వైద్య నారాయణుల సేవాపారాయణం

వైద్య విద్యలో తమకు ఓనమాలు నేర్పించి డాక్టర్లుగా ఉన్నత స్థానానికి ఎదగడానికి తోడ్పడిన కళాశాలకు పూర్వవిద్యార్థులంతా కలిసి గొప్ప కానుక ఇవ్వడానికి ముందుకొచ్చారు.

Updated : 07 Oct 2022 06:01 IST

గుంటూరు వైద్యకళాశాల పూర్వ విద్యార్థుల భూరి విరాళం  
రూ. 86.80 కోట్లతో భవన నిర్మాణం  
డా।।ఉమా గవిని వితరణ రూ. 22 కోట్లు  
నిర్మాణానికి నేడు మంత్రి భూమిపూజ  

ఈనాడు, అమరావతి- గుంటూరు వైద్యం, న్యూస్‌టుడే: వైద్య విద్యలో తమకు ఓనమాలు నేర్పించి డాక్టర్లుగా ఉన్నత స్థానానికి ఎదగడానికి తోడ్పడిన కళాశాలకు పూర్వవిద్యార్థులంతా కలిసి గొప్ప కానుక ఇవ్వడానికి ముందుకొచ్చారు. రోగులకు మెరుగైన వైద్యసేవలు అందాలనే ఉద్దేశంతో ఉదారంగా రూ. 86.80 కోట్లను విరాళంగా ప్రకటించారు. ఇందులో ఒక్కరి వితరణే రూ. 22 కోట్లు ఉండడం విశేషం. ఈ సొమ్ముతో గుంటూరు సర్వజనాసుపత్రి (జీజీహెచ్‌)లో మాతాశిశు సంరక్షణ కేంద్రం పనులు పునఃప్రారంభానికి ఏర్పాట్లు మొదలయ్యాయి. మొత్తం 2,69,245 చదరపు అడుగుల విస్తీర్ణంలో జి+5 అంతస్తుల భవనాన్ని నిర్మించాలని ప్రతిపాదించారు. 597 పడకలు వచ్చేలా రూపకల్పన చేశారు. ఇందుకయ్యే ఖర్చు రూ. 86.80 కోట్లను గుంటూరు వైద్య కళాశాలలో చదివి ఉత్తర అమెరికాలో స్థిరపడిన వైద్యుల సంఘం (జింకానా) భరించేందుకు ముందుకు రావడంతో ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ‘జింకానా’ పూర్వ అధ్యక్షురాలు డాక్టర్‌ గవిని ఉమాదేవి ఒక్కరే తన భర్త డాక్టర్‌ కానూరి రామచంద్రరావు పేరిట రూ. 22 కోట్ల విరాళం ప్రకటించారు. దీంతో ఆ భవనానికి డాక్టర్‌ కానూరి రామచంద్రరావు-జింకాన-మాతా శిశు సంరక్షణ కేంద్రం అని పేరు పెట్టాలని నిర్ణయించారు. దివంగత డాక్టర్‌ కానూరి రామచంద్రరావు సోదరుడు కృష్ణమోహన్‌ దంపతులు బుధవారం పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జింకాన స్థానిక సమన్వయకర్తలు వెనిగళ్ల బాలభాస్కరరావు, హనుమంతరావు, సూపరింటెండెంట్‌ ప్రభావతి, పూర్వ సూపరింటెండెంట్లు ఫణిభూషణ్‌, రాజునాయుడు, గైనిక్‌ విభాగం పూర్వ అధిపతులు చంద్రశేఖర్‌, వెంకటేశ్వరరావు, నాట్కో ఫార్మా ఉపాధ్యక్షుడు నన్నపనేని సదాశివరావు తదితరులు పాల్గొన్నారు.

నేడు అధికారికంగా..

ప్రభుత్వం శుక్రవారం అధికారికంగా భూమి పూజ నిర్వహించనుంది. వైద్యమంత్రి విడదల రజినితో పాటు ఉమ్మడి గుంటూరుకు చెందిన ముగ్గురు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులను ఆహ్వానించారు. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మించేలా 2019లోనే ప్రణాళిక వేసినా అది కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం నిర్మాణ ఖర్చు మొత్తాన్ని జింకాన భరించటానికి ముందుకు రావడంతో ప్రభుత్వం జూన్‌ 10న ప్రత్యేక జీవో జారీ చేసింది. వార్డులకు ఇతర దాతల పేర్లు పెడతామని బిల్డింగ్‌ కమిటీ ఛైర్మన్‌ బాబురెడ్డి సాగిరెడ్డి తెలిపారు.


పేదలకు మెరుగైన వైద్యసేవలే లక్ష్యం
-డాక్టర్‌ వి.బాలభాస్కరరావు, జింకాన ప్రతినిధి, గుంటూరు

‘‘వైద్యవిద్యలో ఓనమాలు నేర్పిన గుంటూరు మెడికల్‌ కళాశాలను తల్లిగా.. ప్రాక్టీస్‌ చేయటానికి అవకాశం కల్పించిన ఆస్పత్రిని (జీజీహెచ్‌) తండ్రిగా ‘జింకానా’ భావిస్తుంది. తల్లిదండ్రులకు కృతజ్ఞతపూర్వకంగా కొంత వెచ్చించినట్లే ఈ రెండింటి అభివృద్ధికి కొన్నేళ్లుగా పూర్వ విద్యార్థులు తమ సంపాదనలో తిరిగి కొంత మొత్తాన్ని ఇస్తున్నారు. గుంటూరు మెడికల్‌ కళాశాల ఓల్డ్‌ స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ (జింపోజ్‌) కూడా కొంత ఆర్థిక సాయం చేయనుంది. రోగులకు మెరుగైన వైద్యసేవలు అందాలనేది మా అందరి లక్ష్యం.’’

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని