రిజిస్ట్రేషన్ల మెరుగుదలకు ఐఏఎస్‌ల కమిటీ

దస్తావేజుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో పారదర్శకత, సులభతర విధానాలపై అధ్యయనం కోసం ఐఏఎస్‌ అధికారులతో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటుచేయాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు.

Updated : 07 Oct 2022 06:05 IST

నాటుసారా తయారీదారులకు ప్రత్యామ్నాయ జీవనోపాధి
రవాణా శాఖలో ఆదాయం పెంపునకు చర్యలు తీసుకోవాలి
ప్రభుత్వ ఆదాయ శాఖల పనితీరుపై సీఎం జగన్‌ సమీక్ష

ఈనాడు, అమరావతి: దస్తావేజుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో పారదర్శకత, సులభతర విధానాలపై అధ్యయనం కోసం ఐఏఎస్‌ అధికారులతో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటుచేయాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. నాటుసారా తయారీ వృత్తిలో ఉన్నవారికి ప్రత్యామ్నాయ జీవనోపాధి చూపించాలన్నారు. రవాణాశాఖలో ఆదాయం పెంపునకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఆదాయాలను సమకూర్చే ప్రభుత్వ శాఖల పనితీరును సీఎం జగన్‌ గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీఎస్టీ వసూళ్లు పకడ్బందీగా జరిగేలా చూడాలన్నారు. లీకేజీల నిరోధానికి ప్రముఖ సంస్థల నుంచి సాయం తీసుకోవాలని, పన్ను చెల్లింపుదారులకు సులభతర, పారదర్శకత విధానాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ‘బెల్టుషాపుల నిర్వహణ, అక్రమ మద్యం ఘటనలపై నివేదికలు తెప్పించి, తదనుగుణంగా చర్యలు తీసుకోవాలి. గ్రామాల్లో మహిళా పోలీసుల నుంచి రోజూ నివేదికలు తెప్పించాలి. నాటుసారా తయారీదారులకు ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పనకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేయాలి. రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయం పొందే మార్గాలపై పరిశీలనకు ఐఏఎస్‌లు కృష్ణబాబు, రజత్‌భార్గవ, నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌, గుల్జార్‌లతో ప్రత్యేక కమిటీ ఏర్పాటుచేయాలి. ఈ కమిటీ రెండు వారాల్లోగా నివేదిక సమర్పించాలి. రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ప్రయోజనాలపై ప్రజల్లో అవగాహన పెంచాలి. నాన్‌-రిజిస్ట్రేషన్‌ విధానాలు పూర్తిగా తొలగిపోవాలి. ఆస్తుల విలువ మదింపులో మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడి పరిస్థితులను పరిశీలించాలి. గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల విధానంపై ప్రజలకు అవగాహన కల్పించాలి. మైనింగ్‌ కోసం లీజు లైసెన్సులు పొందినవారే ఆ కార్యకలాపాలు కొనసాగించాలి. ఒకవేళ చేయకుంటే అందుకు కారణాలు, పరిష్కార మార్గాలపై దృష్టిపెట్టాలి. ప్రతినెలా సమీక్షించి, ఆదాయం పెరుగుతూ ఉండేలా చూడాలి. రవాణాశాఖలో పన్ను పెంచడమే పరిష్కారం కాదు. వినూత్న ఆలోచనలు చేయాలి. ఇతర రాష్ట్రాల కంటే సానుకూల పరిస్థితులను సృష్టించడం ద్వారా ఆదాయం పెంచుకునేలా చర్యలు తీసుకోవాలి’ అని సీఎం జగన్‌ సూచించారు.

లక్ష్యంలో 94.47% సాధించాం: ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబరు వరకూ జీఎస్టీ, ఇతర శాఖల ఆదాయ లక్ష్యం రూ.27,445 కోట్లు కాగా ఇప్పటివరకూ రూ.25,928 కోట్లు (94.47%) సాధించినట్లు అధికారులు సీఎంకు వివరించారు. ‘జీఎస్టీ వసూళ్లు దేశవ్యాప్తంగా 27.8% ఉండగా రాష్ట్రంలో 28.79%. పన్ను ఎగవేతదారుల నిరోధానికి హెచ్‌ఓడీ కార్యాలయంలో డేటా ఎనలిటిక్స్‌ సెంటర్‌ ఏర్పాటుచేశాం. గనులు, ఖనిజాల నుంచి గతేడాది సెప్టెంబరు నాటికి రూ.1,174 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది ఇదే సమయానికి రూ.1,400 కోట్లు వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి 43% పెరుగుతుందని అంచనా వేస్తున్నాం’ అని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని