌ కమిషనర్‌ కార్యాలయానికి ప్రత్యక్షంగా హాజరవుతున్నారు. దీనివల్ల ఎదురవుతున్న ఇబ్బందుల దృష్ట్యా కమిషనర్లే జిల్లాలకు వెళ్లాలని నిర్ణయించాం. ఈ విధానంతో జిల్లా స్థాయిలోనే చాలా ఫిర్యాదులు పరిష్కారమవుతాయి. సమాచార హక్కు చట్టంపై గ్రామీణ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఎంపిక చేసిన 25-30 గ్రామాల్లో ఈనెల 12లోగా న్యాయ కళాశాలల విద్యార్థులతో అవగాహన కల్పించనున్నాం. 2019 మే నుంచి 2022 ఆగస్టు వరకు వచ్చిన 23,618 అప్పీళ్లు, ఫిర్యాదుల్లో 21,211 వరకు పరిష్కరించాం. కొత్తగా మరో ఇద్దరు కమిషనర్లు రాబోతున్నందున ఏ నెలలో వచ్చిన ఫిర్యాదులు, అప్పీళ్లు అదే నెలలో పరిష్కరించే విషయాన్ని పరిశీలిస్తున్నాం. ఆన్‌లైన్‌లోనూ ప్రజల నుంచి అప్పీళ్లు, ఫిర్యాదులు స్వీకరించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ఆర్టీఐ విషయంలో సకాలంలో సమాచారం ఇవ్వకపోయినా, నిర్లక్ష్యంగా వ్యవహరించినా అలాంటి అధికారులపై చర్యలకు సిఫార్సు చేస్తున్నాం. 20 మంది అధికారులపై జరిమానా కూడా విధించాం. మూడేళ్ల న్యాయ విద్యలో సమాచార హక్కు చట్టం ఒక సబ్జెక్ట్‌గా చేర్చాలని గవర్నర్‌కి ప్రతిపాదించాం’ అని చీఫ్‌ కమిషనర్‌ శ్రీనివాసరావు అన్నారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని