Vizianagaram: మాయమైన ‘మహారాజా’

విజయనగరంలో ప్రభుత్వాసుపత్రి అనగానే వెంటనే గుర్తొచ్చే పేరు మహారాజా జిల్లా ఆసుపత్రి. ఆ పేరును రాత్రికి రాత్రే మార్చేశారు.

Updated : 08 Oct 2022 08:41 IST

విజయనగరం జిల్లా ఆసుపత్రి పేరు మార్పు

ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిగా అర్ధరాత్రి బోర్డు ఏర్పాటు

ఉత్తరాంధ్రకు పెద్ద దిక్కయిన ఆసుపత్రి పేరు మార్చడంపై నిరసనలు

ఈనాడు- విజయనగరం, న్యూస్‌టుడే- విజయనగరం వైద్య విభాగం: విజయనగరంలో ప్రభుత్వాసుపత్రి అనగానే వెంటనే గుర్తొచ్చే పేరు మహారాజా జిల్లా ఆసుపత్రి. ఆ పేరును రాత్రికి రాత్రే మార్చేశారు. శుక్రవారం తెల్లారేసరికల్లా ‘మహారాజా జిల్లా ఆసుపత్రి’ బోర్డు స్థానంలో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిగా బోర్డు ఏర్పాటు చేయడ[ం ఉత్తరాంధ్ర జిల్లాల్లో చర్చనీయాంశమైంది. ఇక్కడికి వచ్చే రోగుల్లో చాలామందికి ప్రభుత్వ ఆసుపత్రి అంటే తెలియదని, మహారాజా ఆసుపత్రి అంటే వెంటనే గుర్తిస్తారని.. అలాంటి పేరును మార్చడమేమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం జిల్లాకు మంజూరు చేసిన వైద్య కళాశాలను విజయనగరం మండలం గాజులరేగ వద్ద నిర్మిస్తున్నారు. దీనికి అనుబంధంగా వైద్య విధాన పరిషత్తు పరిధిలో ఉన్న జిల్లా ఆసుపత్రిని బోధనాసుపత్రిగా మార్చారు. కొత్తగా ఉద్యోగుల నియామకాలు, ఉత్తర్వులన్నీ ప్రభుత్వ జనరల్‌ హాస్పిటల్‌ పేరుతో వస్తున్నాయి. ఇందులో భాగంగానే బోర్డు ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతుండగా.. ‘మహారాజా’ పేరు ఉంచితే తప్పేంటని జిల్లా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎలాంటి దురుద్దేశం లేకపోతే ‘మహారాజా సర్వజన ఆసుపత్రి’ అని పెట్టొచ్చు కదా అని అడుగుతున్నారు. వైద్య కళాశాల పూర్తయితే బోధనాసుపత్రి కూడా అక్కడికి వెళ్లిపోతుంది. ఇంతలోనే పేరు మార్చడం ఎందుకనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

కేజీహెచ్‌ తర్వాత పెద్ద ఆసుపత్రి..
ప్రస్తుత జిల్లా ఆసుపత్రి గతంలో స్థానిక తహసీల్దారు కార్యాలయానికి సమీపంలో ఉండేది. అప్పట్లో పది పడకలతో ఏర్పాటు చేశారు. జిల్లా అంతటికీ పెద్దాసుపత్రి ఉండాలనే ఉద్దేశంతో 1983లో కంటోన్మెంట్‌ ప్రాంతంలో నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు శంకుస్థాపన చేశారు. 1988లో అందుబాటులోకి వచ్చింది. అప్పట్లో ‘మహారాజా జిల్లా ఆసుపత్రి’ అని పేరు పెట్టారు. ఉత్తరాంధ్రలో కేజీహెచ్‌ తర్వాత ఇదే పెద్ద ఆసుపత్రి. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలతో పాటు ఒడిశా నుంచి కూడా రోగులు ఇక్కడికి వచ్చి సేవలు పొందుతున్నారు. ఈ ఆసుపత్రితోపాటు ప్రసవాల కోసం ప్రత్యేకంగా ఘోషాసుపత్రి ఉంది. పరిపాలనా సౌలభ్యం కోసం 2011లో రెండింటినీ జిల్లా ఆసుపత్రి పరిధిలోకి తెచ్చారు. రెండుచోట్ల కలిపి 300 పడకలు ఉన్నాయి. నిత్యం 600 నుంచి 700 వరకు ఓపీ ఉంటుంది. ఈ ఏడాదిలో సెప్టెంబరు వరకు జిల్లా ఆసుపత్రిలో 2,51,179, ఘోషాలో 46,725 ఓపీ నమోదైంది. 21,060 మంది జిల్లా ఆసుపత్రిలో, 11,118 మంది ఘోషాలో ఇన్‌పేషెంట్లుగా చేరి చికిత్స పొందారంటే ఈ ప్రాంత ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుందో అర్థం చేసుకోవచ్చు. కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో అశోక్‌గజపతిరాజు ఈ ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేశారు.

దశాబ్దాల చరిత్ర కలిగిన ఘోషాసుపత్రి
విజయనగరం మహారాజులు విద్య, వైద్య రంగాల అభివృద్ధికి విశేష కృషి చేశారు. మూడో విజయరామ గజపతి కుమార్తె అప్పలకొండయాంబ. సోదరుడు ఆనందగజపతి 1897లో మృతి చెందిన తర్వాత ఆమె పాలన బాధ్యతలు తీసుకున్నారు. ఉత్తరాంధ్రలో గర్భిణులకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో సొంత నిధులతో 1904లో ఇరవై పడకలతో ఘోషాసుపత్రిని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి కొన్ని లక్షల మందికి పురుడు పోసింది ఈ ఆసుపత్రి. తాజా పేరు మార్పుతో ఇదీ సర్వజన ఆసుపత్రిగా మారిపోయింది.


ఎన్‌ఎంసీ వస్తున్న నేపథ్యంలో మార్చాం
ఈ నెలలో నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ (ఎన్‌ఎంసీ) బృందం ఆసుపత్రి పరిశీలనకు రానున్న నేపథ్యంలో బోర్డును ఏర్పాటు చేశాం. పేరు మార్పుపై మాకు ఎవరి నుంచీ ఆదేశాలు రాలేదు. దీనిపై అభ్యంతరం ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం.

- కె.పద్మలీల, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్‌, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్‌, విజయనగరం.


పర్యటన పూర్తయిన తర్వాత మార్చేస్తాం

ఎన్‌ఎంసీ బృందం వస్తున్నందున రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలల వద్ద ఒకే రకంగా బోర్డులు ఉండాలని చెప్పారు. ఈ నేపథ్యంలోనే పాతది తొలగించకుండా దానిపై కొత్తది ఏర్పాటు చేశాం. బృందం వెళ్లిపోయిన తర్వాత కొత్త బోర్డు ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేస్తాం. పాత బోర్డు ఎప్పటిలాగే ఉంటుంది.

- సత్యప్రభాకరరావు, ఈఈ, ఏపీఎంఎస్‌ఐడీసీ, విజయనగరం.


జిల్లా ఆసుపత్రి పేరు మార్పుపై ఆందోళనలు

విజయనగరం వైద్య విభాగం, కురుపాం/గ్రామీణం, చీపురుపల్లి, న్యూస్‌టుడే: విజయనగరం మహారాజా ఆసుపత్రి పేరును ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిగా మార్చడాన్ని నిరసిస్తూ శుక్రవారం తెదేపా నాయకులు ఆసుపత్రి ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఆ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండు చేశారు. తెదేపా నాయకులు మాట్లాడుతూ మహారాజా పేరును మార్చి చరిత్రను తుడిచేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మంత్రి బొత్స సత్యనారాయణ, జడ్పీ అధ్యక్షుడు చిన్న శ్రీను, స్థానిక ఎమ్మెల్యే విజయనగరంలోనే పుట్టి పెరిగి రాజులు ఏర్పాటు చేసిన విద్యా సంస్థల్లోనే చదువుకున్న విషయాన్ని గుర్తు చేసుకోవాలని తెలిపారు. ఇలాగే కొనసాగితే జిల్లాలో ప్రజాప్రతినిధులు తిరగలేరని హెచ్చరించారు. భవిష్యత్తులో విజయనగరం పేరును కూడా మార్చేస్తారని ఎద్దేవా చేశారు. విజయనగరం జిల్లా ఆసుపత్రి పేరు మార్చడం అన్యాయమంటూ శుక్రవారం కురుపాంలో  టీఎన్‌ఎస్‌ఎఫ్‌ అరకు పార్లమెంట్‌ ఉపాధ్యక్షుడు ఎస్‌.గోవింద, తెదేపా నాయకులు రామకృష్ణ, మిన్నారావు, మురళీ, పవన్‌, సీతారాం తదితరులు మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. అనుమతి లేకుండా ఆందోళన చేస్తున్నారని పోలీసులు 14 మందిని అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని