సౌకర్యాలు కల్పించకుంటే పన్నులు చెల్లించం

మురుగుకాల్వలు, రోడ్లు లేని తమ ప్రాంతంలో జ్వరాలు ప్రబలి అల్లాడుతున్నామని,  సౌకర్యాలు కల్పించేవరకూ తాము పురపాలక సంఘానికి పన్నులు చెల్లించేది లేదని తెగేసి చెప్పారు గుంటూరు జిల్లా, పొన్నూరు పట్టణం 29వ వార్డులోని ఓం కాలనీ, శంకరమఠం వెనుక ప్రాంతాల జనం.

Published : 07 Oct 2022 03:18 IST

అధికారులకు తెగేసి చెప్పిన పొన్నూరు ఓం కాలనీవాసులు

పొన్నూరు, న్యూస్‌టుడే: మురుగుకాల్వలు, రోడ్లు లేని తమ ప్రాంతంలో జ్వరాలు ప్రబలి అల్లాడుతున్నామని,  సౌకర్యాలు కల్పించేవరకూ తాము పురపాలక సంఘానికి పన్నులు చెల్లించేది లేదని తెగేసి చెప్పారు గుంటూరు జిల్లా, పొన్నూరు పట్టణం 29వ వార్డులోని ఓం కాలనీ, శంకరమఠం వెనుక ప్రాంతాల జనం. తీవ్ర పారిశుద్ధ్య లోపం కారణంగా ఈ ప్రాంతాల్లో ప్రస్తుతం 20 మందికి పైగా జ్వరాల బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో గురువారం ఈ ప్రాంత పర్యటనకు వచ్చిన పురపాలక సంఘ డీఈ ఆసీఫ్‌ అలీఖాన్‌, ఏఈ హసీనాబేగం, పర్యావరణ ఇంజినీరు గౌతమిని వీరు అడ్డుకొని, తీవ్ర నిరసన తెలిపారు. కాలనీలో సిమెంటు రోడ్లు, పక్కా మురుగుకాల్వల వ్యవస్థ లేక అనేక ఏళ్లుగా ఇబ్బంది పడుతున్నట్టు వారు పేర్కొన్నారు. వసతులు కల్పించాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పెడచెవిన పెట్టి, ఇప్పుడెందుకు వచ్చారంటూ స్థానిక మహిళలు అధికారులను నిలదీశారు. ప్రతి ఏటా సక్రమంగా పన్నులు చెల్లిస్తున్నా తమకు ఎందుకు ఈ అవస్థలని ప్రశ్నించారు. ఇకపై సౌకర్యాలు కల్పించేవరకూ తాము పన్నులు చెల్లించేది లేదని స్పష్టంచేశారు. జిల్లా మలేరియా విభాగ అధికారి సుబ్బరావన్‌ ఓం కాలనీలో ఇంటింటికీ తిరిగి, పలు చోట్ల దోమల లార్వాలను గుర్తించారు. విషజ్వరంతో బాధపడుతున్న ఓ బాలిక ఇంటి పరిసరాలను పరిశీలించి, ఆమె తల్లిదండ్రులతోనూ మాట్లాడారు. కాలనీలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఇది ఇలా ఉండగా ఈ ప్రాంతంలో జ్వరంతో బాధపడుతున్న వారు ఎవరూ లేరని వైద్యవర్గాలు ప్రకటించడం విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని