CM Jagan: మే నెలాఖరుకల్లా రోడ్లు బాగు చేయాలి

వర్షాలు ఎక్కువగా కురుస్తున్నందున పట్టణాలు, నగరాల్లో రహదారుల పరిస్థితిని పరిశీలించి ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టాలని, మే నెలాఖరుకల్లా అన్ని రోడ్లు బాగు చేయాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశించారు.

Updated : 08 Oct 2022 08:43 IST

పట్టణాలు, నగరాల్లో రహదారులపై సమీక్షలో సీఎం జగన్‌

నియోజకవర్గానికో స్మార్ట్‌ టౌన్‌షిప్‌ లేఅవుట్‌ అభివృద్ధి

ఫ్లెక్సీ వ్యాపారులకు రుణాలిప్పించాలని కలెక్టర్లకు ఆదేశం

ఈనాడు, అమరావతి: వర్షాలు ఎక్కువగా కురుస్తున్నందున పట్టణాలు, నగరాల్లో రహదారుల పరిస్థితిని పరిశీలించి ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టాలని, మే నెలాఖరుకల్లా అన్ని రోడ్లు బాగు చేయాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశించారు. పనుల సీజన్‌ మొదలవగానే ఈ రహదారులపై దృష్టిపెట్టాలన్నారు. పురపాలక, పట్ట్టణాభివృద్ధి శాఖలపై సీఎం తన క్యాంపు కార్యాలయంలో పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌, సీఎస్‌ సమీర్‌శర్మ, ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. వివిధ అంశాలపై అధికారులకు ఆదేశాలిచ్చారు.

* చెత్త నిల్వ కేంద్రాల నిర్వహణలో అత్యుత్తమ విధానాలు పాటించాలి. పరిసర ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడకుండా వీటి నిర్వహణలో ఎటువంటి ప్రమాణాలు పాటిస్తున్నామో అవగాహన కల్పించండి.

* మున్సిపాలిటీల్లో వ్యర్థాల నిర్వహణ ప్రక్రియ పూర్తిస్థాయిలో జరుగుతుందా  లేదా నిరంతరం పరిశీలించాలి. పురపాలకసంఘాల వారీగా వ్యర్థాల నిర్వహణలో ఉన్న సౌకర్యాలు, మురుగునీటి శుద్ధికి సంబంధించి ఇప్పటికే ఉన్న మౌలిక వసతులు, ఇంకా కల్పించాల్సిన సదుపాయాలపై నివేదికలు తయారు చేయండి.

* కృష్ణా నది వరద ముంపు లేకుండా నిర్మించిన రిటైనింగ్‌ వాల్‌ బండ్‌ను మొక్కలు, విద్యుద్దీపాలతో తీర్చిదిద్దండి. విజయవాడలో అంబేడ్కర్‌ పార్కుకు వెళ్లే రోడ్లను అందంగా తీర్చిదిద్దండి. తర్వాత విశాఖలో సుందరీకరణ పనులు చేపట్టాలి.

* జగనన్న కాలనీల్లో మురుగునీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయాలి. పెద్ద కాలనీల నిర్మాణం పూర్తవుతున్న కొద్దీ ప్రాధాన్యక్రమంలో నీరు, మురుగు కాల్వలు, విద్యుత్‌ సదుపాయాలు కల్పించాక మురుగునీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయాలి.

* జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ కింద ప్రతి నియోజకవర్గంలో ఓ లేఅవుట్‌ను తీర్చిదిద్దాలి. దీనిపై జిల్లాల వారీగా కలెక్టర్లతో సమీక్షించి, ప్రత్యేక దృష్టి సారించాలి.

* వైఎస్‌ఆర్‌ చేయూత కింద లబ్ధి పొందుతున్న మహిళలు, ఆ డబ్బుతో స్వయం ఉపాధి పొందేలా చర్యలు తీసుకోండి. వారికి స్వయం ఉపాధి మార్గ్గాలు చూపించి, సంపూర్ణ సాధికారతకు కృషి చేయండి.

ఫ్లెక్సీ తయారీదారులకు రుణాలిప్పించండి
ప్లాస్టిక్‌ ఫ్లెక్సీలను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించినందున దీనిని సంపూర్ణంగా అమలు చేసేందుకు సంబంధిత వ్యాపారులతో కలెక్టర్లు సమావేశాలు నిర్వహించాలి. వాళ్లు ప్లాస్టిక్‌ నుంచి వస్త్ర బ్యానర్ల వైపు మళ్లేలా కావాల్సిన ఆర్థిక వనరులను సమకూర్చుకునేందుకు తోడుగా నిలవండి. అవసరమైతే రుణాలు ఇప్పించండి. సకాలంలో తిరిగి చెల్లించే వారికి ప్రభుత్వం నుంచి వడ్డీ రాయితీ కల్పించేలా అధికారులు ఆలోచన చేయండి’ అని అధికారులకు నిర్దేశించారు.

స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డులు పొందినవారికి అభినందన
స్వచ్ఛ సర్వేక్షణ్‌-2022లో 11 అవార్డులు గెల్చుకున్న తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, శ్రీకాకుళం కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్లు, కమిషనర్లు పులివెందుల, పుంగనూరు, పొదిలి, సాలూరు మున్సిపాల్టీల ఛైర్మన్లు, వైస్‌ఛైర్మన్లు కమిషనర్లు, ఇతర అధికారులను సీఎం అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని