జనం తోడుగా మహా జాగృతి

ఓ వైపు అల్పపీడన ద్రోణి ప్రభావంతో జోరువాన.. మరోవైపు చిత్తడి రహదారులు.. ప్రతికూల పరిస్థితుల్లోనూ అమరావతి రైతుల మహాపాదయాత్ర దిగ్విజయంగా సాగుతోంది.

Published : 08 Oct 2022 03:40 IST

అల్లూరి స్ఫూర్తిగా మహాపాదయాత్ర ముందడుగు

భీమవరంలో అపూర్వ స్వాగతం

జోరువానలోనూ అడుగడుగునా ఆదరణ

ఈనాడు డిజిటల్‌, ఏలూరు, న్యూస్‌టుడే- భీమవరం పట్టణం, వీరవాసరం, గునుపూడి: ఓ వైపు అల్పపీడన ద్రోణి ప్రభావంతో జోరువాన.. మరోవైపు చిత్తడి రహదారులు.. ప్రతికూల పరిస్థితుల్లోనూ అమరావతి రైతుల మహాపాదయాత్ర దిగ్విజయంగా సాగుతోంది. రాష్ట్రానికి అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని అరసవల్లి వరకు చేపట్టిన యాత్ర శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లాలో కొనసాగింది. పెదఅమిరంలో ఉదయం 9 గంటలకు యాత్ర మొదలై భీమవరం పట్టణం, పాలకోడేరు మండలం విస్సాకోడేరు, గొరగనమూడి, పెన్నాడ, శృంగవృక్షం మీదుగా వీరవాసరం మండలంలోకి ప్రవేశించి నందమూరుగరువు నుంచి వీరవాసరం చేరుకుంది. ఉదయం యాత్ర ప్రారంభానికి ముందునుంచే వర్షం కురుస్తోంది. రైతులు ఎక్కడా వెనకంజ వేయలేదు. రైతులు భీమవరానికి చేరుకునే సమయానికి భారీ ఎత్తున ప్రజలు చేరుకున్నారు. వర్షంలోనే హారతులు పడుతూ ఆహ్వానించారు. అమరావతి రైతులు, ఐకాస నాయకులు, వివిధ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు పట్టణంలోని అల్లూరి విగ్రహం వద్దకు చేరుకుని జైఅమరావతి అంటూ నినదించారు. అల్లూరి పోరాట స్ఫూర్తితో గమ్యస్థానానికి చేరుతామని ఐకాస నాయకులు ధీమా వ్యక్తం చేశారు. పట్టణంలోని రోడ్లు చెరువులను తలపిస్తుండటంతో.. ‘రోడ్లను బాగు చేయలేని వారు.. మూడు రాజధానులు కడతారా?’ అంటూ మహిళా రైతులు నినదించారు. దాదాపు ఆరు గంటల పాటు వర్షంలో తడుస్తూనే రైతులు, స్థానికులు యాత్రలో పాల్గొన్నారు.

33 వేల వత్తులతో వినూత్న స్వాగతం..
రాజధాని రైతులిచ్చిన 33 వేల ఎకరాలకు ప్రతీకగా 33 వేల వత్తులు కలిపి పాలకోడేరు మండలం శృంగవృక్షం గ్రామస్థులు దీపాలు వెలిగించారు. వాటితో రైతులకు హారతులిచ్చారు. యాత్రకు సంఘీభావంగా ఉండి నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే మంతెన రామరాజు చేతుల మీదుగా రూ.14.50 లక్షలను రైతు నాయకులకు అందజేశారు. పాలకోడేరు మండలానికి చెందిన గీత కార్మికుల బృందం వృత్తిని ప్రతిబింబించే మోకులు ధరించి వచ్చి మద్దతు తెలిపారు. వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు యువసేన బృందం యాత్రలో పాల్గొంది. రాష్ట్ర రైతు కార్యాచరణ సమితి సభ్యులు, సీపీఐ జిల్లా సభ్యులు యాత్రలో పాల్గొన్నారు.

సత్యకుమార్‌ కాళ్లు మొక్కిన మహిళలు
భోజనవిరామ అనంతరం భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ యాత్రలో పాల్గొన్నారు. అమరావతిని కాపాడాలంటూ మహిళా రైతులు ఆయన కాళ్లు మొక్కారు. సత్యకుమార్‌ మాట్లాడుతూ ‘రాజధాని అంశం కోర్టు పరిధిలో ఉన్నందున కేంద్రం జోక్యం చేసుకోవడం లేదు. రైతులకు భాజపా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. అమిత్‌షా సైతం రాజధానిని అమరావతి నుంచి కదిల్చేది లేదన్నారు. అమరావతికి మద్దతుగా పోరాడమన్నారు’ అని వివరించారు.


26వ రోజు యాత్ర ఇలా..

* ప్రారంభం: కాళ్ల మండలం పెద అమిరం
* ముగింపు: వీరవాసరం
* నడిచిన దూరం: 15 కి.మీ.


Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts