విద్యుత్తు బకాయిల చెల్లింపులో మాయాజాలం

ఆర్థిక సంఘం నిధులను పంచాయతీల విద్యుత్తు బకాయిల కింద ప్రభుత్వం చెల్లిస్తోందనడంలో నిజం లేదని పలువురు సర్పంచులు అభిప్రాయపడ్డారు.

Published : 08 Oct 2022 03:40 IST

‘ఈనాడు’తో పలు పార్టీల సర్పంచులు

ఈనాడు, అమరావతి: ఆర్థిక సంఘం నిధులను పంచాయతీల విద్యుత్తు బకాయిల కింద ప్రభుత్వం చెల్లిస్తోందనడంలో నిజం లేదని పలువురు సర్పంచులు అభిప్రాయపడ్డారు. అలా చెల్లిస్తే బకాయిల మొత్తం తగ్గకపోగా, ఇంకా ఎక్కువ ఎందుకు చూపిస్తోందని.. అంటే ఏదో మాయ ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిధులు లేక పంచాయతీలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయంటున్నారు. తాడేపల్లిలోని పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్‌ కార్యాలయం ముట్టడికి వచ్చిన సర్పంచులు ‘ఈనాడు’తో మాట్లాడారు. వివరాలు వారి మాటల్లోనే...


బకాయిలు చెల్లిస్తే సరఫరా ఎందుకు నిలిపేస్తున్నారు?
‘ఆర్థిక సంఘం నిధులను పంచాయతీల విద్యుత్తు ఛార్జీల బకాయిల కింద చెల్లిస్తున్నామని చెబుతున్నారు. అలా చెల్లిస్తే... అధికారులొచ్చి విద్యుత్తు సరఫరా ఎందుకు నిలిపివేస్తున్నారు? కేంద్రం కేటాయించిన ఆర్థిక సంఘం నిధులను పంచాయతీల బ్యాంకు ఖాతాలకు జమచేస్తే బకాయిలు మేమే దశలవారీగా చెల్లిస్తాం కదా.’

- దేవరకొండ రాము, వైకాపా సర్పంచి, అమృతలూరు, బాపట్ల జిల్లా


తీర్మానం చేసేలోపే మళ్లించారు

‘మా చిన్న పంచాయతీకి ఆర్థిక సంఘం నిధులొచ్చేది అంతంత మాత్రమే. వీటితో చిన్న చిన్న పనులైనా చేద్దామని తీర్మానం చేద్దామనుకునేలోగా 15వ ఆర్థిక సంఘం 2021-22 తొలి విడత విడుదలైన రూ.14 లక్షలు మళ్లించారు. పంచాయతీల్లో నిధుల్లేక ఏడాదిగా వీధులు, కాలువలు శుభ్రం చేసే కార్మికులకు జీతాల్లేవు. వీధిదీపాలు కూడా వేయించుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం.’

- కె.మొషియో, సీపీఎం సర్పంచి, టోకూరు, అల్లూరి సీతారామరాజు జిల్లా


పంచాయతీల్లో పరిస్థితి అత్యంత దయనీయం

‘గ్రామ పంచాయతీలను రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేసింది. కార్మికులకు జీతాలివ్వకపోతే వారితో పనులెలా చేయించుకుంటాం. ఆర్థిక సంఘం నిధులతో రూ.4 లక్షల పనులు చేయించాం. నిధుల మళ్లింపుతో బిల్లులు చెల్లించలేదు. పెట్టుబడులు ఇంకా ఎక్కడి నుంచి తెస్తాం?’

- డి.రాముడు, సీపీఎం సర్పంచి, గొల్లమందల తండా, ఎన్టీఆర్‌ జిల్లా


పనులు చేసి అప్పులపాలయ్యా

‘నాలుగు పనులు చేసి మంచిపేరు తెచ్చుకోవాలనుకున్నాం. ప్రభుత్వాన్ని నమ్మి నిండా మునిగిపోయాం. గ్రామాల్లో పనులు చేసి బిల్లులు రాక అప్పుల పాలయ్యాను. ఇంట్లో బంగారు వస్తువులు తనఖా పెట్టి తీసుకున్న రుణాన్ని సకాలంలో తీర్చనందుకు బ్యాంకులు నోటీసులిచ్చాయి. అరెకరాకుపైగా భూమి అమ్ముకున్నా. ఇదీ నాకు లభించిన బహుమతి.’

- కె.నరేశ్‌, జనసేన సర్పంచి, చిలుమూరు, బాపట్ల జిల్లా


కనీస సౌకర్యాలకూ ఇబ్బందులే

‘పంచాయతీలో నిధుల్లేక ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడానికీ ఇబ్బందులు పడుతున్నాం. పంపుసెట్‌ పాడైతే మరమ్మతులు చేయించడానికీ ఆలోచించాల్సి వస్తోంది. రోడ్లు, కాలువలూ శుభ్రం చేయించలేకపోతున్నాం. పంచాయతీలకు ఆర్థిక సంఘం నిధులు సరిగా జమ చేయకపోవడమే ఈ దుస్థితికి కారణం.’

- డి.రత్నబాబు, వైకాపా సర్పంచి, పిడపర్రు, గుంటూరు జిల్లా


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని