ఈడీ విచారణకు జేసీ ప్రభాకర్‌రెడ్డి

అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ శాసనసభ్యుడు, మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి శుక్రవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణకు హాజరయ్యారు.

Updated : 08 Oct 2022 04:14 IST

బీఎస్‌-3 లారీల మార్పిడి లావాదేవీలపై ఆరా

ఈనాడు, హైదరాబాద్‌: అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ శాసనసభ్యుడు, మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి శుక్రవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణకు హాజరయ్యారు. భారత్‌ స్టాండర్డ్స్‌ (బీఎస్‌)-3 ప్రమాణాలు కలిగిన లారీలను అక్రమంగా బీఎస్‌-4 వాహనాలుగా మార్చారనే ఆరోపణల నేపథ్యంలో గత జూన్‌లో ఈడీ బృందాలు హైదరాబాద్‌, అనంతపురం, తాడిపత్రిలోని ప్రభాకర్‌రెడ్డితోపాటు ఆయన కుటుంబీకుల ఇళ్లలో సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సోదాల్లో లభ్యమైన సమాచారం ఆధారంగా ఈడీ నోటీసులిచ్చింది. వాటిపై వివరణ ఇచ్చేందుకు శుక్రవారం ఆయన హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయానికి వచ్చారు. నిషేధిత బీఎస్‌-3 లారీలను బీఎస్‌-4గా మార్చారని ఏపీ రోడ్డు రవాణా సంస్థ 2020 ఫిబ్రవరిలో ఆరోపించింది. బీఎస్‌-3 లారీలను తమిళనాడు కృష్ణగిరి, ఉత్తరాఖండ్‌లోని డీలర్ల నుంచి స్క్రాప్‌ కింద కొనుక్కుని కొన్నింటిని నాగాలాండ్‌ రాజధాని కోహిమా, మరికొన్నింటిని అనంతపురంలో బీఎస్‌-4గా మార్చారనేది అభియోగం. వాటి రిజిస్ట్రేషన్‌కు నకిలీ బీమా పాలసీలనూ సృష్టించారని, నాగాలాండ్‌లో నిరభ్యంతర పత్రాలను తీసుకొని ఆంధ్రప్రదేశ్‌కు తీసుకొచ్చినట్లు గుర్తించామని పేర్కొంది. రవాణాశాఖ ఫిర్యాదుల ఆధారంగా ఏపీ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇందులో మనీలాండరింగ్‌ జరిగిందనే కోణంలో ఈడీ గత జూన్‌లో సోదాలు చేసింది. సేకరించిన సమాచారాన్ని విశ్లేషించాక తలెత్తిన సందేహాల నివృత్తికి రావాలంటూ నోటీసులిచ్చింది. ఇందులో భాగంగానే ప్రభాకర్‌రెడ్డి ఈడీ కార్యాలయానికి వచ్చారు. ఆయన 9గంటలపాటు ఈడీ కార్యాలయంలో ఉన్నారు.

దొంగ కేసులని ఈడీ వారికేం తెలుసు?
ఈడీ కార్యాలయానికి ఎందుకు వచ్చారని మీడియా ప్రశ్నించగా.. పొద్దుపోక వచ్చానంటూ ప్రభాకర్‌రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ‘పోలీసులు దొంగ కేసులు పెడితే భయపడతామా? అవి దొంగ కేసులని పాపం ఈడీ వాళ్లకేం తెలుసు? వారడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పా. నేనేం కబ్జాగానీ, ఇంకొకటి చేయలేదు. అలాంటప్పుడు నాకేం భయం? ఈడీ వాళ్లు పిలిస్తే రావాలి కదా..’ అని పేర్కొన్నారు.


ఛార్జిషీట్‌ దాఖలుకు రంగం సిద్ధం

ఈనాడు డిజిటల్‌, అనంతపురం: జేసీ ప్రభాకర్‌రెడ్డిపై ఛార్జిషీట్‌ దాఖలు చేసేందుకు అనంతపురం పోలీసులు సిద్ధమైనట్లు సమాచారం. ఆయనతోపాటు భార్య ఉమారెడ్డి, కుమారుడు అశ్మిత్‌రెడ్డి, అనుచరుడు చవ్వా గోపాల్‌రెడ్డితో కలిపి మొత్తం 13 మందిపై కోర్టులో ఛార్జిషీట్‌ వేసేందుకు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. బీఎస్‌3 వాహనాల వ్యవహారంలోనే ప్రభాకర్‌రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనిపై 2020లో జేసీ ప్రభాకర్‌రెడ్డితోపాటు మరో 12 మందిపై వివిధ పోలీసుస్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. వీటికి సంబంధించి ఛార్జిషీట్‌ వేసేందుకు శుక్రవారం జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప అనుమతి తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. 33 కేసులకు సంబంధించి సోమవారం ఛార్జిషీట్‌ దాఖలు చేసే అవకాశమున్నట్లు సమాచారం.


Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని