ఆసుపత్రులు రావట్లేదు!

‘‘ఉమ్మడి జిల్లా కేంద్రాలతోపాటు.. రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ కార్పొరేషన్లలో మొత్తం 16 ప్రాంతాల్లో.. 30-50 ఎకరాల్లో హెల్త్‌ హబ్‌లు ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వం ఆలోచన.

Published : 07 Oct 2022 04:47 IST

భూములు ఉచితంగా ఇస్తామన్నా స్పందించని కార్పొరేట్‌ యాజమాన్యాలు
లక్ష్యం రూ.8వేల కోట్ల పెట్టుబడులు.. వచ్చింది రూ.300 కోట్లు
హెల్త్‌హబ్‌ల ఏర్పాటు తీరిదీ

ఈనాడు, అమరావతి: ‘‘ఉమ్మడి జిల్లా కేంద్రాలతోపాటు.. రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ కార్పొరేషన్లలో మొత్తం 16 ప్రాంతాల్లో.. 30-50 ఎకరాల్లో హెల్త్‌ హబ్‌లు ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వం ఆలోచన. ఒక్కొక్కరికి 5 ఎకరాలు కేటాయిస్తాం. ఒక్కో చోట 5 మందికి అవకాశం ఉంటుంది. అంతకన్నా ఎక్కువ డిమాండ్‌ ఉంటే 10 మందికి అవకాశం కల్పిస్తాం. మూడేళ్లలో వారు రూ.100 కోట్ల చొప్పున పెట్టుబడి పెట్టాలి. సూపర్‌ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటు చేయాలి. భూములు ఉచితంగా ఇస్తాం. ప్రైవేటు భాగస్వామ్యంతో కార్పొరేట్‌ వైద్యం ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. కనీసం 80 కార్పొరేట్‌ ఆసుపత్రులు వచ్చే అవకాశం ఉంది’’ హెల్త్‌ హబ్‌ల ఏర్పాటుపై సీఎం జగన్‌ చెప్పిన మాటలు ఇవి.

రాష్ట్రంలో 16 హెల్త్‌ హబ్‌ల ఏర్పాటుకోసం ప్రభుత్వం పిలిచిన టెండర్లకు స్పందన కరవైంది. మూడు సార్లు టెండర్లు పిలిస్తే.. మూడు చోట్ల మాత్రమే ఒక్కో బిడ్‌ చొప్పున దాఖలైంది. దీంతో మిగిలిన 13 చోట్ల టెండర్ల ప్రక్రియను నిలిపేసి.. కొత్త విధివిధానాలను అధికారులు రూపొందిస్తున్నారు. హెల్త్‌ హబ్‌ల ఏర్పాటుకు మొదటి సారి టెండరు ప్రకటన జారీ చేస్తే ఒక్క బిడ్‌ కూడా దాఖలు కాలేదు. భూముల విలువ మొత్తానికి సరిపడా బ్యాంకు గ్యారంటీ ఇవ్వాలన్న నిబంధనపై ఆసుపత్రుల యాజమాన్యాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. తర్వాత దీన్ని సవరించి బిడ్‌ సెక్యూరిటీ కింద రూ.10 లక్షలు చెల్లిస్తే సరిపోతుందని రెండోసారి టెండరు ప్రకటన ఇస్తే కేవలం కర్నూలు, ఒంగోలు జిల్లాల నుంచి మాత్రమే స్పందన వచ్చింది. మూడో సారి టెండరు ప్రకటనకు రాజమహేంద్రవరంలో ఆసుపత్రి ఏర్పాటుకు ఒకే ఒక్క బిడ్‌ దాఖలైంది. ఈ హబ్‌ల్లో ఏర్పాటయ్యే ఆసుపత్రుల ద్వారా సుమారు రూ.8 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తే.. రూ.300 కోట్లు మాత్రమే ఇప్పటి వరకు రావటం గమనార్హం.

మూడో సారీ అంతే..

ప్రభుత్వం నగరానికి దగ్గరలో 5 ఎకరాల భూమి ఇస్తామంది. రెండేళ్ల తర్వాత వాటిని రిజిస్ట్రేషన్‌ చేస్తామని చెప్పింది. ప్రభుత్వ ప్రకటనకు కార్పొరేట్‌ ఆసుపత్రుల నిర్వాహకులు వరుస కడతారని అధికారులు భావించగా పరిస్థితి తారుమారైంది. హెల్త్‌ హబ్‌ల ఏర్పాటుకు ఈ ఏడాది మార్చి 30న మూడోసారి టెండరు ప్రకటనను రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (ఏపీఐఐసీ) జారీ చేసింది. నిర్దేశిత గడువులోగా స్పందన రాలేదు. గడువు పొడిగించినా పరిస్థితిలో మార్పు లేదు. మూడేళ్లలో రూ.100 కోట్ల పెట్టుబడులు పెట్టాలన్న నిబంధనతో పాటు కనీసం 100 పడకలు ఉండాలని.. మొత్తం పడకల్లో 50 శాతం ఆరోగ్యశ్రీ రోగులకు కేటాయించాలన్న నిబంధన ఉండటంతోనే ఆసుపత్రుల యాజమాన్యాలు ఆలోచిస్తున్నాయని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం వచ్చిన మూడు బిడ్‌లకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకుని.. మిగిలిన 13 హబ్‌లకు సంబంధించి మరోసారి టెండరు ప్రకటన జారీ చేస్తామని అధికారులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని