ముంచెత్తిన వాన

రాష్ట్రంలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పత్తి, మిర్చి, వరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. జొన్న, పెసర, మినుము, కూరగాయల పొలాల్లో నీరు నిలిచి మొక్కలు ఉరకెత్తుతున్నాయి.

Updated : 07 Oct 2022 06:52 IST

రోడ్లు తెగిపోయి జనజీవనం అస్తవ్యస్తం
ప్రకాశంలో పిడుగుపాటుకు ఇద్దరి మృతి
వివిధ జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం
పత్తి, మిర్చి, కూరగాయ, మెట్ట పంటలకు తీవ్ర నష్టం
వరికి ముంపు

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పత్తి, మిర్చి, వరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. జొన్న, పెసర, మినుము, కూరగాయల పొలాల్లో నీరు నిలిచి మొక్కలు ఉరకెత్తుతున్నాయి. వివిధ జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు ఉప్పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. విజయవాడలో వరద నీరు రోడ్లపైకి వచ్చింది. ప్రకాశం జిల్లా దర్శి, కురిచేడులో బుధవారం పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందారు. వైయస్‌ఆర్‌ జిల్లాలో ముద్దనూరు-జమ్మలమడుగు రహదారి కొట్టుకుపోయి 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రకాశం, పల్నాడు, గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల్లో ప్రస్తుతం పూత దశలో ఉన్న పత్తి తీవ్రంగా దెబ్బ తిన్నది.

ఈ పంటపై రైతులు భారీగా పెట్టుబడి పెట్టారు. మొదటి దశ పత్తి వస్తుందని ఆశిస్తున్న తరుణంలో వర్షాలు వారికి భారీ నష్టాన్ని మిగిల్చాయి. మిర్చి మొక్కలను ఇప్పుడిప్పుడే నాటుతున్నారు. ఈ సమయంలో నీరు నిలవడంతో మొక్కలు ఎర్రబారుతున్నాయి. ఎన్టీఆర్‌ జిల్లాలో నాటేందుకు ఒక్కో మిర్చి మొక్క రూ.1.50 నుంచి రూ.3 చొప్పున కొనుగోలు చేశారు. ఉభయగోదావరి జిల్లాల్లో ఇటీవల గోదావరికి వచ్చిన వరదల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోగా... ఇప్పుడు భారీ వర్షాలతో కూరగాయలు, కంద ఇతర మెట్ట పంటలకు మరోసారి నష్టం వాటిల్లింది. శ్రీకాకుళంలో జిల్లాలో కొన్నిచోట్ల వరి నీట మునిగింది. రాయలసీమలో మొక్కజొన్న, జొన్న, పెసర, మినుము, కూరగాయల పంటలపై ప్రభావం పడింది. అనంతపురం జిల్లాల్లో ద్రాక్ష తోటలు నేలకొరిగాయి. ఎగువ నుంచి 79,350 క్యూసెక్కుల వరద నీరు వస్తుండడంతో ప్రకాశం బ్యారేజీ నుంచి 72,300 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి, కృష్ణా డెల్టాలోని కుడి, ఎడమ కాల్వలకు 7,050 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.

తీవ్ర ఆందోళనలో అన్నదాతలు

ఉమ్మడి గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు, తాడికొండ, తుళ్లూరు, తాడేపల్లి తదితర మండలాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలు కలిపి 380 ఎకరాల్లో నీటమునిగాయి. తాడికొండ, తాడేపల్లి మండలాల్లో వరి, పసుపు, అరటి పంటలకు... వట్టిచెరుకూరు, ప్రత్తిపాడు మండలాల్లో అధికంగా పత్తి, మిరప పంటలకు నష్టం వాటిల్లింది.

ఎన్టీఆర్‌ జిల్లాలో నందిగామ, తిరువూరు, జగ్గయ్యపేట, మైలవరం నియోజకవర్గాల్లో ప్రస్తుతం పత్తి పూత, పిందే దశలో ఉంది. వర్షాలకు పూత రాలిపోతోంది.  

ప్రకాశం జిల్లాలోని కనిగిరి, గిద్దలూరు, మార్కాపురం, ఒంగోలు, కొండపి, ఎస్‌ఎన్‌పాడు, దర్శి నియోజకవర్గాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దర్శి, కురిచేడు మండలాల్లో ఇద్దరు వ్యక్తులు పిడుగుపాటుకు మృతి చెందారు.  
అనంతపురం నగరంలోని నడిమివంకకు వరద పోటెత్తింది. రాప్తాడు మండలం గొందిరెడ్డిపల్లి, ప్రసన్నాయపల్లిలో ద్రాక్ష పంట నేలకొరిగింది. వైయస్‌ఆర్‌ జిల్లా చెన్నూరు, ఖాజీపేట, కమలాపురం, మైదుకూరు మండలాల్లో పంటలు నేలకొరిగాయి. వరికి తీవ్ర కష్టం కలిగింది. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం పెన్నాడ, పాలకొల్లు, ఆచంట తదితర నియోజకవర్గాల్లో తోట పంటల్లో వర్షపు నీరు నిలిచింది. శ్రీకాకుళం జిల్లా సోంపేటలో వరదతో దాదాపు 1000 ఎకరాల వరి పంట నీట మునిగింది. విజయవాడలో గురువారం ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరద నీరంతా రోడ్లపైకి చేరడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గొల్లపూడి సెంటర్‌ నుంచి బస్టాండ్‌ వరకు ప్రయాణానికి సుమారు రెండు గంటల సమయం పట్టింది. ఎన్టీఆర్‌ జిల్లాలోని కట్టలేరు వాగు ఉప్పొగడంతో కొలిజర్ల-గంపలగూడెం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నందిగామ మండలం అనాసాగరం వద్ద వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. విశాఖలోని రామకృష్ణపురం ప్రాంతం ముంపునకు గురైంది. కేంద్ర కారాగార పరిసరాలలోని వరద నీరు ఇళ్లల్లోకి చేరడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపారు. వైయస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరు, గోపవరంలో లోతట్టు ప్రాంతాలు నీట మునిగి, ఇళ్లలోకి నీరు చేరింది. పెన్నా, పాపాఘ్ని నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఒంగోలులో పోతురాజు కాల్వ ఉప్పొంగడంతో సమీపంలోని నెహ్రూనగర్‌, ప్రకాష్‌నగర్‌ కాలనీల్లోకి వర్షపు నీరు చేరింది. అనంతపురంలోని నడిమివంక, రజకనగర్‌లకు వరద పోటెత్తడడంతో సమీప ప్రాంతాలు నీట మునిగాయి.


నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు

ఈనాడు, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా శుక్ర, శని వారాల్లో అనేకచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు స్టెల్లా ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts