పోలవరంతో ముంపు ముప్పు ఉండదు

పోలవరం ప్రాజెక్టు గరిష్ఠ వరద వల్ల ఎలాంటి ముంపు సమస్య ఉండదని కేంద్ర జలసంఘం స్పష్టం చేసింది. బ్యాక్‌ వాటర్‌ వల్ల ఏర్పడే ముంపు సమస్యపై మళ్లీ అధ్యయనం చేయాలన్న మూడు రాష్ట్రాల డిమాండ్‌ను తోసిపుచ్చింది.

Published : 08 Oct 2022 03:40 IST

కేంద్ర జలసంఘం ఛైర్మన్‌ స్పష్టీకరణ

ఈనాడు, అమరావతి: పోలవరం ప్రాజెక్టు గరిష్ఠ వరద వల్ల ఎలాంటి ముంపు సమస్య ఉండదని కేంద్ర జలసంఘం స్పష్టం చేసింది. బ్యాక్‌ వాటర్‌ వల్ల ఏర్పడే ముంపు సమస్యపై మళ్లీ అధ్యయనం చేయాలన్న మూడు రాష్ట్రాల డిమాండ్‌ను తోసిపుచ్చింది. పోలవరం ప్రభావిత రాష్ట్రాలకు ఉన్న సాంకేతిక అభ్యంతరాలను ఈ నెల 19లోగా తెలియజేయాలని, వాటిని నివృత్తి చేస్తామని భరోసా ఇచ్చింది. దిల్లీలో శుక్రవారం కేంద్ర జలసంఘం ఛైర్మన్‌ ఆర్కే గుప్తా అధ్యక్షతన పోలవరం ముంపు, స్పిల్‌ వే డిజైన్లు తదితర అంశాలపై సమావేశం నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఛైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌ సైతం పాల్గొన్నారు. ముంపు సమస్య, తాజా వరదలతో ఏర్పడ్డ ఇబ్బందులు తదితర అంశాలను ప్రస్తావిస్తూ తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా రాష్ట్రాల ప్రతినిధులు తమ వాదనలను వినిపించారు. ప్రధానంగా గరిష్ఠంగా ఎంత వరదను అంచనా వేసి స్పిల్‌వే నిర్మిస్తున్నారు? బ్యాక్‌ వాటర్‌ ప్రభావం ఎంత ఉంటుంది? ఆయా ప్రాంతాల్లో ఎలాంటి రక్షణ చర్యలు తీసుకుంటున్నారు అనే రెండు ప్రధాన అంశాలు ఎజెండాగా ఈ సమావేశం జరిగింది. పోలవరం జాతీయ ప్రాజెక్టు వల్ల అన్ని రాష్ట్రాలకు ప్రయోజనమే అని జలసంఘం ఛైర్మన్‌ గుప్తా పేర్కొన్నారు.

పోలవరాన్ని ప్రత్యేకంగా చూడకండి..
‘పోలవరాన్ని ప్రత్యేకంగా చూడకూడదు. అన్ని జాతీయ ప్రాజెక్టుల విషయంలో ఎలా వ్యవహరిస్తున్నారో ఇక్కడా అదే విధానం అనుసరించాలి’ అని ఆంధ్రప్రదేశ్‌ సుస్పష్టం చేసింది. ఇతర రాష్ట్రాలు పోలవరం విషయంలో అధ్యయనాలు చేయాలంటున్నట్లుగా అన్ని జాతీయ ప్రాజెక్టుల్లోనూ చేశారా? అని ఏపీ అధికారులు ప్రశ్నించారు. అలా అన్ని జాతీయ ప్రాజెక్టుల్లోనూ చేయగలరా? అని కూడా ప్రస్తావించారు. ఏపీ తరఫున జలవనరులశాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ సి.నారాయణరెడ్డి, పోలవరం చీఫ్‌ ఇంజినీరు సుధాకర్‌బాబు హాజరయ్యారు. ఉమ్మడి సర్వేకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆంధ్రప్రదేశ్‌ స్పష్టం చేసింది. ఇందుకు ఆయా రాష్ట్రాలు సహకరించాలని పేర్కొంది.

అంత వరద వచ్చే అవకాశమే లేదు
గోదావరిలో గరిష్ఠంగా 50 లక్షల వరద వస్తుందని ఐఐటీ హైదరాబాద్‌, 58 లక్షల క్యూసెక్కుల వరద వస్తుందని ఐఐటీ రూర్కీ అధ్యయనాల గురించి ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ ప్రస్తావించగా ఏపీ అభ్యంతరం తెలిపింది. గోదావరి చరిత్రలో ఇంతవరకు 36 లక్షల క్యూసెక్కుల గరిష్ఠ వరద మాత్రమే వచ్చిందని కేంద్ర జలసంఘం కూడా పేర్కొంది. గరిష్ఠంగా 58 లక్షల క్యూసెక్కుల వరద అంచనాలున్నాయని తదనుగుణంగా స్పిల్‌ వే డిజైన్లు, బ్యాక్‌ వాటర్‌ ప్రభావం ఎదుర్కొనేలా చర్యలు ఉండాలని ఛత్తీస్‌గఢ్‌ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ వి.కె.ఇంద్రజిత్‌, చీఫ్‌ ఇంజినీరు నగారియా తదితరులు పేర్కొన్నారు. స్పిల్‌ వే డిజైన్లకు 58 లక్షల గరిష్ఠ వరదనే పరిగణనలోకి తీసుకోవాలని ఒడిశా అభిప్రాయపడింది. కేంద్ర జలసంఘం, ఏపీ నిర్వహించిన సర్వేకు కొన్ని పరిమితులు ఉన్నాయని ఒడిశా అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ముంపు ఏర్పడే ప్రాంతాల్లో జాయింట్‌ సర్వేకు, ప్రజాభిప్రాయ సేకరణకు ఒడిశా అంగీకరించాలని కేంద్ర జలసంఘం కోరింది. ఏపీ కూడా ముంపు ప్రాంతాల గుర్తింపునకు సంయుక్త సర్వేకు ఒడిశా అంగీకరించాలని విన్నవించింది. ఆపరేషన్‌ ప్రొటోకాల్‌, హైడ్రాలజీ వంటి అంశాలు తేలే వరకు సంయుక్త సర్వేకు తాము అంగీకరించబోమని ఒడిశా పేర్కొంది.

మళ్లీ అధ్యయనం చేయాలి: తెలంగాణ
పోలవరం బ్యాక్‌ వాటర్‌ ప్రభావంపై మళ్లీ అధ్యయనం చేయాలని తెలంగాణ కోరింది. తాజా వరదల నేపథ్యంలో ఏర్పడ్డ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఈ అధ్యయనం జరగాలని కోరింది. 2022 వరదల వల్ల ప్రభావితమైన 28,000 ఆవాస ప్రాంతాలు, 11,000 కుటుంబాలు, 103 గ్రామాలు సరైన బ్యాక్‌ వాటర్‌ అధ్యయనాలు అవసరమంటున్నాయని తెలంగాణ పేర్కొంది. వివిధ కేంద్ర జలసంఘం అధ్యయనాలు, 2022 జులైలో ఏర్పడ్డ వరదలను పోలుస్తూ తెలంగాణ అధికారులు అనేక అంశాలు ప్రస్తావించారు. పోలవరంలో గరిష్ఠ నీటి మట్టం వద్ద నీరు నిలబడి ఉన్నప్పుడు ఏర్పడే ప్రభావం కూడా కీలకమని తెలంగాణ పేర్కొంది. గోదావరికి ఎగువన రెండువైపులా ఉన్న అనేక వాగులు, వంకలకు సంబంధించి జాయింట్‌ సర్వే చేయాలని తెలంగాణ కోరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని