ఎమ్మెల్యే అనుచరుల సంస్థకు జగనన్న ఇళ్ల నిర్మాణ బాధ్యతలు

గుంటూరు నగర పరిధిలోని రెండు జగనన్న కాలనీల్లో కేటగిరీ-3 ఇళ్ల నిర్మాణ బాధ్యతలను అనంతపురం జిల్లా అధికార పార్టీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అనుచరుల సంస్థకు అప్పగించారు.

Published : 07 Oct 2022 03:18 IST

గుంటూరు (జిల్లాపరిషత్తు), న్యూస్‌టుడే: గుంటూరు నగర పరిధిలోని రెండు జగనన్న కాలనీల్లో కేటగిరీ-3 ఇళ్ల నిర్మాణ బాధ్యతలను అనంతపురం జిల్లా అధికార పార్టీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అనుచరుల సంస్థకు అప్పగించారు. లబ్ధిదారులు సొంతంగా కట్టుకోలేకపోతే తామే కట్టిస్తామని సీఎం జగన్‌ గతంలో చెప్పారు. పేరేచర్ల కాలనీలో 9,508 మందికి మంజూరుచేయగా, వారిలో 65 మంది మినహా ఎవ్వరూ సొంతంగా కట్టుకోవట్లేదు. అలాగే ఏటుకూరు-1 లేఔట్‌లోనూ మొత్తం 5,539 ప్లాట్లకు గాను 4,141 మందికి మంజూరు చేశారు. ఇక్కడ ఎవ్వరూ సొంతంగా కట్టుకోవడానికి ముందుకు రాలేదు. వీటన్నింటి నిర్మాణాన్ని రాక్రిడ్‌ అనే సంస్థకు కట్టబెట్టారు. ఆ సంస్థ రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి అనుచరులది. పేరేచర్లలో రూ.169.97 కోట్లు, ఏటుకూరు-1లో రూ.74.53 కోట్లు కలిపి మొత్తం రూ.244.50 కోట్ల విలువైన పనులివి. సాధారణంగా రూ.100 కోట్ల పైబడిన పనులకు రివర్స్‌ టెండర్‌ పిలవాలి. కానీ ఇక్కడ అలా చేయలేదు. ఎక్కడో రాప్తాడు ఎమ్మెల్యే అనుచరుల సంస్థకు ఈ పనులు అప్పగించడం వివాదాస్పదమైంది. ఈ నెల 4న జరిగిన జిల్లా సమీక్షా సమావేశానికి ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి హాజరై వేదిక మీదే జిల్లా అధికారులను ప్రశ్నించారు. తమ వారికి ఇనుము, ఇసుక, సిమెంటు కేటాయింపులో జాప్యం చేస్తున్నారని, దీనివల్ల నిర్మాణాలు జాప్యం అవుతున్నాయని పేర్కొన్నట్లు సమాచారం. కేటాయింపులో తమవారికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులపై ఎమ్మెల్యే ఒత్తిడి తీసుకొస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

మా ప్రమేయం లేదు: ఆంజనేయులు, గుంటూరు పశ్చిమ సబ్‌ డివిజన్‌ డీఈ

‘పేరేచర్ల, ఏటుకూరు-1 జగనన్న కాలనీల్లో కేటగిరీ-3 లబ్ధిదారుల ఇళ్లు కట్టే అవకాశాన్ని రాక్రిడ్‌ సంస్థ పొందింది. రాష్ట్రస్థాయిలోనే ఎంపిక చేసినందున ఇక్కడ మా ప్రమేయం లేదు. ఇటీవలే మరో రెండు సంస్థలు ముందుకురావడంతో వారికీ ప్రభుత్వం ఇళ్లు కేటాయిస్తుంది. ఎమ్మెల్యే మాపై ఎలాంటి ఒత్తిడి చేయడం లేదు. కొన్ని సూచనలు చేశారు. ఆయన ప్రతినిధులు నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారు.’

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని