చక్రస్నానంతో సేదదీరిన స్వామి

తిరుమల శ్రీవారికి తొమ్మిదిరోజులపాటు వైభవంగా జరిగిన బ్రహ్మోత్సవాలు బుధవారం రాత్రి జరిగిన ధ్వజావరోహణంతో ముగిశాయి.

Published : 07 Oct 2022 03:18 IST

తిరుచ్చి సేవలో మాజీ సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ దంపతులు
వైభవంగా ముగిసిన బ్రహ్మోత్సవాలు

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల శ్రీవారికి తొమ్మిదిరోజులపాటు వైభవంగా జరిగిన బ్రహ్మోత్సవాలు బుధవారం రాత్రి జరిగిన ధ్వజావరోహణంతో ముగిశాయి. తొమ్మిది రోజులపాటు పలు వాహనాల్లో ఊరేగి అలసిసొలసిన స్వామివారు స్నపన తిరుమంజన సేవలో సేదతీరారు. జీయర్లు, అర్చకుల నేతృత్వంలో సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకించారు. మంగళవాద్యాల నడుమ పండితుల వేదఘోష, భక్తుల గోవింద నామస్మరణల మధ్య గర్భాలయంలోని మూలమూర్తి అంశమైన సుదర్శన చక్రత్తాళ్వార్‌కు పుష్కరిణిలో పవిత్రస్నానం చేయించారు. ఉదయం పల్లకీ ఉత్సవం, తిరుచ్చి ఉత్సవంలోనూ, చక్రస్నాన మహోత్సవంలోనూ సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ దంపతులు పాల్గొన్నారు. మాడవీధి నుంచి శ్రీ వరాహస్వామి ఆలయానికి చేరుకున్న స్వామి తిరుచ్చిని మాజీ సీజేఐ ఒకవైపు, మరోవైపు తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి మోశారు. శ్రీ వరాహస్వామి ఆలయంలో స్వామివారికి, చక్రత్తాళ్వార్లకు నిర్వహించిన స్నపన తిరుమంజనంలో పాల్గొన్నారు. చివరిగా పుష్కరిణిలో నిర్వహించిన చక్రస్నానంలో జస్టిస్‌ రమణ దంపతులు పాల్గొని పుణ్యస్నానాలు చేశారు. వీరితోపాటు ఝార్ఖండ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రవిరంజన్‌, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

బ్రహ్మోత్సవాల్లో 5.69 లక్షలమందికి దర్శనం  

తితిదేలోని అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది, పోలీసులు, శ్రీవారి సేవకుల సమష్టి కృషితో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు విజయవంతంగా నిర్వహించినట్లు తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాల్లో తొలి ఎనిమిది రోజుల్లో 5.69 లక్షలమంది శ్రీవారిని దర్శించుకున్నారని వెల్లడించారు.

ఈ నెల 11 నుంచి 15 వరకు హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ స్టేడియంలో శ్రీవేంకటేశ్వరస్వామి వైభవోత్సవాలు జరుగుతాయన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని