గోపాలమిత్రల గోడు గుర్తుందా?

అధికారంలోకి వస్తే గోపాలమిత్రలకు న్యాయం చేస్తామన్న సీఎం జగన్‌.. మాట మరిచారు. వారి ఆదాయం పెంచకపోగా.. పాడి పశువుల కృత్రిమ గర్భధారణకు గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన అదనపు ప్రోత్సాహకానికీ కోతపెట్టారు.

Published : 08 Oct 2022 02:32 IST

నాడు ఆదుకుంటామని హామీ ఇచ్చిన జగన్‌

మూడున్నరేళ్లయినా అతీ గతీలేని వైనం

ఈనాడు, అమరావతి: అధికారంలోకి వస్తే గోపాలమిత్రలకు న్యాయం చేస్తామన్న సీఎం జగన్‌.. మాట మరిచారు. వారి ఆదాయం పెంచకపోగా.. పాడి పశువుల కృత్రిమ గర్భధారణకు గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన అదనపు ప్రోత్సాహకానికీ కోతపెట్టారు. చాలీచాలని వేతనంతో కుటుంబాలు రోడ్డున పడుతున్నా.. తమ గోడు వినేవారే లేరన్న ఆవేదన గోపాలమిత్రల్లో వ్యక్తమవుతోంది. 22 ఏళ్లుగా సేవలందిస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, రైతుభరోసా కేంద్రాల్లో పశుసంవర్థక సహాయకులుగా (ఏహెచ్‌ఏ) నియమించాలని వారు కోరుతున్నారు.

పాల ఉత్పత్తి పెంపులో గోపాలమిత్రలే
నాణ్యమైన పశుసంతతిని అభివృద్ధి చేసి పాల ఉత్పత్తి పెంచాలనే లక్ష్యంతో 1999లో గోపాలమిత్రల వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఆరు నెలల శిక్షణ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో సంకరజాతి పశువుల అభివృద్ధిలో వీరే కీలకపాత్ర పోషించారు. పశుసంవర్థకశాఖ సేవలు అంతగా లేని గ్రామాల్లో వీరే కీలకం. ఎదకొచ్చిన పశువును ఆసుపత్రికి తీసుకెళ్లి కృత్రిమ గర్భధారణ చేయించడం వ్యయప్రయాసలతో కూడిన వ్యవహారం కావడంతో గోపాలమిత్రల సేవలను రైతులు వినియోగించుకునేవారు. ఏ అవసరం వచ్చినా ముందు వీరికే ఫోన్‌చేసి పిలిచేవారు. రాష్ట్రంలో 2,500 మంది గోపాలమిత్రలు పనిచేస్తున్నారు.

గతంలో నెలకు రూ.10వేలకు పైగా అందేలా..
గోపాలమిత్రలుగా నియమితులైనప్పుడు తొలుత రూ.1,000 గౌరవ వేతనం ఇచ్చేవారు. తర్వాత రూ.2వేలు, రూ.3,500 చేశారు. 2018 నవంబరులో ప్రభుత్వం రూ.6,500 చేసింది. కృత్రిమ గర్భధారణ కార్యక్రమంలో భాగంగా ఒక్కో స్ట్రా రూ.40 చొప్పున పశుగణాభివృద్ధి సంస్థ నుంచి కొని తీసుకెళ్లేవారు. రైతుల నుంచి రూ.70 తీసుకునేవారు. అంటే వీరికి రూ.30 మిగిలేది. గోపాలమిత్రల ఆదాయం మరింత పెంచేందుకు గత ప్రభుత్వం పశుగణాభివృద్ధి సంస్థకు చెల్లించే రూ.40 కూడా వెనక్కి ఇచ్చే ఏర్పాటుచేసింది. నెలకు సగటున 60 కృత్రిమ గర్భధారణలు చేసినా.. ఈ రూపంలో రూ.4,200 వస్తాయి. మొత్తంగా రూ.10,700 వరకు లభించేది.

కోత పెట్టిన జగన్‌ ప్రభుత్వం
గోపాలమిత్రలకు అదనపు ప్రోత్సాహకంగా రూ.40 ఇవ్వాలనే నిర్ణయాన్ని జగన్‌ ప్రభుత్వం పక్కన పెట్టింది. 2019 నుంచి దీన్ని అమలుచేయట్లేదు. దీంతో ఒక్కో గోపాలమిత్ర సగటున నెలకు రూ.2,500 చొప్పున కోల్పోతున్నారు. ఆ మొత్తాన్ని విడుదల చేయాలని మూడున్నరేళ్లుగా కోరుతున్నా పట్టించుకోవడం లేదు. 2,100 మందిని ఏహెచ్‌ఏ ఇన్‌ఛార్జిలుగా నియమించినా.. వారికి గౌరవవేతనంగా రూ.6,500 మాత్రమే దక్కుతోంది. గోపాలమిత్రలకు న్యాయం చేస్తామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్‌ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లయినా వారి గోడు పట్టించుకోలేదు. నెలకు రూ.16,500 వచ్చేలా చూస్తామన్న హామీ కూడా విస్మరించారనే ఆవేదన వ్యక్తమవుతోంది. ‘20 ఏళ్లనుంచి పనిచేస్తున్నారు. గోపాలమిత్రల సేవలు బాగుంటున్నాయనే ఫీడ్‌బ్యాక్‌ ఉంది. ప్రభుత్వ నిబంధనల మేరకు గోపాలమిత్రలకు ఉద్యోగ భద్రత ఉంటుంది’ అని 2019 సెప్టెంబరు 1న విజయవాడలో అప్పటి పశుసంవర్థకశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ ఇచ్చిన హామీ కూడా అమలు కాలేదు.

 


కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి
వెంకటేశులు, ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర గోపాలమిత్రల సంఘం

చంద్రబాబు వచ్చాక గోపాలమిత్ర గోవిందా అని జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. అధికారంలోకి రాగానే న్యాయం చేస్తామని, నెలకు రూ.16,500 అందేలా చూస్తామని అనంతపురంలో హామీ ఇచ్చారు. మూడున్నరేళ్లయినా అమలుచేయలేదు. మా కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది.


ఉద్యోగ భద్రత కల్పించాలి
కె.వెంకటరమణ, అధ్యక్షుడు, రాష్ట్ర గోపాలమిత్రల సంఘం

రాష్ట్రంలో పనిచేస్తున్న 2,500 మంది గోపాలమిత్రలకు ఉద్యోగభద్రత కల్పించాలి. కృత్రిమ గర్భధారణ ప్రోత్సాహకం వెంటనే విడుదల చేయాలి. రైతుభరోసా కేంద్రాల్లో పశుసంవర్థక శాఖ సహాయకులు పోస్టుల్లో నియమించాలి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని