సంక్షిప్త వార్తలు(6)

అనకాపల్లి జిల్లా దేవరాపల్లి పీహెచ్‌సీకి కొత్త భవనం నిర్మిస్తామని మంత్రి విడదల రజిని తెలిపారు. ఈమేరకు విజయవాడలో శుక్రవారం విలేకరులతో ఆమె మాట్లాడుతూ... దేవరాపల్లి పీహెచ్‌సీలోని ప్రసూతి గదిలో నీటి లీకేజీపై ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనాన్ని ప్రస్తావించారు.

Updated : 08 Oct 2022 05:41 IST

దేవరాపల్లి పీహెచ్‌సీకి కొత్త భవనం
మంత్రి రజిని వెల్లడి

ఈనాడు, అమరావతి: అనకాపల్లి జిల్లా దేవరాపల్లి పీహెచ్‌సీకి కొత్త భవనం నిర్మిస్తామని మంత్రి విడదల రజిని తెలిపారు. ఈమేరకు విజయవాడలో శుక్రవారం విలేకరులతో ఆమె మాట్లాడుతూ... దేవరాపల్లి పీహెచ్‌సీలోని ప్రసూతి గదిలో నీటి లీకేజీపై ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనాన్ని ప్రస్తావించారు. నాడు-నేడు కింద రూ.50 లక్షలతో అక్కడ అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. డిప్యూటీ సీఎం సూచన మేరకు రూ.2.5 కోట్లతో పీహెచ్‌సీకి కొత్త భవనాన్ని నిర్మిస్తామన్నారు. ఇటీవల మాచర్ల ప్రభుత్వాసుపత్రిలో శిశువు విషయంలో జరిగిన పొరపాటుకు బాధ్యులైన వారి నుంచి ఇప్పటికే వివరణ తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రజాప్రతినిధులు ఇతర రాష్ట్రాలకు వెళ్లి చికిత్సలు చేయించుకోవడాన్ని విలేకరులు ప్రస్తావించగా అది వారి వ్యక్తిగతమన్నారు.


13 నుంచి ప్రజానాట్య మండలి సాంస్కృతిక కార్యక్రమాలు

ఈనాడు, అమరావతి: సీపీఐ జాతీయ మహాసభలను పురస్కరించుకొని ఈ నెల 13 నుంచి 17వరకు విజయవాడలో కళా ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు ప్రజానాట్య మండలి ప్రధాన కార్యదర్శి చిన్నం పెంచలయ్య తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాల బోచర్‌ను శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 13న సాయంత్రం 4గంటలకు లెనిన్‌ సెంటర్‌లో ఆట, పాట, మాట, కళాకారుల ధూంధాం నిర్వహిస్తున్నామని, ఇందులో ప్రముఖ ప్రజావాగ్గేయకారుడు ఎమ్మెల్సీ గోరటి వెంకన్న పాల్గొంటారని పేర్కొన్నారు. 14నుంచి రైల్వే స్టేషన్‌కు సమీపంలోని హనుమంతరాయ గ్రంథాలయ హాలులో కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.


పాలనను ప్రజలకు చేరువ చేయండి

ప్రొబేషనరీ ఐఏఎస్‌ అధికారులకు సీఎం సూచన

ఈనాడు, అమరావతి: ప్రజలకు ప్రభుత్వ పాలనను చేరువ చేసేలా పని చేయాలని ప్రొబేషనరీ ఐఏఎస్‌ అధికారులకు సీఎం జగన్‌ సూచించారు. సామాన్యుడికి సైతం పాలన అందుబాటులో ఉండేలా చూడాలని మార్గనిర్దేశనం చేశారు. శుక్రవారం 2021 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన తొమ్మిది మంది ప్రొబేషనరీ అధికారుల బృందం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిశారు. అంతకుముందు ఓటర్ల జాబితా సవరణ, ఎన్నికల ప్రక్రియపై అవగాహన కోసం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఎం.కె.మీనాను సైతం కలిశారు. అనంతరం తాడికొండ గ్రామంలో పర్యటించి ఓటర్ల నమోదు, సవరణ ప్రక్రియను పరిశీలించారు. అధికారుల బృందంలో పి.ధాత్రిరెడ్డి, మేఘ స్వరూప్‌, ప్రఖర్‌జైన్‌, విద్యాధరి, శివనారాయణ్‌శర్మ, అశుతోష్‌ శ్రీవాత్సవ, అపూర్వ భరత్‌, రాహుల్‌ మీనా, సూరపాటి ప్రశాంత్‌కుమార్‌ ఉన్నారు.


సీపీఎస్‌ అమలుకు ముందు ఎంపికైన ఉద్యోగుల జాబితా సేకరణ

ఈనాడు, అమరావతి: కాంట్రిబ్యూటరీ పింఛన్‌ పథకం (సీపీఎస్‌) అమల్లోకి వచ్చిన 1 సెప్టెంబరు 2004కు ముందు ఉద్యోగానికి ఎంపికై ఆ తర్వాత విధుల్లో చేరిన ఉద్యోగుల వివరాలను ఆర్థిక శాఖ సేకరిస్తోంది. ఇప్పటికే అయా విభాగాలు అందించిన డేటాలో ఏమైనా మార్పులు, చేర్పులు ఉంటే చేసి, తుది జాబితాను ఈనెల 12లోపు అందించాలని అన్ని విభాగాధిపతులు, సచివాలయ అధికారులను కోరింది. కొన్ని నియామకాల్లో ఆగస్టు 31, 2004కు ముందు ఎంపిక ప్రక్రియ పూర్తయినా సీపీఎస్‌ అమల్లోకి వచ్చిన తర్వాత ఉద్యోగాల్లో చేరారు. సీపీఎస్‌ అమల్లోకి రాకముందే ఉద్యోగాల ఎంపిక పూర్తయినందున వారికి పాత పింఛన్‌ విధానం అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది.


ఆత్మవిశ్వాసమే తోడుగా అడుగేయి ముందుకు!

వైకల్యముందని బాధ పడకుండా ఏదోఒకటి సాధించాలన్న తపనతో ముందుకు సాగుతున్నారు తెలంగాణలోని నాగర్‌కర్నూల్‌ జిల్లా తిమ్మాజిపేట మండలం మరికల్‌కు చెందిన అన్నాచెల్లెళ్లు శంకర్‌, సుజాత. ఎవరి మీద ఆధారపడకుండా ఒకరికొకరు తోడుగా నిలుస్తున్నారు. తల్లిదండ్రులది మేనరికం కావడంతో వీరు వైకల్యంతో జన్మించారు. శంకర్‌కు కాళ్లు, చేతులు సరిగ్గా ఎదగలేదు. మూడడగుల ఎత్తుకు మించి ఉండరు. సుజాతకు రెండు కాళ్లు లేవు. అయినా కుంగిపోకుండా చదువులో దూసుకెళ్తున్నారు. డీఎడ్‌ పూర్తిచేసిన శంకర్‌ ఏడాది పాటు ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ప్రస్తుతం టీఆర్టీకి సన్నద్ధమవుతున్నారు. డిగ్రీ పూర్తిచేసిన సుజాత పీజీ చేసేందుకు ప్రవేశ పరీక్ష రాశారు. చదువుతూనే పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు మహబూబ్‌నగర్‌లోని ఎస్సీ స్టడీ సర్కిల్‌లో వసతితో కూడిన సీటును కోరడానికి సుజాత సోదరుడితో కలిసి ఇటీవల ఇలా ఆ జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణికి వచ్చారు. తప్పకుండా సీటు ఇస్తానని మహబూబ్‌నగర్‌ కలెక్టర్‌ వెంకట్‌రావు వారికి హామీ ఇచ్చారు. వారు ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా ‘ఈనాడు’ తీసిన చిత్రమిది.

- ఈనాడు, మహబూబ్‌నగర్‌


ఏపీఈడబ్ల్యూఐడీసీలో ఆరు నెలలుగా అందని వేతనాలు

ఈనాడు, అమరావతి: ఏపీ విద్య, సంక్షేమ మౌలిక సదుపాయాల కల్పన సంస్థ(ఏపీఈడబ్ల్యూఐడీసీ) ఉద్యోగులకు గత ఆరు నెలలుగా జీతాలు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు జీతాలు ఇవ్వలేదు. ఈ కార్పొరేషన్‌ ఇంజినీరింగ్‌ పనులు చేస్తుంది. ఈ పనుల నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలు చూసినందుకు ఆయా విభాగాల నుంచి కొంత మొత్తం ఛార్జీల కింద తీసుకుంటుంది. ఆ నిధులతోనే ఉద్యోగులకు జీతాలు చెల్లించాల్సి ఉంటుంది. ఇటీవల కొంతకాలంగా ‘నాడు-నేడు’ పనులు, టెండర్ల బాధ్యతలను ఈ కార్పొరేషన్‌ చూస్తోంది. ‘నాడు-నేడు’ పనులకు సంబంధించి ఎక్కువ నిధులు రాకపోవడంతో జీతాలు ఇవ్వడం లేదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని