పునరుత్పాదక విద్యుత్‌ లక్ష్యం దాటేశాం

విద్యుత్‌ పంపిణీ సంస్థలు (డిస్కంలు) కొనుగోలు చేసే విద్యుత్‌లో పునరుత్పాదక విద్యుత్‌ వాటా 18% ఉండాలని రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) నిర్దేశించింది.

Published : 07 Oct 2022 04:47 IST

ఏపీఈఆర్‌సీ నుంచి 18 శాతానికి అనుమతి
ఇప్పటికే 24 శాతానికి చేరిన వాటా

ఈనాడు, అమరావతి: విద్యుత్‌ పంపిణీ సంస్థలు (డిస్కంలు) కొనుగోలు చేసే విద్యుత్‌లో పునరుత్పాదక విద్యుత్‌ వాటా 18% ఉండాలని రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) నిర్దేశించింది. నిరుడు ఇది 17 శాతంగా ఉంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పునరుత్పాదక విద్యుత్‌ కొనుగోలు బాధ్యతలను (ఆర్‌పీపీవో) ఏపీఈఆర్‌సీ ఇటీవల ఆమోదించింది. ఇందులో వచ్చే అయిదేళ్లలో పునరుత్పాదక విద్యుత్‌ వాటా ఎంత ఉండాలనే దానిపై డిస్కంలకు నిర్దేశించింది. అయితే... ఇప్పటికే డిస్కంలు తీసుకుంటున్న మొత్తం విద్యుత్‌లో పునరుత్పాదక విద్యుత్‌ వాటా 24% ఉండటం గమనార్హం. రాష్ట్రంలో గ్రిడ్‌ గరిష్ఠ విద్యుత్‌ డిమాండ్‌ రోజుకు సుమారు 10-11 వేల మెగావాట్ల మధ్య ఉంటోంది. దీనికి అనుగుణంగా విద్యుత్‌ సరఫరా కోసం సుమారు 18,439 మెగావాట్ల ఉత్పాదక సామర్థ్యమున్న వనరులు అందుబాటులో ఉన్నాయి. ఇందులో పునరుత్పాదక విద్యుత్‌ ప్రాజెక్టుల (పవన, సౌర) వాటా 6,833 మెగావాట్లు. రాష్ట్ర విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యంలో వీటి వాటా సుమారు 37 శాతంగా ఉంది. థర్మల్‌ విద్యుత్‌ 6,040 మెగావాట్లు, జల విద్యుత్‌ 1,901, గ్యాస్‌, ఇతర వనరుల ద్వారా 3,665 మెగావాట్లు వస్తోందని డిస్కంలు పేర్కొన్నాయి.

అయిదేళ్ల తర్వాతి లక్ష్యం.. ఇప్పటికే చేరుకున్నాయ్‌

రాష్ట్రంలో 2026-27 నాటికి మొత్తం విద్యుత్‌ సరఫరాలో 24% పునరుత్పాదక విద్యుత్‌ ఉండాలని ఏపీఈఆర్‌సీ నిర్దేశించింది. ఈ విద్యుత్‌ను ఒకేసారి పెంచుకుంటూ వెళ్తే గ్రిడ్‌ భద్రతకు ఇబ్బంది ఏర్పడుతుందని అభిప్రాయపడింది. దాంతో ఏటా కొంత శాతం పెంచుకోవడానికి డిస్కంలకు అనుమతించింది. ఈమేరకు 2023-24లో 19%, 2024-25లో 20%, 2025-26లో 22%, 2026-27లో 24% వంతున తీసుకోవాలంది. అయితే... అయిదేళ్లలో సాధించాల్సిన లక్ష్యాన్ని డిస్కంలు ఇప్పటికే చేరుకోవడం గమనార్హం.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని